మిరియాల రైతుకు ఊరట
ABN , Publish Date - Feb 06 , 2024 | 12:23 AM
మన్యంలో ఈ ఏడాది మిరియాల ధర ఆశాజనకంగా ఉందని గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత సీజన్ ప్రారంభంలోనే కిలో రూ.550 చొప్పున వర్తకులు కొనుగోలు చేస్తుండడంతో ఆ తరువాత ధర మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు, వర్తకులు అభిప్రాయపడుతున్నారు.
వారపు సంతల్లో కిలో రూ.550కు కొనుగోలు చేసిన వర్తకులు
పాడేరు, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): మన్యంలో ఈ ఏడాది మిరియాల ధర ఆశాజనకంగా ఉందని గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత సీజన్ ప్రారంభంలోనే కిలో రూ.550 చొప్పున వర్తకులు కొనుగోలు చేస్తుండడంతో ఆ తరువాత ధర మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు, వర్తకులు అభిప్రాయపడుతున్నారు. సోమవారం పెదబయలు వారపు సంతలో కిలో రూ.550 చొప్పున గిరిజన రైతులు వర్తకులకు మిరియాలను విక్రయించారు. గత నాలుగేళ్లుగా ప్రతి ఏడాది మిరియాలు ధర ఆశాజనకంగా ఉంటుందని రైతులు అంటున్నారు. గతంలో సీజన్ ప్రారంభంలో కిలో రూ.450 ఉంటూ, క్రమంగా సీజన్ ముగిసే నాటికి కిలో రూ.500 వరకు పెరిగేది. కానీ ఈ ఏడాది సీజన్ మొదట్లోనే రూ.550 ధర ఉండడంతో సీజన్ ముగిసే నాటికి కిలో రూ.600 లేదా రూ.620 వరకు ధర పెరుగుతుందని రైతులు, వర్తకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.