Share News

మేహాద్రిగెడ్డకు ఊరట!

ABN , Publish Date - Jul 08 , 2024 | 01:18 AM

నగరు శివారులో ఉన్న మేహాద్రి గెడ్డ రిజర్వాయర్‌ గేట్ల మరమ్మతులకు జలవనరుల శాఖ సిద్ధమవుతోంది. రానున్న వర్షాకాలం దృష్ట్యా గేట్ల మరమ్మతులు చేపట్టేందుకు వీలుగా రూ.నాలుగు కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపింది. రిజర్వాయర్‌కు ఉన్న ఆరు గేట్లలో నాలుగు గేట్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని గుర్తించిన జలవనరులశాఖ, నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

మేహాద్రిగెడ్డకు ఊరట!
పాడైన మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ గేట్లు

గేట్ల మరమ్మతులకు అధికారుల కసరత్తు

రూ.4 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన జలవనరుల శాఖ

నగరంలో తాగునీటికి ఇబ్బందులు ఎదురవకుండా చర్యలు

నిర్వహణకు ఐదేళ్లలో రూపాయి విదల్చని వైసీపీ సర్కారు

విశాఖపట్నం/ గోపాలపట్నం, జూలై 7 (ఆంధ్రజ్యోతి):

నగరు శివారులో ఉన్న మేహాద్రి గెడ్డ రిజర్వాయర్‌ గేట్ల మరమ్మతులకు జలవనరుల శాఖ సిద్ధమవుతోంది. రానున్న వర్షాకాలం దృష్ట్యా గేట్ల మరమ్మతులు చేపట్టేందుకు వీలుగా రూ.నాలుగు కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపింది. రిజర్వాయర్‌కు ఉన్న ఆరు గేట్లలో నాలుగు గేట్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని గుర్తించిన జలవనరులశాఖ, నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

గతంలో రిజర్వాయర్‌ నుంచి కేవలం సాగు అవసరాలకు మాత్రమే నీటిని వినియోగించేవారు. అయితే నగర జనాభా పెరిగిన నేపథ్యంలో తాగునీటి అవసరాలకు మార్చారు. మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ను 1980కు ముందు నిర్మించారు. పెందుర్తి, సబ్బవరం, కొత్తవలస పరిసర ప్రాంతాల్లో చెరువులు నిండిన తరువాత వచ్చే నీరు, వర్షాకాలంలో పరిసరాల నుంచి వచ్చే నీరు దీనికి ప్రధాన ఆధారం. సుమారు 2,716 ఎకరాల్లో ఒక టీఎంసీ సామర్థ్యంతో ఇక్కడ రిజర్వాయర్‌ను నిర్మించారు. 40 అడుగుల వెడల్పు, 12 అడుగుల ఎత్తులో ఆరు గేట్లను అమర్చారు. రిజర్వాయర్‌ గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 61 అడుగులు కాగా డెడ్‌ స్టోరేజ్‌ 44 అడుగులు. వర్షాకాలంలో 61 అడుగుల సామర్థానికి వచ్చేసరికి గేట్లు ఎత్తి, నీటిని దిగువకు విడిచిపెడుతుండేవారు. అయితే 45 సంవత్సరాలకు పూర్వమే ఏర్పాటుచేసిన గేట్ట మరమ్మతులపై అధికారులు పట్టించుకోలేదు. రిజర్వాయర్‌ కింద సాగు లేకపోవడంతో నగర ప్రజల తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని వినియోగిస్తున్నారు. నిర్వహణ జలవనరులశాఖ పరిధిలో ఉండగా, నీటిని జీవీఎంసీ పైపుల ద్వారా ప్రజలకు అందిస్తోంది. దీంతో నిర్వహణ కోసం ఏటా కొంత మొత్తం జలవనరులశాఖకు జీవీఎంసీ చెల్లించాల్సి ఉండగా ప్రస్తుతం ఈ బకాయి కోట్లలో ఉంది. ఈ నేపథ్యంలో రిజర్వాయరు గేట్ల నిర్వహణపై రెండు శాఖలు నిర్లక్ష్యం ప్రదర్శించడంతో మొత్తం ఆరింటిలో నాలుగు గేట్లు పూర్తిగా పాడవగా, రెండుగేట్లు మాత్రమే పనిచేస్తున్నాయి. ప్రతి సీజన్‌లో గేట్లకు గ్రీజు రాయడం, పనిచేస్తున్నాయా? లేదా అనేది తనిఖీ చేయాల్సి ఉంది. ఇటీవల నాలుగు గేట్లకు రంగులు వేయడం మినహా ఇతరత్రా మరమ్మతులు చేయలేదు. పూర్తిగా నిర్లక్ష్యానికి గురికావడంతో ఏటా వర్షాకాలంలో రిజర్వాయర్‌ నీటి సామర్థ్యం 60 అడుగులకు వచ్చేసరికి రెండు గేట్లు ఎత్తి నీటిని కిందకు విడిచిపెడుతున్నారు. మరమ్మతుల కోసం చాలాకాలంగా ప్రతిపాదనలు రూపొందించినా అమలుకాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జలవనరుల ప్రాజెక్టులకు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో అధికారులకు అప్రమత్తమై మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ గేట్లు మరమ్మతులకు రూ.4 కోట్లతో ప్రతిపాదించారు. కలెక్టర్‌, జీవీఎంసీ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లిన తరువాత ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని జలవనరులశాఖ సీఈ ఎస్‌.సుగుణాకరరావు తెలిపారు. రిజర్వాయర్‌కు గేట్లు చాలా ప్రధానమైనవని పేర్కొంటూ అత్యవసరంగా నిధులు విడుదలచేయాలని కోరామన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 01:18 AM