జడ్పీలో హడావిడిగా బిల్లులు
ABN , Publish Date - Jun 12 , 2024 | 01:19 AM
ఉమ్మడి జిల్లాలో గ్రామీణ నీటి సరఫరా విభాగం పరిధిలోని పథకాల నిర్వహణ, మరమ్మతులు (ఆపరేషన్ అండ్ మెయింటెన్స్)కు సంబంధించి రూ.మూడు కోట్ల బిల్లులు చెల్లింపునకు అధికారులు తెగ ఆరాటపడుతున్నారు.

అధికారుల ఆరాటం
రూ.3 కోట్ల చెల్లింపునకు కసరత్తు
అకౌంట్స్ విభాగం నుంచి గ్రాంట్స్ సెక్షన్‌కు...
అనుమానాలు అనేకం
ఏజెన్సీలో రూ.కోటి బిల్లుకు మాత్రమే ఆమోదం: సీఈవో
విశాఖపట్నం, జూన్ 11 (ఆంధ్రజ్యోతి):
ఉమ్మడి జిల్లాలో గ్రామీణ నీటి సరఫరా విభాగం పరిధిలోని పథకాల నిర్వహణ, మరమ్మతులు (ఆపరేషన్ అండ్ మెయింటెన్స్)కు సంబంధించి రూ.మూడు కోట్ల బిల్లులు చెల్లింపునకు అధికారులు తెగ ఆరాటపడుతున్నారు. ఈ మేరకు జిల్లా పరిషత్‌లోని అకౌంట్స్ విభాగం నుంచి మూడు రోజుల క్రితం బిల్లులు గ్రాంట్స్ విభాగానికి వెళ్లాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరే ముందు మూడు కోట్ల రూపాయల బిల్లుల చెల్లింపునకు హడావిడి పడడంపై పలువురు ఉద్యోగులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. బిల్లులు గ్రాంట్స్ విభాగానికి వచ్చిన మాట వాస్తవమేనని, అయితే జడ్పీ సీఈవో ఆమోదించలేదని సిబ్బంది చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో మొత్తం 43 నీటి పథకాల నిర్వహణ, మరమ్మతులకు సుమారు రూ.35 కోట్ల అవసరమని గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీర్లు ప్రతిపాదించారు. అయితే 15వ ఆర్థిక సంఘం నుంచి జిల్లా పరిషత్ (జడ్పీ)కి వచ్చిన నిధుల నుంచి రూ.6.5 కోట్లు నీటి పథకాల నిర్వహణకు కేటాయించారు. మిగిలిన మొత్తం గ్రామీణ నీటి సరఫరా విభాగానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సి ఉంది. గడచిన ఐదేళ్ల నుంచి నీటి పథకాల నిర్వహణకు ప్రభుత్వం కొద్దిమొత్తమే ఇవ్వడంతో కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇదిలావుండగా జడ్పీ కేటాయించిన రూ.6.5 కోట్లకు సంబంధించి అనకాపల్లి జిల్లా నుంచి రూ.2.3 కోట్లకు ఈ ఏడాది మార్చి 15న బిల్లులు వచ్చాయి. పాడేరు డివిజన్ పరిధిలో పథకాల నిర్వహణకు ఖర్చు చేసిన రూ.కోటికి ఆరు నెలల క్రితమే బిల్లులు అందాయి. అయితే పాడేరు బిల్లుల మంజూరులో అధికారులు తాత్సారం చేశారు. ఈలోగా అనకాపల్లి జిల్లా నుంచి రూ.2.3 కోట్లకు మార్చిలో బిల్లులు వచ్చినా అప్పటికే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఆమోదించలేకపోయారు. అయితే ఈనెల నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు తరువాత సుమారు రూ.3 కోట్ల బిల్లులు ఆమోదించాలని అధికారులు ప్రయత్నాలు మొద లెట్టారు. ఈ నేపథ్యంలో అకౌంట్స్ విభాగం సిబ్బంది మూడు రోజుల్లో బిల్లులు స్ర్నూట్నీ చేసి గ్రాంట్స్ విభాగానికి పంపించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బిల్లులు ఆమోదించవచ్చునని కొందరు చెప్పినా అధికారులు పట్టించుకోకుండా ముందుకువెళ్లడం అనుమానాలకు తావిస్తోంది. కాగా బిల్లులు ఆమోదంపై జడ్పీ సీఈవో ఎం.పోలినాయుడు వద్ద ప్రస్తావించగా పాడేరు డివిజన్‌లో నీటి పథకాల నిర్వహణకు ఖర్చు చేసిన రూ.కోటి విలువైన బిల్లులు ఆమోదించాలని సిబ్బందికి ఆదేశించానన్నారు. ఆరు నెలల క్రితమే బిల్లులు వచ్చినా నిధులు లేకపోవడంతో జాప్యం జరిగిందన్నారు. అనకాపల్లి నుంచి వచ్చిన బిల్లులతోపాటు మరికొన్ని బిల్లులు మొత్తం రూ.3 కోట్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.