Share News

సంత షెడ్లు నిరుపయోగం

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:48 AM

ఏజెన్సీ వారపు సంతల్లో నిర్మించిన సంత షెడ్లు నిరుపయోగంగా మారాయి. ఇదే క్రమంలో సంతల్లో వసతి సదుపాయం లేక చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీలో గిరిజనులకు వారపు సంతలే ప్రధాన మార్కెట్‌లు. దీంతో ప్రతి అవసరానికి గిరిజనులు వారపు సంతలపైనే ఆధారపడతారు. ఒక్క మాటలో చె ప్పాలంటే సంతలే వారికి సూపర్‌ మార్కెట్‌లు. దీంతో ఏజెన్సీలో ఎంపిక చేసిన 17 సంతల్లో రూ.68 లక్షల వ్యయంతో షెడ్లు నిర్మించారు. కానీ వాటి వినియోగంపై అధికారులు, వర్తకులు, గిరి రైతులు ప్రత్యేక శ్రద్ధ కనబరచకపోవడంతో ప్రస్తుతం అవి వినియోగానికి దూరమయ్యాయి. దీంతో ఏజెన్సీ వారపు సంతల్లో చిరు వర్తకులకు వసతి పెద్ద సమస్యగా మారింది.

సంత షెడ్లు నిరుపయోగం
హుకుంపేటలో నిరుపయోగంగా ఉన్న సంత షెడ్‌లు

- ఏజెన్సీ వ్యాప్తంగా 17 వారపు సంతల్లో రూ.68 లక్షలతో నిర్మాణం

- వినియోగంలో లేక చిరు దుకాణాలకు వసతి సమస్య

(ఆంధ్రజ్యోతి- పాడేరు)

ఏజెన్సీ వారపు సంతల్లో నిర్మించిన సంత షెడ్లు నిరుపయోగంగా మారాయి. ఇదే క్రమంలో సంతల్లో వసతి సదుపాయం లేక చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీలో గిరిజనులకు వారపు సంతలే ప్రధాన మార్కెట్‌లు. దీంతో ప్రతి అవసరానికి గిరిజనులు వారపు సంతలపైనే ఆధారపడతారు. ఒక్క మాటలో చె ప్పాలంటే సంతలే వారికి సూపర్‌ మార్కెట్‌లు. దీంతో ఏజెన్సీలో ఎంపిక చేసిన 17 సంతల్లో రూ.68 లక్షల వ్యయంతో షెడ్లు నిర్మించారు. కానీ వాటి వినియోగంపై అధికారులు, వర్తకులు, గిరి రైతులు ప్రత్యేక శ్రద్ధ కనబరచకపోవడంతో ప్రస్తుతం అవి వినియోగానికి దూరమయ్యాయి. దీంతో ఏజెన్సీ వారపు సంతల్లో చిరు వర్తకులకు వసతి పెద్ద సమస్యగా మారింది.

ఏజెన్సీలోని వారపు సంతల్లో చిరు వర్తకులకు ఉపయోగపడాయనే ఆలోచనతో గతంలో సంత షెడ్లను నిర్మించారు. ఒక్కో సంత షెడ్‌లో 40 దుకాణాలు ఉండేలా ఒక్కో సంతలో రూ.4 లక్షల వ్యయంతో వాటిని గుత్తులపుట్టు, హుకుంపేట, కించుమండ, జి.మాడుగుల, వంట్లమామిడి, పెదబయలు, ముంచంగిపుట్టు, అరకు, సుంకరమెట్ట, డముకు, అనంతగిరి, కాశీపట్నం, అన్నవరం, చింతపల్లి, జీకేవీధి, ఆర్వీనగర్‌, కాకరపాడు ప్రాంతాల్లో నిర్మించారు. అయితే వాటి నిర్మాణం విషయంలో మార్కెటింగ్‌ శాఖ అధికారులు రైతుల అభిప్రాయాలకు విరుద్ధంగా వ్యవహరించారు. దీంతో సంతల్లో నిర్మించిన షెడ్లు వినియోగానికి దూరమయ్యాయి. వర్తకులు షెడ్లలో దుకాణాలు పెట్టుకునేందుకు వీలు లేకపోవడంతో పాటు, షెడ్లలో దుకాణాలను నిర్వహిస్తే క్రయవిక్రయాలు సాగని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏజెన్సీ వారపు సంతల్లో నిర్మించిన షెడ్లు నిరుపయోగంగా మారాయి.

వసతి లేక చిరు వర్తకుల అవస్థలు

ఏజెన్సీ వారపు సంతల్లో తమ దుకాణాలు పెట్టుకునేందుకు సరైన వసతి లేకపోవడంతో చిరు వర్తకులు అవస్థలు పడుతున్నారు. ఏజెన్సీలో ఎక్కువ కాలం వర్షాలు కురవడంతో సంతల్లో దుకాణాలను నిర్వహించడానికి నానా యాతన పడుతున్నామని వారంటున్నారు. సంతల్లో రేకుల షెడ్ల నమూనాలో చిన్నచిన్న షెడ్లను నిర్మిస్తే అందులో దుకాణాలు పెట్టుకోవడానికి అనువుగా ఉంటుందని వర్తకులు అంటున్నారు. సంతకు తీసుకువచ్చిన అటవీ/వ్యవసాయ ఉత్పత్తులను పెట్టుకుని విక్రయించేందుకు వసతి లేకపోవడంతో ఎక్కడో ఒక చోట వాటిని పెట్టి ఏదో ధరకు విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడుతుందని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెటింగ్‌ శాఖ అధికారులు స్పందించి ఇప్పటికైనా ఏజెన్సీ వారపు సంతల్లో వసతి సదుపాయాల కల్పనకు అవసరమైన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Jan 17 , 2024 | 12:48 AM