వరి విత్తనాలు మొలకెత్తడం లేదు
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:04 AM
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులకు విక్రయించిన వరి విత్తనాలు చాలా చోట్ల మొలకెత్తడంలేదని పలువురు జడ్పీటీసీ సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. మొలకెత్తని విత్తనాలు ఎందుకు సరఫరా చేస్తున్నారని ప్రశ్నిస్తూ, వ్యవసాయశాఖ బాధ్యతగా ఉండాలని కోరారు. శనివారం చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో వ్యవసాయశాఖపై చర్చ ప్రారంభించినప్పుడు కొయ్యూరు, అనంతగిరి, పెదబయలు జడ్పీటీసీ సభ్యులు వారా నూకరాజు, గంగరాజు, బొంజిబాబులు మాట్లాడుతూ విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.

- వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వండి
- గోవాడ షుగర్స్‌లో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుతో రైతులకు మేలు
- ఏజెన్సీలో దోమతెరలు వెంటనే సరఫరా చేయండి
- కొయ్యూరులో కిడ్నీ రోగులకు డయాలిసిస్ సదుపాయం లేదు
- కేజీహెచ్‌లో లంచాలను అరికట్టండి
- జడ్పీ సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించిన సభ్యులు
విశాఖపట్నం, జూలై 27 (ఆంధ్రజ్యోతి): c ఏజెన్సీలో రాగులు, రాజ్‌మా విత్తనాలు వెంటనే సరఫరా చేయాలని జడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర కోరారు. వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి జోక్యంచేసుకుని నాణ్యమైన విత్తనాలు ఎందుకు సరఫరా చేయడంలేదని ప్రశ్నించగా, అనకాపల్లి జిల్లా వ్యవసాయశాఽఖాధికారి మోహనరావు బదులిస్తూ నాణ్యత లేని 40 బస్తాల విత్తనాలను వెనక్కి పంపామన్నారు. రైతు భరోసా సొమ్ము జమ చేయడంపై ఇంకా మార్గదర్శకాలు రాలేదని పేర్కొన్నారు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ గతంలో ఒక సీజన్‌లో సుమారు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల పంచదార ఉత్పత్తిచేసే గోవాడ షుగర్స్ ఇప్పుడు రెండులక్షల కంటే తక్కువ ఉత్పత్తికి పడిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఏటికొప్పాక, తాండవ షుగర్స్ కర్మాగారాలు ఇప్పటికే మూత పడ్డాయన్నారు. గోవాడ షుగర్స్ కర్మాగారంలో పీపీపీ విధానంలో ఇథనాల్ యూనిట్‌ను ఏర్పాటుచేస్తే రైతులకు, కార్మికులకు మేలు జరుగుతుందని పేర్కొంటూ ఇందుకు సభ ఏకగ్రీవంగా తీర్మానించాలని ప్రతిపాదించారు. చోడవరం ఎమ్మెల్యే కెఎస్‌ఎన్‌ఎస్. రాజు మాట్లాడుతూ గంధవరంలో ఏర్పాటు చేయతలపెట్టిన విత్తన శుద్ధి యూనిట్ నిలిచిపోయిందని పేర్కొంటూ త్వరితగతిని పూర్తిచేయాలని కోరగా, అనకాపల్లి కలెక్టర్ సునీత విజయకృష్ణన్ సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం తక్షణమే సాయం ప్రకటించాలి
ఇటీవల కురిసిన వర్షాలకు ఏజెన్సీలో పంటలు దెబ్బతిన్నాయని జడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తక్షణమే సాయం ప్రకటించాలని కోరారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ ఈ-క్రాప్ నమోదు పక్కాగా చేపట్టాలని, లేకపోతే రైతు పండించుకునే పంట దళారుల పాలవుతుందని పేర్కొనగా, అధికారులు స్పందిస్తూ ఖరీఫ్ పంటల సాగు సమయంలోనే ఈ-క్రాప్ నమోదు చేస్తున్నామన్నారు. దేవరాపల్లి జడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యం మాట్లాడుతూ చెరకు రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఏజెన్సీలో పైనాపిల్ పంటకు గిట్టుబాఽటు ధర కల్పించాలని చింతపల్లి జడ్పీటీసీ సభ్యుడు పోతుల బాలయ్య కోరారు. కొయ్యూరు జడ్పీటీసీ సభ్యుడు నూకరాజు మాట్లాడుతూ కోతుల దాడుల నుంచి రైతుల పంటలకు రక్షణ కల్పించాలని కోరగా, అల్లూరి సీతారామరాజు కలెక్టర్ దినేశ్‌కుమార్ బదులిస్తూ ఇది పెద్ద సమస్యగా పేర్కొన్నారు. అడవుల్లో పండ్ల చెట్ల పెంపకం చేపట్టడం ద్వారా కోతుల నుంచి రక్షిస్తామని హామీ ఇచ్చారు. వైద్యశాఖపై చర్చలో భాగంగా అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, అరకు, అనంతగిరి, పెదబయలు, కొయ్యూరు, చింతపల్లి జడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతూ మలేరియా దోమల నుంచి రక్షణకు గాను దోమతెరలు వెంటనే పంపిణీ చేయాలని కోరగా, సంబంధిత అధికారులు బదులిస్తూ ఐదు లక్షల దోమతెరల కొనుగోలుకు టెండర్లు పిలిచామని, త్వరలో జిల్లాకు రానున్నాయన్నారు. అరకు ప్రాంతంలో అనేక మందికి సోరియాసిస్ వ్యాధి సోకడంతో ఇబ్బందులు పడుతున్నారని అరకు జడ్పీటీసీ సభ్యులు శెట్టి రోష్నీ ఆందోళన వ్యక్తంచేయగా, వైద్యబృందాలను పంపుతామని అధికారులు పేర్కొన్నారు. కొయ్యూరు మండలంలో ఆరు గ్రామాల్లో పదుల సంఖ్యలో రోగులు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారని, వీరికి డయాలసిస్ సదుపాయం సక్రంగా అందడంలేని జడ్పీటీసీ సభ్యుడు నూకరాజు ఆందోళన వ్యక్తం చేశారు. జడ్పీ నిధుల నుంచి నర్సీపట్నం, పాడేరు ఆస్పత్రిలో ప్రీజర్లు ఏర్పాటుచేస్తామని చైర్‌పర్సన్ సుభద్ర వెల్లడించారు. విశాఖ కేజీహెచ్‌లో వైద్యసేవలు మరింతగా మెరుగుపరచాలని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు కోరగా, అన్ని పార్టీల సభ్యులు మూకుమ్మడిగా ఆయనకు మద్దతు పలికారు. రోగుల కోసం వాకబు చేయడానికి ప్రయత్నిస్తే సూపరింటెండెంట్ కనీసం స్పందించడంలేదని పలువురు ఆరోపించారు. ఇటువంటి సమస్యకు తెరపడాలంటే కేజీహెచ్‌లో సూపరింటెండెంట్‌కు సాయంగా ఒక పీఆర్వోను నియమించాలని కోరగా కలెక్టర్ హరేంధిరప్రసాద్ సానుకూలంగా స్పందించారు. మరికొందరు సభ్యులు లేచి కేజీహెచ్ మార్చురీ వద్ద సొమ్ములు అడుగుతున్నారని ఆరోపించగా, చివరకు సర్టిఫికెట్ల జారీకి పైసలు ఇవ్వాల్సి వస్తోందని ధ్వజమెత్తడంతో పాటు కేజీహెచ్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. సభ్యుల ఆందోళనపై కలెక్టర్ స్పందిస్తూ సేవలు మెరుగుపరచడంతో పాటు అవినీతిని అరికడతామని హామీ ఇచ్చారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో నిర్మాణాలకు ఒక మాస్టర్‌ప్లాన్ రూపొందించాలన్నారు. గాజువాక పరిధి తుంగ్లాం ప్రాథమిక పాఠశాల కబ్జాకు గురైందని, దీనిపై ఎందుకు ఫిర్యాదుచేయలేదని నిలదీశారు. దీనిపై చైర్‌పర్సన్ సుభద్ర బదులిస్తూ తక్షణమే తుంగ్లాంలో ఆక్రమణలు తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఈలోగా జడ్పీ సీఈవో పోలినాయుడు మాట్లాడుతూ ఆక్రమణల తొలగింపునకు న్యాయపరంగా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.
వేర్వేరుగా సమావేశాలు నిర్వహించండి
జడ్పీ సమావేశంలో పూర్తిస్థాయిలో అజెండా చర్చకు రావడంలేదని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు అభిప్రాయపడ్డారు. కేవలం మూడు, నాలుగు అంశాలు మాత్రమే చర్చకు వస్తున్నాయని పేర్కొంటూ మొత్తం అంశాలపై చర్చించాలంటే అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఒక సమావేశం, అనకాపల్లి, విశాఖ జిల్లాల పరిధిలో సభ్యులకు ఒక సమావేశం ఏర్పాటుచేయాలని సూచించగా, సీసీవో పోలినాయుడు వివరణ ఇస్తూ సమావేశాలు వేర్వేరుగా నిర్వహణకు కోరం సమస్య తలెత్తుతుందని పేర్కొంటూ, దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. సమావేశానికి తొలిసారిగా వచ్చిన ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేశ్‌బాబు, విశ్వేశ్వరరాజు, మత్స్యలింగం, సుందరపు విజయకుమార్‌లను సత్కరించారు.