Share News

హైవే నిర్మాణంలో 7,020 చెట్ల తొలగింపు

ABN , Publish Date - Jun 02 , 2024 | 12:43 AM

జాతీయ రహదారి 516-ఈ నిర్మాణంలో రిజర్వుడ్‌ ఫారెస్టుకి చెందిన 7,020 చెట్లను తొలగిస్తున్నట్టు స్థానిక డివిజన్‌ ఫారెస్టు అధికారి (డీఎఫ్‌వో) చిట్టపులి సూర్యనారాయణ పడాల్‌ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజమండ్రి నుంచి విజయనగరం వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి చింతపల్లి డివిజన్‌ మీదుగా వెళుతుందన్నారు. కొయ్యూరు మండలం కాకరపాడు నుంచి జి.మాడుగుల మండలం వంజరి వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయన్నారు. రహదారి విస్తరణలో భాగంగా మారుజాతి, టేకు వృక్షాలను తొలగించాల్సి వస్తున్నదని తెలిపారు.

హైవే నిర్మాణంలో 7,020 చెట్ల తొలగింపు
విలేకరులతో మాట్లాడుతున్న డీఎఫ్‌వో సూర్యనారాయణ పడాల్‌

- ప్రత్యామ్నాయంగా పాడేరులో 120 హెక్టార్ల అటవీ అభివృద్ధి

- డీఎఫ్‌వో సూర్యనారాయణ పడాల్‌

చింతపల్లి, జూన్‌ 1: జాతీయ రహదారి 516-ఈ నిర్మాణంలో రిజర్వుడ్‌ ఫారెస్టుకి చెందిన 7,020 చెట్లను తొలగిస్తున్నట్టు స్థానిక డివిజన్‌ ఫారెస్టు అధికారి (డీఎఫ్‌వో) చిట్టపులి సూర్యనారాయణ పడాల్‌ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజమండ్రి నుంచి విజయనగరం వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి చింతపల్లి డివిజన్‌ మీదుగా వెళుతుందన్నారు. కొయ్యూరు మండలం కాకరపాడు నుంచి జి.మాడుగుల మండలం వంజరి వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయన్నారు. రహదారి విస్తరణలో భాగంగా మారుజాతి, టేకు వృక్షాలను తొలగించాల్సి వస్తున్నదని తెలిపారు. 60 హెక్టార్లలో 7,020 వృక్షాలుగాను ఇప్పటి వరకు 6,620 తొలగించామన్నారు. మరో 400 వృక్షాలు తొలగించాల్సి వున్నదన్నారు. తొలగించి వృక్షాలను కాకరపాడు తాత్కాలిక టింబర్‌ డిపో, లోతుగెడ్డ జంక్షన్‌లోని శాశ్వత టింబర్‌ డిపోనకు తరలిస్తున్నామన్నారు. జాతీయ రహదారి విస్తరణలో తొలగించిన అటవీ వృక్షాలకు ప్రత్యామ్నాయంగా ఎన్‌హెచ్‌ అధికారులు పాడేరులో 120 హెక్టార్ల అటవీ అభివృద్ధి చేపట్టనున్నారన్నారు. అలాగే జాతీయ రహదారి నిర్మాణం అనంతరం రహదారి ఇరువైపులా మారుజాతి మొక్కలను ఎన్‌హెచ్‌ అధికారులు పెంపొందిస్తారన్నారు.

అదుపులో అగ్నిప్రమాదాలు

డివిజన్‌ పరిధిలో అగ్నిప్రమాదాలు అదుపులో ఉన్నాయని డీఎఫ్‌వో తెలిపారు. డివిజన్‌ పరిధిలో 1.97 లక్షల హెక్టార్ల అడవులు ఉన్నాయన్నారు. వేసవిలో సంభవించే అగ్నిప్రమాదాలను అదుపు చేసేందుకు ఈ ఏడాది ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. గ్రామాల్లో విస్తృతంగా అవగాహన సమావేశాలు ఏర్పాటు చేసి కరపత్రాలు పంపిణీ చేశామన్నారు. ప్రతి ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో గిరిజన ప్రాంతంలో తొలకరి వర్షాలు కురుస్తాయన్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో ఒక్క వర్షం పడలేదన్నారు. దీంతో ఒక్కసారిగా 900 పాయింట్లలో అగ్నిప్రమాదాలు జరిగినట్టు భారత ప్రభుత్వం శాటిలైట్‌ ద్వారా గుర్తించిందన్నారు. ఈ సమాచారం వచ్చిన వెంటనే అటవీశాఖ ఉద్యోగులు అగ్నిప్రమాదాలను అదుపు చేశారన్నారు. మేలో వర్షాలు పడడం, ప్రజలను చైతన్యవంతులను చేయడం వల్ల అగ్నిప్రమాదాలు అదుపులో వున్నాయన్నారు. గిరిజనులు అడ్డపిక్కలు, బొడ్డెంగుల కోసం అడవికి వెళ్లి మంట పెట్టడం వల్ల అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయని ఆయన తెలిపారు.

Updated Date - Jun 02 , 2024 | 12:43 AM