Share News

సారా ఏరులు

ABN , Publish Date - Apr 13 , 2024 | 01:20 AM

గ్రామాల్లో నాటు సారా ఏరులై పారుతోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలు గ్రామాల్లో సారా తయారీదారులు లక్షల లీటర్లు బెల్లం పులుసు కవర్లలో ప్యాక్‌ చేసి భూమిలో పాతిపెట్టి దాస్తున్నారు. గట్టు చప్పుడు కాకుండా నాటు సారా సిద్ధం చేసి రవాణా, విక్రయాలకు పాల్పడుతున్నారు.

సారా ఏరులు
సారా బట్టీ స్వాధీనం చేసుకున్న సెబ్‌ అధికారులు (ఫైల్‌ ఫొటో)

- పెదబొడ్డేపల్లి, పెదపేటలో అధికంగా తయారీ

- గత మూడు నెలల్లో 77 మంది అరెస్టు

- వేల లీటర్లు బెల్లం పులుసు ధ్వంసం

- ఎన్నికల నేపథ్యంలో దాడులు ముమ్మరం

నర్సీపట్నం, ఏప్రిల్‌ 12 : గ్రామాల్లో నాటు సారా ఏరులై పారుతోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలు గ్రామాల్లో సారా తయారీదారులు లక్షల లీటర్లు బెల్లం పులుసు కవర్లలో ప్యాక్‌ చేసి భూమిలో పాతిపెట్టి దాస్తున్నారు. గట్టు చప్పుడు కాకుండా నాటు సారా సిద్ధం చేసి రవాణా, విక్రయాలకు పాల్పడుతున్నారు.

నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలోని పెదబొడ్డేపల్లి, రోలుగుంట మండలం పెదపేట, కొంతలం గ్రామాలు నాటు సారాకి అడ్డాగా మారాయి. మారుమూల ప్రాంతాలలో బట్టీలు ఏర్పాటు చేసుకొని సారా తయారు చేసి చుట్టు పక్కల ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గత మూడు నెలలుగా సారా తయారీదారులపై సెబ్‌ అధికారులు ఉక్కుపాదం మోపారు. నర్సీపట్నం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కార్యాలయం పరిధిలోని నర్సీపట్నం, మాకవరపాలెం, రోలుగుంట కోటవురట్ల మండలాలలో 107 మందిని బైండోవర్‌ చేశారు.

మూడు కేటగిరీలుగా నిఘా

నాటు సారా తయారీ, రవాణా, విక్రయాలు చేసే వారిని ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి నిఘా పెంచారు. ఎ- కేటగిరీలోకి గ్రామంలో సారా తయారు చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేవారు వస్తారు. బి-కేటగిరీలోకి గ్రామంలో తయారు చేసిన నాటు సారాను చుట్టు పక్కల గ్రామాలకు తీసుకు వెళ్లి విక్రయించేవారు వస్తారు. కేవలం సారా అమ్మకాలు మాత్రమే చేసేవారు సి- కేటగిరీలోకి వస్తారు. కాగా ఎన్నికల నోటిఫికేషన్‌కి రెండు నెలల ముందు నుంచి స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు ముమ్మరం చేసి భారీగా నాటు సారా సీజ్‌ చేసి, బెల్లం పులుసు ధ్వంసం చేశారు. జనవరి నెలలో 48 నాటు సారా కేసులు నమోదు చేసి 29 మందిని అరెస్టు చేశారు. 48 లీటర్లు నాటు సారా సీజ్‌ చేసి 9100 బెల్లం పులుసు ధ్వంసం చేశారు. ఫిబ్రవరిలో 55 కేసులు నమోదు చేసి 25 మందిని అరెస్టు చేశారు. 22 లీటర్లు నాటు సారా సీజ్‌ చేసి 19,030 లీటర్లు బెల్లం పులుసు ధ్వసం చేశారు. మార్చి నెలలో 60 కేసులు నమోదు చేసి 23 మందిని అరెస్టు చేసి 106.75 లీటర్లు సారా సీజ్‌ చేశారు. 31,800 లీటర్లు బెల్లం పులుసు ధ్వంసం చేశారు.

గ్రామాల్లో అపరేషన్‌ పరివర్తన

సారా తయారీదారులను గుర్తించి ఆపరేషన్‌ పరివర్తన పథకంలో వారికి స్వయం ఉపాధి చూపిస్తున్నారు. నర్సీపట్నం సెబ్‌ స్టేషన్‌ పరిధిలో రోలుగుంట మండలం కొంతలం, పెదపేట గ్రామాలలో 80 మందికి రూ.50వేలు చొప్పున రుణాలు మంజూరు చేశారు. చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని ఉపాధి పొందుతున్నారని అధికారులు చెప్పారు. నర్సీపట్నం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ సునీల్‌ కుమార్‌ మాట్లాడుతూ నాటుసారా తయారు చేసినా, రవాణా, విక్రయాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Apr 13 , 2024 | 01:20 AM