అచ్యుతాపురం జంక్షన్‌లో రోడ్డు విస్తరణ
ABN , Publish Date - Jul 05 , 2024 | 01:12 AM
ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ చొరవతో అచ్యుతాపురం జంక్షన్‌కి మోక్షం కలిగింది. దీంతో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో పరిహారం తీసుకొని కూడా కొందరు వైసీపీ నాయకులు భవనాలను తొలగించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు విస్తరణకు యుద్ధప్రాతిపదికన యంత్రాల సాయంతో అధికారులు భవనాలను కూల్చివేస్తున్నారు.

యంత్రాల సాయంతో భవనాల కూల్చివేత
గత ప్రభుత్వంలో పరిహారం తీసుకొని
భవనాలు ఖాళీచేయని యజమానులు
భవన యజమానులు, వ్యాపారులతో
సమావేశమైన ఎమ్మెల్యే
ఎమ్మెల్యే చొరవతో భవనాలు
తొలగిస్తున్న అధికారులు
అచ్యుతాపురం, జూలై 4: ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ చొరవతో అచ్యుతాపురం జంక్షన్‌కి మోక్షం కలిగింది. దీంతో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో పరిహారం తీసుకొని కూడా కొందరు వైసీపీ నాయకులు భవనాలను తొలగించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు విస్తరణకు యుద్ధప్రాతిపదికన యంత్రాల సాయంతో అధికారులు భవనాలను కూల్చివేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..
పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అచ్యుతాపురం జంక్షన్‌ని విస్తరించాలని గతంలో టీడీపీ ప్రభుత్వం యోచించింది. అచ్యుతాపురం-అనకాపల్లి, అచ్యుతాపురం-ఎలమంచిలి రోడ్లను 200 అడుగుల మేర విస్తరించాలని, అలాగే అచ్యుతాపురం జంక్షన్‌ని ఎటుచూసినా 400 అడుగుల మేర విస్తరించాలని భావించింది. ఈ మేరకు అధికారులు సర్వేలు కూడా చేసి మార్కింగ్‌లు కూడా ఇచ్చారు. 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో పనులకు బ్రేక్ పడింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా రోడ్డు విస్తరణ పనులను కొనసాగించింది. అయితే కేవలం వంద అడుగుల మేర మాత్రమే విస్తరించాలని నిర్ణయించింది. ఈ మేరకు అచ్యుతాపురం జంక్షన్ పరిధిలోని భూ నిర్వాసితులకు అధికారులు పరిహారం కూడా పంపిణీ చేశారు. అయితే పరిహారం తీసుకున్న కొంతమంది తమ ఇళ్లను తామే యంత్రాలతో తొలగించి, పునర్నిర్మాణాలు చేసుకున్నారు. అయితే జంక్షన్‌లో పలుకుబడి కలిగిన నాయకులు మాత్రం పరిహారం తీసుకున్నా.. భవనాలను తొలగించలేదు. దీంతో వైసీపీ నాయకులు కూడా వారిపై ఒత్తిడి తీసుకురాలేదు. ఫలితంగా ప్రతి రోజూ అచ్యుతాపురం జంక్షన్‌లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయ్యేది. అయినా ఇటు అధికారులు గాని, అటు ప్రజాప్రతినిధులు గాని పట్టించుకొనేవారు కాదు. కూటమి ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే సుందరపు విజయకుమార్ అచ్యుతాపురం జంక్షన్‌పై దృష్టి సారించారు. తొలుత భవన యజమానులు, ఫుట్‌పాత్ వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి రోడ్డు విస్తరణకు సహకరించాలని కోరారు. అయినా కొందరు నాయకులు పట్టించుకోలేదు. దీంతో విజయకుమార్ ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమీక్షించి పరిహారం తీసుకున్న వారి భవనాలను యంత్రాల సాయంతో కూల్చివేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు భారీ యంత్రాల సాయంతో జంక్షన్‌లోని బహుళ అంతస్థుల భవనాలను కూల్చివేయడం ప్రారంభించారు. భవనాలు కూల్చివేత పనులను తహసీల్దార్ సరోజిని పర్యవేక్షిస్తుండగా, సీఐ బుచ్చిరాజు భవనాలలు వద్ద బారీకేడ్లు ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయకుమార్ మాట్లాడుతూ అచ్యుతాపురం జంక్షన్‌ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమన్నారు. సెజ్‌లో గల కర్మాగారాలకు వచ్చే విదేశీ ప్రతినిధులు, అతిథులు సెజ్ ముఖద్వారమైన అచ్యుతాపురం జంక్షన్‌ని చూసి మెచ్చుకొనేలా తీర్చిదిద్దుతానన్నారు. వివిధ కారణాల వల్ల ఇంతవరకు పరిహారం తీసుకోని నిర్వాసితుల పరిహారపు నగదును కోర్టులో జమ చేసేలా చర్యలు చేపట్టామన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టడానికి ప్రయత్నించినా అచ్యుతాపురం జంక్షన్ విస్తరణ పనులు ఆపేది లేదని సుందరపు స్పష్టం చేశారు.