Share News

ఇసుక తోడేళ్లు

ABN , Publish Date - Jan 17 , 2024 | 11:45 PM

అనకాపల్లి మండలం తగరంపూడి వద్ద శారదా నదిలో మళ్లీ ఇసుక తవ్వకాలు మొదలయ్యాయి. గతంలో కొంతమంది ఇసుక అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేయడంతో నిలిచిపోయిన తవ్వకాలు సంక్రాంతి పండుగ వేళ మళ్లీ గుట్టుగా మొదలయ్యాయి.

ఇసుక తోడేళ్లు
తగరంపూడిలో ఖాళీ ప్రదేశంలో రవాణాకు సిద్ధంగా ఉంచిన ఇసుక పోగులు

తగరంపూడి వద్ద శారదా నదిలో మళ్లీ దర్జాగా ఇసుక అక్రమ తవ్వకాలు

పట్టించుకోని పోలీసు, రెవెన్యూ, గనుల శాఖలు

అనకాపల్లి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి మండలం తగరంపూడి వద్ద శారదా నదిలో మళ్లీ ఇసుక తవ్వకాలు మొదలయ్యాయి. గతంలో కొంతమంది ఇసుక అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేయడంతో నిలిచిపోయిన తవ్వకాలు సంక్రాంతి పండుగ వేళ మళ్లీ గుట్టుగా మొదలయ్యాయి. రెవెన్యూ, పోలీస్‌, గనుల శాఖల అధికారులతో కొందరు వైసీపీ నాయకులు మామ్మూళ్లు మాట్లాడుకుని శారదా నదిలో ఇసుకను రాత్రి వేళల్లో తోడేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మండలంలోని కోడూరులో ఇసుక డిపో ఎత్తేయడంతో అనకాపల్లి పరిసరాల్లో ఇసుకకు బాగా డిమాండ్‌ పెరిగింది. ఇదే అదునుగా భావించి కొంత మంది వైసీపీ నాయకులు ఇసుక తవ్వకాలు జరిపి అమ్ముకొంటున్నారు. తగరంపూడి గ్రామానికి ఆనుకొని వున్న నూకాలమ్మ తల్లి గుడి, ఊరికి శివారున ఉన్న శ్మశాన వాటిక ప్రదేశాల్లో ఇసుక తోడేస్తున్నారు. శారదా నది నుంచి ఎడ్లబళ్లపై ఇసుక గ్రామంలోకి రవాణా చేసుకొని తగరంపూడిలో ఖాళీ ప్రదేశాల్లో నిల్వ చేస్తున్నారు. ఈ ఇసుకను కుంచంగి, కూండ్రం, రాజాం, అనకాపల్లి, తుమ్మపాల పరిసరాల్లో ప్రైవేటు నిర్మాణ పనులకు ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తున్నారు. పర్యావరణ చట్టాలకు విరుద్ధంగా శారదా నదిలో ఇసుక తవ్వకాలు జరపరాదని గతంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా వైసీపీ స్థానిక నేత ఒకరు తానే అన్నీ అయి ఇసుక తవ్వకాలు దగ్గరుండి జరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో తగరంపూడిలో అక్రమ ఇసుక తవ్వకాలపై స్థానికులు కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇసుక తవ్వకాలు నిలిపేశారు. సంక్రాంతి పండుగ ప్రారంభం నుంచి గత మూడు రోజులుగా ఇసుక తవ్వకాలు మళ్లీ ప్రారంభించినా పోలీసు, రెవెన్యూ, గనుల శాఖాధికారులు మౌనంగా ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Jan 17 , 2024 | 11:45 PM