ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్
ABN , Publish Date - Sep 22 , 2024 | 12:52 AM
ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ మొదలైంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో రీచ్‌లు లేకపోవడంతో నిర్మాణదారులకు శ్రీకాకుళం, రాజమండ్రి ప్రాంతాల నుంచి ఇసుక రవాణా చేయనున్నారు.
తొలి రోజు అంతంతమాత్రంగా స్పందన
రెండో రోజు 600 నుంచి 800 టన్నుల బుకింగ్
శ్రీకాకుళం నుంచి తెప్పించుకునేందుకు అత్యధికుల మొగ్గు
20 టన్నుల ఇసుకకు పన్ను రూ.6,000
రవాణా చార్జీ రూ.13,000-రూ.14,000
టన్ను రూ.1,000కు లభిస్తుందంటున్న గనుల శాఖ అధికారి
విశాఖపట్నం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):
ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ మొదలైంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో రీచ్‌లు లేకపోవడంతో నిర్మాణదారులకు శ్రీకాకుళం, రాజమండ్రి ప్రాంతాల నుంచి ఇసుక రవాణా చేయనున్నారు. నగరానికి రాజమండ్రి దూరం కావడంతో ఎక్కువ మంది శ్రీకాకుళం నుంచి ఇసుక తెప్పించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.
ఆన్‌లైన్ బుకింగ్ గురువారమే ప్రారంభమైనా తొలిరోజు పెద్దగా స్పందన కనిపించలేదు. కానీ శుక్రవారం ఒక్కరోజే ఆరు నుంచి ఎనిమిది వందల టన్నుల ఇసుక బుకింగ్ జరిగినట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. రీచ్‌ల వద్ద ఇసుక ఉచితమే అయినప్పటికీ పలు రకాల పన్నుల రూపంలో టన్నుకు రూ.300 వరకూ చెల్లించాల్సి ఉంటుంది. ఇక రీచ్‌ల నుంచి నగరానికి రవాణా నిమిత్తం జిల్లా యంత్రాంగం ధర నిర్ణయించింది. 80 కిలోమీటర్ల దూరం వరకు కిలోమీటరుకు రూ.6.90, అంతకు మించి దూరానికి అదనంగా రూ.3.50 ఖరారు చేసింది. దీని ప్రకారం వంశధార నదిలో రీచ్‌ల నుంచి నగరానికి ఇసుక తీసుకురావడానికి సగటున లారీ కిరాయి రూ.13 వేల నుంచి రూ.14 వేల వరకు (ఎన్‌ఏడీ, గాజువాక, మల్కాపురం, పెందుర్తి ప్రాంతాలు) వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు 20 టన్నుల ఇసుకకు ప్రభుత్వానికి పన్నుల రూపేణా రూ.6 వేలు, రవాణా చార్జీలు రూ.13 వేల నుంచి రూ.14 వేలు కలిపితే రూ.19 వేల నుంచి రూ.20 వేలు అవుతుంది. అంటే టన్ను రమారమి రూ.1000కు లభిస్తుందని గనుల శాఖ అధికారి ఒకరు వివరించారు. గత ప్రభుత్వం టన్ను ఇసుక రూ.1,200 నుంచి రూ.1,300కు విక్రయించింది.
మూడు నెలల క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రెండు డిపోల్లో ఉన్న ఇసుకను మొదట్లో రూ.1,376 (అగనంపూడి), రూ.958 (భీమిలి)కు విక్రయించారు. భీమిలిలో నిల్వలు అయిపోయిన తరువాత అగనంపూడిలో రూ.1,076కు అమ్మారు. అయినా డిపో నుంచి నిర్మాణం జరిగే చోటకు చేరవేతకు రవాణా చార్జీలు అదనం కావడంతో టన్నుకు రూ.1,500 నుంచి రూ.1,800 చెల్లించాల్సి వచ్చింది. దీంతో వినియోగదారుల నుంచి వ్యతిరేకత వచ్చింది. చివరకు అగననంపూడిలో ఇసుక పూర్తిగా అయిపోవడంతో డిపోను మూసివేశారు. ఈలోగా ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభం కావడంతో రీచ్‌ల నుంచి నేరుగా తెచ్చుకునేందుకు అవకాశం ఏర్పడింది. అయితే టన్ను, రెండు టన్నులు అవసరం ఉన్నవారు శ్రీకాకుళం నుంచి తెచ్చుకోలేరని, ఎక్కువ ఇసుక అవసరం ఉన్నవారికి మాత్రం ధర విషయంలో వెసులుబాటు ఉందని అంటున్నారు. కొద్దిమొత్తంలో ఇసుక అవసరమైతే గతంలో మాదిరిగానే టన్నుకు రూ.1500 నుంచి రూ.1800 వరకు వెచ్చించాల్సి వచ్చేలా ఉందంటున్నారు. కాగా ఉత్తరాంధ్రలో విశాఖ నగరంలోనే ఇసుక వినియోగం ఎక్కువ ఉంటుంది. నెలకు సగటు 20 వేల నుంచి 30 వేల టన్నులు అవసరం అవుతుంది. సీజన్‌లో 30 టన్నులు దాటితే, వర్షాకాలంలో 20 టన్నుల వరకు అవసరం అవుతుందని సివిల్ ఇంజనీర్ ఒకరు పేర్కొన్నారు.