కుంగిన కల్వర్టు
ABN , Publish Date - Oct 20 , 2024 | 10:40 PM
మండలంలోని బరడ నుంచి లక్ష్మీపురం పంచాయతీ కేంద్రానికి వెళ్లే మార్గమధ్యంలో గల డైనిజోల సమీపంలో ప్రధాన రహదారిపై గల కల్వర్టు ఆదివారం కుంగిపోయింది. దీంతో బరడ, బుంగాపుట్టు, లక్ష్మీపురం పంచాయతీలతో పాటు ఒడిశాకు చెందిన సుమారు 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
50 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
ముంచంగిపుట్టు, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బరడ నుంచి లక్ష్మీపురం పంచాయతీ కేంద్రానికి వెళ్లే మార్గమధ్యంలో గల డైనిజోల సమీపంలో ప్రధాన రహదారిపై గల కల్వర్టు ఆదివారం కుంగిపోయింది. దీంతో బరడ, బుంగాపుట్టు, లక్ష్మీపురం పంచాయతీలతో పాటు ఒడిశాకు చెందిన సుమారు 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఈ రహదారే ఆధారం. వాహనాల రాకపోకలు స్తంభించిపోవడంతో పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం ఇసుకలోడుతో అటుగా వెళుతున్న టిప్పర్ కల్వర్టు దాటుతున్న సమయంలో వాహనం బరువుకు కల్వర్టు పూర్తిగా కుంగిపోయి లారీ ఓ పక్కకు ఒరిగిపోయింది. ఈ కల్వర్టు దశాబ్దాల కాలం నాటిది కావడంతో పటుత్వం కోల్పోయింది. ఈ మార్గంలో పలు చోట్ల పలు కల్వర్టులు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. ఏ క్షణంలోలైనా అవి కూలిపోతాయని ఈ ప్రాంతవాసులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అయినా ఫలితం కానరాలేదు. కాగా ప్రస్తుతం డైనిజోల సమీపంలో కల్వర్టు కుంగిపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం అటుగా ద్విచక్ర వాహనం సైతం వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే పలు గ్రామాల ప్రజలు 108 అత్యవసర వాహన సేవలకు సైతం దూరమయ్యారు. అధికారులు స్పందించి వెంటనే ఈ కల్వర్టుకు మరమ్మతులు చేయించాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.