Share News

వైసీపీ సభకు ఆర్టీసీ బస్సులు!

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:36 AM

ప్రజా రవాణా శాఖ (పీటీడీ) అధికారులు అధికార పార్టీ సేవలో తరించిపోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాతోపాటు ఉత్తర కోస్తాలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాల్గొనే అధికారిక సభలే కాకుండా వైసీపీ పరంగా నిర్వహించే సభలకు కూడా జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ బస్సులను నిరభ్యంతరంగా ఇచ్చేస్తున్నారు.

వైసీపీ సభకు ఆర్టీసీ బస్సులు!
ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులు

ప్రయాణికుల అవస్థలు

అనకాపల్లి కాంప్లెక్స్‌లో గంటల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి

500 కిలోమీట్లర దూరంలో జరిగే సభకు ఇక్కడ నుంచి బస్సులు పంపడంపై మండిపడుతున్న ప్రయాణికులు

అనకాపల్లి టౌన్‌, మార్చి 10: ప్రజా రవాణా శాఖ (పీటీడీ) అధికారులు అధికార పార్టీ సేవలో తరించిపోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాతోపాటు ఉత్తర కోస్తాలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాల్గొనే అధికారిక సభలే కాకుండా వైసీపీ పరంగా నిర్వహించే సభలకు కూడా జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ బస్సులను నిరభ్యంతరంగా ఇచ్చేస్తున్నారు. దీంతో బస్సుల కొరత కారణంగా ప్రయాణికులు పడే ఇబ్బందులు, ఇక్కట్లను పట్టించుకోవడంలేదు. తాజాగా ఎక్కడో ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఆదివారం వైసీపీ నిర్వహించే ‘సిద్ధం’ బహిరంగ సభకు ప్రజలను తరలించేందుకు జిల్లాలోని రెండు (అనకాపల్లి, నర్సీపట్నం) డిపోల నుంచి చెరో 25 చొప్పున మొత్తం 50 బస్సులను శనివారంనాడే ఇక్కడి నుంచి పంపారు. ఫలితంగా అనకాపల్లి, నర్సీపట్నంలోనే కాకుండా జిల్లాలోని అన్ని ప్రాంతాల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఆదివారం బాపట్ల జిల్లా మేదరమెట్లలో నిర్వహిస్తున్న వైసీపీ ‘సిద్ధం’ సభకు అనకాపల్లి పీటీడీ డిపో నుంచి 25 బస్సులను శనివారం సాయంత్రమే ఇక్కడి నుంచి పంపారు. ఇవి ఆదివారం ఉదయానికి చీరాల, చుట్టుపక్కల ప్రాంతాలకు చేరుకున్నాయి. మధ్యాహ్నం నుంచి ఆయా ప్రాంతాల నుంచి సిద్ధం సభకు జనాలను తరలించి, సభ ముసిగిన తరువాత తిరిగి వారి ప్రాంతాలకు తీసుకురావాలి. అర్ధరాత్రి అక్కడి నుంచి బయలుదేరి సోమవారం మధ్యాహ్నానికి అనకాపల్లి చేరుకుంటాయి. పీటీడీ అధికారుల తీరుతో పలు ప్రాంతాల ప్రయాణికులు రెండు రోజులపాటు బస్సుల కొరతతో అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. అనకాపల్లి నుంచి విశాఖపట్నం, విజయనగరం, నర్సీపట్నం, పాయకరావుపేట, చోడవరం, దేవరాపల్లి రూట్లలో నడిచే బస్సుల్లో కొన్నింటిని మేదరమెట్ల సభకు పంపారు.

ఇదిలావుండగా మూడు రోజులు సెలవులపాటు (శుక్రవారం మహాశివరాత్రి, రెండో శనివారం, ఆదివారం) సెలవులు రావడంతో ఉద్యోగం, ఉపాధి, వ్యాపార నిమిత్తం పట్టణాల్లో నివాసం వుంటున్న వారిలో పలువురు సొంతూళ్లకు, బంధువుల ఇళ్లకు వెళ్లారు. వీరంతా ఆదివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయం తిరుగు ప్రయాణం అవుతారు. ఆర్టీసీ బస్సుల కొరత కారణంగా గంటల తరబడి వేచివుండాల్సిన పరిస్థితి నెలకొంది. రెండు బస్సులకు సరిపడ ప్రయాణికులు ఒక బస్సులోనే ఇరుక్కుని వెళుతున్నారు. మరికొంత మంది అధికచార్జీలు చెల్లించి ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. రాజకీయ పార్టీల సభలకు కూడా ఆర్టీసీ బస్సులను కేటాయించడం ఏమిటని పీటీడీ అధికారుల తీరుపై ప్రయాణికులు మండిపడుతున్నారు.

Updated Date - Mar 11 , 2024 | 12:37 AM