పారిశ్రామిక క్లస్టర్‌గా సబ్బవరం
ABN , Publish Date - Oct 15 , 2024 | 11:20 PM
సబ్బవరం మండలాన్ని పారిశ్రామిక క్లస్టర్‌గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, అనకాపల్లి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఎంపీ సీఎం రమేశ్ పేర్కొన్నారు.
జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తా
గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు
అనకాపల్లి ఎంపీ పీఎం రమేశ్
సబ్బవరం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): సబ్బవరం మండలాన్ని పారిశ్రామిక క్లస్టర్‌గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, అనకాపల్లి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఎంపీ సీఎం రమేశ్ పేర్కొన్నారు. మండలంలోని గొటివాడలో మంగళవారం జరిగిన పల్లె పండుగ- పంచాయితీ వారోత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ ప్రసంగిస్తూ.. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం 10 వేల నుంచి 12 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి 30 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేసిందని, తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించిందని ఆరోపించారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వం భవనాలకు వైసీపీ రంగులు, జగన్ బొమ్మలు వేసుకున్నారని, కోర్టులు మొట్టికాయలు వేస్తే.. ఆ రంగులు తొలగించడానికి కోట్లాది రూపాయలు వృథా చేశారని విమర్శించారు. రానున్న ఐదేళ్లలో రూ.50 వేల కోట్లతో గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కృషి చేస్తున్నారన్నారు. కలుషిత తాగునీటి కారణంగా పలురకాల వ్యాధులబారిన పడుతున్నారని, ఈ సమస్యను తొలగించేందుకు ఎంపీ నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయిస్తానన్నారు.
ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు మాట్లాడుతూ, పీఎం చంద్రబాబు పరిపాలన అనుభవం, విజన్ రాష్ట్రాభివృద్ధికి ఎంతో అవసరమని అన్నారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు బసు ప్రయాణం హామీలు అమలుచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పెందుర్తి ఇన్‌చార్జి గండి బాబ్జీ, వైస్‌ఎంపీపీ ఝాన్సీలక్ష్మీరాణి, స్థానిక సర్పంచ్ సాలాపు మీన, ఇతర పంచాయతీల సర్పంచులు దాడి లావణ్య, ఆకుల శ్రీహేమ, మామిడి శంకరరావు, ఎంపీటీసీ బొండా శేషుకుమారి, కూటమి నేతలు భరణికాన బాబూరావు, గొర్లి రామునాయుడు, కర్రి కనకరాజు, మహాలక్ష్మీనాయుడు, ఇందలి వెంకటరమణ, బీఏ రావు, సాలాపు వెంకటేశ్వరరావు, దొడ్డి ప్రకాశ్, బోకం స్వామినాయుడు, చైతన్య, రొంగలి దేముడు, ఎంపీడీవో పద్మజ, తహసీల్దార్ బి.చిన్నికృష్ణ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.