సంక్షేమశాఖలకు జవసత్వాలు
ABN , Publish Date - Aug 24 , 2024 | 01:34 AM
బీసీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమశాఖల ద్వారా గతంలో టీడీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలుచేసింది.
బీసీ, ఎస్సీలకు చేయూత అందించేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం
ఇప్పటికే సంక్షేమశాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రులు
విశాఖపట్నం, ఆగసు 23 (ఆంధ్రజ్యోతి):
బీసీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమశాఖల ద్వారా గతంలో టీడీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలుచేసింది. సబ్సిడీతో కూడిన రుణాలు, వాహనాలను అందించడం ద్వారా ఆయా వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అనుగుణంగా ఇవి దోహదపడ్డాయి. అయితే ఈ విధానాలకు వైసీపీ ప్రభుత్వం స్వస్తిచెప్పింది. గత ఐదేళ్లు ఈ శాఖలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. బటన్ నొక్కుడుకు మాత్రమే పరిమితమైన జగన్ ప్రభుత్వం ఈ శాఖలను పక్కన పెట్టేసింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయా శాఖల ద్వారా గతంలో అమలుచేసిన అనేక పథకాలను మళ్లీ పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతోంది. ఈమేరకు ఆయాశాఖలకు చెందిన మంత్రులు కొద్దిరోజుల కిందట అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రణాళికలను రూపొందించారు. ప్రభుత్వ నిర్ణయంతో మరోసారి సంక్షేమశాఖల ద్వారా పలు పథకాలు అందుతాయనే ఆనందంలో బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలవారున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాదే కొన్ని పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వీటిలో బీసీ కార్పొరేషన్ ద్వారా 40 శాతం రాయితీతో గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నారు. ఇందులో 50 శాతం బ్యాంకు రుణం, పది శాతం లబ్ధిదారుడి వాటా ఉంటుంది. స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. రూ.50 వేల నుంచి రూ.2 లక్షల విలువజేసే యూనిట్ ఏర్పాటు చేసుకుంటే దరఖాస్తుదారుడు రూ.20 వేలు చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం రూ.80 వేలు రాయితీ అందిస్తుంది. బ్యాంకు ద్వారా రూ.లక్ష రుణం అందుతుంది. అదే రూ.3 లక్షల విలువజేసే యూనిట్ ఏర్పాటు చేయాలని భావిస్తే.. లబ్ధిదారుడు రూ.30 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం రూ.1.2 లక్షలు రాయితీగా అందిస్తుంది. రూ.1.5 లక్షల బ్యాంకు రుణం ఇస్తారు. రూ. 5 లక్షల వరకు యూనిట్ ఖరీదుంటే.. రూ.50 వేలు లబ్ధిదారుడి వాటా... రూ.2 లక్షల ప్రభుత్వ రాయితీ, బ్యాంకు నుంచి రూ.2.5 లక్షలు రుణం ఇస్తారు.
ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించి అమలుచేయాలని భావిస్తున్న యూనిట్లు విలువ కూడా దాదాపుగా ఇంతే ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తాలతో ఉపాధి ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. డైరీ ఫామ్, కోళ్లఫామ్, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల తయారీ, తేనె పట్టు పెంపకం ఏర్పాటు చేసుకోవవచ్చని అధికారులు చెబుతున్నారు. వీటితోపాటు కుల సంఘాలకు కూడా సబ్సిడీతో రుణాలను అందించనున్నారు. కార్లు, ట్రాక్టర్లు, ట్రాక్టర్ పరికరాలు, ఆటోలు, వ్యాన్లు వంటివి అందించనున్నారు.
లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు
కూటమి ప్రభుత్వం అమలుచేయాలని భావిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారులను ఎలా ఎంపిక చేయాలన్న దానిపై కసరత్తు జరుగుతోంది. ఒక్కో జిల్లాకు ఎన్ని యూనిట్లు కేటాయిస్తారన్న దానిని బట్టి లబ్ధిదారుల ఎంపిక ఉండాలన్నది ప్రభుత్వ ఆలోచన. దరఖాస్తులు స్వీకరిస్తే భారీగా వచ్చే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దరఖాస్తులు తీసుకోకుండా మంజూరు చేయడం అనేక ఇబ్బందులకు కారణమవుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులను నేరుగా ఆయాశాఖలు ఆధ్వర్యంలో ఎంపిక చేయాలా..? స్థానిక ప్రజాప్రతినిధులకు అప్పగించాలా..? అన్నది తెలియాల్సి ఉంది. గతంలో సంక్షేమశాఖలకే నేరుగా దరఖాస్తులు అందజేసేవారు. ఇక్కడి నుంచే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరిగేది. ఈ శాఖల ఆధ్వర్యంలోనే రుణాలు, వాహనాలను అందించేవారు. రుణాల రికవరీ బాధ్యతను కూడా ఆయా శాఖల అధికారులే పర్యవేక్షించేవారు. ఈ పథకాల్లో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాకు కనీసం ఐదు వేల వరకు యూనిట్లు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.