అర్జీలను సత్వరమే పరిష్కరించండి
ABN , Publish Date - Oct 22 , 2024 | 12:49 AM
అర్జీదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ విజయకృష్ణన్ హితవు
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరణ
అనకాపల్లి కలెక్టరేట్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): అర్జీదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఆమె ప్రజల నుంచి అర్జీలు, ఫిర్యాదులు స్వీకరించారు. పలువురి సమస్యలను స్వయంగా ఆలకించారు. అనంతరం ఆమె అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, అర్జీదారుల సమస్యలను తమ సమస్యలుగా భావించాలని సూచించారు. కాగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 206 అర్జీలు అందినట్టు కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో జేసీ జాహ్నవి, డీఆర్‌ఓ దయానిధి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో..
ప్రజా సమస్యలను సతర్వమే పరిష్కరించి బాధితులకు అండగా నిలవాలని ఎస్పీ తుహిన్ సిన్హా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. వారితో స్వయంగా మాట్లాడి వారి గోడును ఆలకించారు. పరిష్కారం నిమిత్తం అర్జీల సంబంధిత అధికారులకు బదిలీ చేశారు. తరువాత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలపై దృష్టి కేంద్రీకరించాలని, నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మొత్తం 32 అర్జీలు అందగా.. ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు, మోసాలు వంటి వాటికి సంబంధించినవి అధికంగా వున్నాయి. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మోహనరావు పాల్గొన్నారు.