Share News

రిజర్వాయర్లు ఫుల్‌

ABN , Publish Date - Sep 10 , 2024 | 01:20 AM

మండలంలోని కల్యాణపులోవ జలాశయానికి వరదపోటు మరింత పెరిగింది.

రిజర్వాయర్లు ఫుల్‌

స్పిల్‌వే గేట్లు ఎత్తివేత

వేలాది క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల

ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో జిల్లాలోని అన్ని రిజర్వాయర్లకు వరద పోటెత్తింది. రైవాడ మినహా మిగిలిన అన్ని జలాశయాలు పూర్తిగా నిండడంతో అధికారులు స్పిల్‌వే గేట్లు ఎత్తి అదనపు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఆయా నదులు వరదతో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

కల్యాణపులోవ నుంచి 400 క్యూసెక్కులు విడుదల

రావికమతం: మండలంలోని కల్యాణపులోవ జలాశయానికి వరదపోటు మరింత పెరిగింది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో కొండగెడ్డల ద్వారా వరద నీరు రిజర్వాయర్‌లోకి వస్తున్నది. గరిష్ఠ నీటిమట్టం 460 అడుగులుకాగా సోమవారం 450 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ఇప్పటికే రిజర్వాయర్‌ నిండడంతో నీటి మట్టాన్ని 459.1 అడుగులకు మించకుండా నాలుగు గేట్లు ఎత్తి 400 క్యూసెక్కుల నీటిని సర్పా నదిలోకి విడిచిపెడుతున్నట్టు ప్రాజెక్టు ఏఈ సత్యనారాయణదొర చెప్పారు. నదిని ఆనుకొని ఉన్న రావికమతం, రోలుగుంట, మాకవరపాలెం మండలాలకు చెందిన పలు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశామన్నారు.

పెద్దేరు నుంచి 600 క్యూసెక్కులు..

మాడుగుల రూరల్‌: పెద్దేరు పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో జలాశయంలోకి వరద ప్రవాహం కొనసాగుతున్నది. గరిష్ఠ నీటిమట్టం 137 మీటర్లు కాగా.. సోమవారం 700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వుంది. నీటిమట్టాన్ని 135.6 మీటర్ల వద్ద స్థిరంగా వుంచుతూ, స్పిల్‌గేట్ల నుంచి 600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నట్టు ప్రాజెక్టు ఏఈ సుధాకరరెడ్డి చెప్పారు.

రైవాడకు వరద పోటు.. 2,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

దేవరాపల్లి: ఎగువ ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షాలు కురవడంతో రైవాడ రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు చేరుతున్నది. గరిష్ఠ నీటిమట్టం 114 మీటర్లు కాగా, సోమవారం 2,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో నీటిమట్టం 111.5 మీటర్లకు చేరింది. నీటిమట్టం మరో రెండు మీటర్లు పెరిగితే స్పిల్‌వే గేట్లు ఎత్తుతామని ప్రాజెక్టు డీఈఈ సత్యం నాయుడు చెప్పారు. కాలువల ద్వారా జీవీఎంసీకి 50 క్యుసెక్కులు, ఆయకట్టుకు వంద క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు.

పొంగిపొర్లిన ‘రావణాపల్లి’

గొలుగొండ: మండలంలోని రావణాపల్లి రిజర్వాయర్‌ పొంగి పొర్లుతున్నది. ఎగువ ప్రాంతంలోని రాళ్లగెడ్డ, తురబాలగెడ్డల నుంచి 250 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నది. రిజర్వాయర్‌ ఇప్పటికే నిండడంతో వచ్చిన నీరు వచ్చినట్టు పొర్లుకట్ట మీదుగా దిగువకు పోతున్నది.

తాండవ నుంచి 8 వేల క్యూసెక్కులు విడుదల

నాతవరం: మండలంలోని తాండవ రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు చేరుతున్నది. గరిష్ఠ నీటిమట్టం 380 అడుగులుకాగా, నాలుగైదు రోజుల క్రితమే రిజర్వాయర్‌ పూర్తిగా నిండింది. దీంతో అధికారులు స్పిల్‌వే గేట్లు కొంతమేర ఎత్తి అదనపు నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. అయితే పరివాహక ప్రాంతంలో ఆదివారం భారీ వర్షాలు కురవడంతో పలు గెడ్డల నుంచి సోమవారం 8,700 వేల క్యూసెక్కుల వరద నీరు జలాశయంలోకి వస్తున్నది. అధికారులు మూడు స్పిల్‌వే గేట్లను అడుగుమేర ఎత్తి 8,900 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. సోమవారం సాయంత్రానికి రిజర్వాయర్‌ నీటిమట్టం 379.5 అడుగులు వుందని ప్రాజెక్టు డీఈఈ అనురాధ తెలిపారు.

కోనాంకు వెయ్యి క్యూసెక్కుల వరద

చీడికాడ: మండలంలోని కోనాం జలాశయంలోకి 1000 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నది. గరిష్ఠ నీటిమట్టం 101.25 మీటర్లు కాగా, సోమవారం సాయంత్రానికి 98.2 మీటర్లు వుంది. మెయిన్‌ గేట్లు ఎత్తి 500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Updated Date - Sep 10 , 2024 | 01:20 AM