Share News

‘ఫ్రీ హోల్డ్‌’లో సిబ్బంది బలి!

ABN , Publish Date - Jun 08 , 2024 | 12:49 AM

ఆనందపురం మండలం రామవరం సర్వే నంబరు 164-3లో 1.53 ఎకరాలకు ఫ్రీహోల్డ్‌ సర్టిఫికెట్‌ మంజూరు వ్యవహారంలో తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు మండల స్థాయి అధికారులు నివేదిక సమర్పించినట్టు తెలిసింది.

 ‘ఫ్రీ హోల్డ్‌’లో సిబ్బంది బలి!

‘రామవరం’ భూమి వ్యవహారంలో తమ తప్పును కప్పి పుచ్చుకునేలా అధికారుల నివేదిక

గ్రామ రెవెన్యూ అధికారి, రెవెన్యూ సహాయకుడు, తహసీల్దారు కార్యాలయంలో ఫ్రీ హోల్డ్‌ సర్టిఫికెట్ల జారీకి ప్రతిపాదనలు సిద్ధం చేసే ఉద్యోగిపై చర్యలకు సిఫారసు

మరింత లోతుగా దర్యాప్తునకు గ్రామస్థుల డిమాండ్‌

విశాఖపట్నం, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి):

ఆనందపురం మండలం రామవరం సర్వే నంబరు 164-3లో 1.53 ఎకరాలకు ఫ్రీహోల్డ్‌ సర్టిఫికెట్‌ మంజూరు వ్యవహారంలో తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు మండల స్థాయి అధికారులు నివేదిక సమర్పించినట్టు తెలిసింది. రామవరం గ్రామ రెవెన్యూ అధికారి, రెవెన్యూ సహాయకుడు, తహసీల్దారు కార్యాలయంలో ఫ్రీ హోల్డ్‌ సర్టిఫికెట్ల జారీకి ప్రతిపాదనలు సిద్ధం చేసే ఉద్యోగిపై చర్యలకు సిఫారసు చేసినట్టు సమాచారం. ఇంకా ఫ్రీహోల్డ్‌ సర్టిఫికెట్ల మంజూరుకు ముందు గ్రామంలో క్షేత్రస్థాయి విచారణ చేపట్టినప్పుడు రెవెన్యూ సిబ్బందిని తప్పుదోవ పట్టించి సర్వే నంబరు 164-3లో 1.53 ఎకరాలకు డీపట్టా పొందిన రైతు, అతని భూమిని లీజుకు తీసుకున్న ఆసామితోపాటు స్థానిక ప్రజా ప్రతినిధిపై క్రిమినల్‌ చర్యలకు సిఫారసు చేశారని తెలిసింది.

రామవరం సర్వే నంబర్‌ 164-3లో 1.53 ఎకరాలను గ్రామంలో 57 మంది గూడులేని నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన అధికారులు అందుకోసం లేఅవుట్‌కు అనుమతించారు. అయితే అదే 1.53 ఎకరాలకు ఫ్రీ హోల్డ్‌ సర్టిఫికెట్‌ అనుమతులు మంజూరుచేసిన విషయం ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకురావడంతో కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆనందపురం తహసీల్దార్‌ హేమంతకుమార్‌, ఇతర సిబ్బంది గురువారం భూమిని పరిశీలించారు. అనంతరం విచారణ నివేదిక రూపొందించినట్టు తెలిసింది. ఒక సర్వే నంబరులో భూమి ఫ్రీహోల్డ్‌ సర్టిఫికెట్‌ మంజూరు కోసం ప్రతిపాదనలు సంబంధిత వీఆర్వో నుంచి తీసుకుంటారు. ఇంకా మండల రెవెన్యూ కార్యాలయంలో ఉన్న రికార్డులు, ఆన్‌లైన్‌లో ఉన్న వివరాలను పరిశీలించిన తరువాతే ఆ ప్రతిపాదనలపై తహసీల్దారు సంతకం చేసి ఆర్డీవోకు పంపించాలి. విచిత్రం ఏమిటంటే రామవరం సర్వే నంబరు 164-3లో 1.53 ఎకరాలను ఇళ్ల పట్టాలకు కేటాయించిన విషయం ఆనందపురం తహసీల్దారు కార్యాలయ రికార్డుల్లో ఉంటుంది. అయినప్పటికీ ఫ్రీ హోల్డ్‌ సర్టిఫికెట్‌ మంజూరుకు ఎలా సిఫారసు చేయాల్సి వచ్చిందనే వివరాలు విచారణ నివేదికలో పేర్కొనలేదు. దీనిపై భీమిలి ఆర్డోవో, జిల్లా కలెక్టర్‌ మరింత లోతుగా విచారణ చేపట్టి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని రామవరం గ్రామస్థులు కోరుతున్నారు. దీనికి అనుగుణంగానే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

Updated Date - Jun 08 , 2024 | 12:49 AM