Share News

జగనన్న కాలనీలోరోడ్లు తవ్వేశారు

ABN , Publish Date - May 23 , 2024 | 01:07 AM

జగనన్న కాలనీలో ఇళ్ల బేస్‌మెంట్‌ ఫిల్లింగ్‌కు అక్కడి రోడ్లనే తవ్వేసి వినియోగిస్తున్న విచిత్ర పరిస్థితి మండలంలోని పైడివాడ అగ్రహారంలో కనిపించింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సబ్‌ కాంట్రాక్టర్‌ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.

జగనన్న కాలనీలోరోడ్లు తవ్వేశారు
పైడివాడ అగ్రహారం జగనన్న కాలనీ లేఅవుట్‌లో రోడ్లు తవ్వేసి బేస్‌మెంట్లు ఫిల్లింగ్‌ చేసిన దృశ్యం

ఆ మట్టితో బేస్‌మెంట్ల ఫిల్లింగ్‌

ఇష్టానుసారంగా వ్యవహరించిన సబ్‌ కాంట్రాక్టర్‌

అధికారుల మొద్దు నిద్ర

ల రోజులుగా ఈ వ్యవహారం జరుగుతున్నా పట్టించుకోని వైనం

సబ్బవరం, మే 22:

జగనన్న కాలనీలో ఇళ్ల బేస్‌మెంట్‌ ఫిల్లింగ్‌కు అక్కడి రోడ్లనే తవ్వేసి వినియోగిస్తున్న విచిత్ర పరిస్థితి మండలంలోని పైడివాడ అగ్రహారంలో కనిపించింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సబ్‌ కాంట్రాక్టర్‌ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.

విశాఖ నగరంలో గల పేదల కోసం వీఎంఆర్‌డీఏ సబ్బవరం మండలం పైడివాడ, పైడివాడ అగ్రహారం, ఎరుకునాయుడుపాలెం గ్రామాల పరిధిలో సుమారు 320 ఎకరాలు సమీకరించి జగనన్న కాలనీలకు లేఅవుట్లు వేసింది. ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు రాక్రీట్‌ ఇన్‌ఫ్రా సంస్థ కాంట్రాక్ట్‌ తీసుకుంది. అయితే ఆ సంస్థ గ్రావెల్‌ లేదా మట్టితో బేస్‌మెంట్ల ఫిల్లింగ్‌కు వేరొకరికి సబ్‌ కాంట్రాక్టు ఇచ్చింది. లేఅవుట్‌ను ఆనుకుని ఉన్న కొండ నుంచి గ్రావెల్‌ తవ్వి ఒక్కో బేస్‌మెంట్‌ ఫిల్లింగ్‌కు రూ.1500కు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది. అయితే సబ్‌ కాంట్రాక్టర్‌ పని ప్రారంభించిన తరువాత రూ.1500లు గిట్టుబాటు కావడం లేదని ఎక్స్‌కవేటర్లతో కాలనీలోని రోడ్లను తవ్వేసి ఆ గ్రావెల్‌తోనే బేస్‌మెంట్లు ఫిల్లింగ్‌ చేసేశారు. నెల రోజులుగా ఈ వ్యవహారం జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అంతే కాకుండా బేస్‌మెంట్‌లో మట్టిని కూరకుండానే ఇళ్ల నిర్మాణాలు జరిగిపోతున్నాయని, కట్టిన నిర్మాణాలకు కనీసం వాటరింగ్‌ కూడా చేయడం లేదని స్థానికులు చెబుతున్నారు. బేస్‌మెంట్ల ఫిల్లింగ్‌కు రోడ్లను తవ్వేయడం విచిత్రంగా ఉందని పలువురు అంటున్నారు. ఇప్పటికైనా వీఎంఆర్‌డీఏ అధికారులు స్పందించి లేఅవుట్‌ రోడ్లను తవ్వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - May 23 , 2024 | 01:07 AM