Share News

పర్యాటకులకు ఊరట

ABN , Publish Date - Mar 06 , 2024 | 11:31 PM

ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగికి సమీపంలోని చెరువులవేనం పర్యాటక ప్రాంతంలో సందర్శకులకు వ్యూపాయింట్‌, మరుగుదొడ్లు ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో పర్యాటకుల ఇబ్బందులు తప్పాయి.

పర్యాటకులకు ఊరట
పర్యాటకులకు అందుబాటులోకి వచ్చిన వ్యూపాయింట్‌

అందుబాటులోకి వచ్చిన చెరువులవేనం వ్యూపాయింట్‌, మరుగుదొడ్లు

చింతపల్లి, మార్చి 6: ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగికి సమీపంలోని చెరువులవేనం పర్యాటక ప్రాంతంలో సందర్శకులకు వ్యూపాయింట్‌, మరుగుదొడ్లు ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో పర్యాటకుల ఇబ్బందులు తప్పాయి. ముగ్గురు ఐఏఎస్‌ అధికారుల కృషి ఫలితంగా అరకు ఎంపీ మాధవి నిధులతో వ్యూపాయింట్‌, మరుగుదొడ్ల నిర్మాణాలు జరిగాయి. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏడాదిన్నర కాలంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్‌ అధికారులు పనులు పూర్తి చేశారు.

లంబసింగికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండపై చెరువులవేనం గ్రామం ఉంది. ఈ గ్రామంలో శీతాకాలం మంచు అందాలు ప్రకృతి ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు, 12గంటల వరకు పెద్ద లోయలో ఆకాశం, నేలను ఏకం చేసినట్టుగా మంచు మేఘాలు పరుచుకుని ఉంటాయి. శ్వేత వర్ణంలో పచ్చని అడవులను తాకుతూ పయనిస్తున్న మంచు మేఘాలు అలరిస్తాయి. ఈ చెరువులవేనం ప్రకృతి అందాలను తొలిసారిగా ఐదేళ్ల కిందట ‘ఆంధ్రజ్యోతి’ బాహ్యప్రపంచానికి పరిచయం చేసింది. నాటి నుంచి నేటి వరకు వేల సంఖ్యలో పర్యాటకులు సీజన్‌లో చెరువులవేనం సందర్శిస్తున్నారు. కనీసం రహదారి సదుపాయం లేకపోయినప్పటికి వృద్ధులు, చిన్నారులు సైతం చిన్నపాటి కాలిబాటలో ప్రయాణించి చెరువులవేనం చేరుకుని మంచు అందాలను ఆస్వాదిస్తున్నారు. చెరువులవేనం అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందింది. చెరువులవేనంలో పర్యాటకులకు వ్యూపాయింట్‌, మరుగుదొడ్లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు ప్రత్యేక కృషి చేశారు. ప్రస్తుత విశాఖపట్నం కలెక్టర్‌ మల్లికార్జున, నాటి పీవో రోణంకి గోపాలక్రిష్ణ, ప్రస్తుత పీవో వి. అభిషేక్‌ కృషికితోడు ఎంపీ మాధవి నిధులు విడుదల చేయడంతో పనులు చురుగ్గా సాగాయి.

చెరువులవేనం అభివృద్ధికి ప్రత్యేక కమిటీ

చెరువులవేనం అభివృద్ధికి స్థానిక నిరుద్యోగ యువతను భాగస్వాములను చేస్తూ కమిటీని ఐటీడీఏ పీవో అభిషేక్‌ ఏర్పాటు చేశారు. ప్రధానంగా చెరువులవేనంలో ప్లాస్టిక్‌ను నియంత్రించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. చెరువులవేనం సందర్శించే సందర్శకుల నుంచి టికెట్‌ రూపంలో కొంత నగదు వసూలు చేసి, వచ్చిన ఆదాయం స్థానిక యువతకు జీతాలుగా, భవిష్యత్‌ అభివృద్ధి పనులకు ఖర్చుచేయాలని పీవో అభిషేక్‌ నిర్ణయించారు. వ్యూపాయింట్‌, మరుగుదొడ్ల నిర్మాణ బాధ్యతలను ఆ కమిటీకి పీవో అప్పగించారు. అలాగే పర్యాటకులకు అవసరమైన అల్పాహారం, టీ, స్నాక్స్‌, గిరిజన వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్‌ స్థానిక యువతతో ఏర్పాటు చేయిస్తున్నారు.

Updated Date - Mar 06 , 2024 | 11:31 PM