Share News

రియల్టర్‌ బరితెగింపు

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:36 AM

అధికార పార్టీ నాయకుల అండతో ఓ రియల్టర్‌ బరితెగించాడు. రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖ అధికారులను సైతం లెక్క చేయకుండా రాత్రికి రాత్రే గెడ్డ వాగులోంచి 40 అడుగుల వెడల్పున రహదారిని ఏర్పాటు చేశాడు. గతంలో రెవెన్యూ అధికారులు రహదారి నిర్మాణాన్ని అడ్డుకోవడంతో తాత్కాలికంగా పనులు నిలిచిపోయాయి. అయితే సంక్రాంతి సెలవుల నేపథ్యంలో రియల్టర్‌ శనివారం రాత్రి రహదారిని దర్జాగా ఏర్పాటు చేశాడు. రెవెన్యూ అధికారులు తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

రియల్టర్‌ బరితెగింపు
ప్రధాన రహదారిని ఆనుకుని గెడ్డ వాగులోంచి రియల్టర్‌ నిర్మించిన రహదారి

- వైసీపీ అండతో గెడ్డ వాగులోంచి దర్జాగా రహదారి నిర్మాణం

- సంక్రాంతి సెలవుల నేపథ్యంలో రాత్రికి రాత్రే రహదారి ఏర్పాటు

- గతేడాది ఆగస్టులో పనులను అడ్డుకున్న రెవెన్యూ అధికారులు

- నాడు తాత్కాలికంగా పనుల నిలుపుదల

- నేడు దర్జాగా రోడ్డు నిర్మాణం

- రెవెన్యూ తీరుపై తీవ్ర విమర్శలు

పరవాడ, జనవరి 16: అధికార పార్టీ నాయకుల అండతో ఓ రియల్టర్‌ బరితెగించాడు. రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖ అధికారులను సైతం లెక్క చేయకుండా రాత్రికి రాత్రే గెడ్డ వాగులోంచి 40 అడుగుల వెడల్పున రహదారిని ఏర్పాటు చేశాడు. గతంలో రెవెన్యూ అధికారులు రహదారి నిర్మాణాన్ని అడ్డుకోవడంతో తాత్కాలికంగా పనులు నిలిచిపోయాయి. అయితే సంక్రాంతి సెలవుల నేపథ్యంలో రియల్టర్‌ శనివారం రాత్రి రహదారిని దర్జాగా ఏర్పాటు చేశాడు. రెవెన్యూ అధికారులు తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎలమంచిలి - గాజువాక ప్రధాన రహదారికి ఆనుకుని పరవాడ రెవెన్యూ పరిధి సర్వే నంబరు 304లో పెద్ద గెడ్డవాగు ఉంది. వాగు అవతల రైతుల భూములున్నాయి. ఆ భూములను పరవాడకు చెందిన ఓ రియల్టర్‌ ఇటీవల కొనుగోలు చేశాడు. అయితే ప్రధాన రహదారి నుంచి భూముల్లోకి వెళ్లడానికి మార్గం లేదు. కేవలం కాలిబాటే ఉంది. దీంతో ఆ రియల్టర్‌ గతేడాది ఆగస్టులో గెడ్డ వాగులోంచి రహదారి ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యాడు. అప్పట్లో వాగులో ఉన్న చెట్లు, తుప్పలను తొలగించి సిమెంట్‌ గొట్టాలు ఏర్పాటు చేశాడు. వాటి పైనుంచి రహదారిని ఏర్పాటు చేసేందుకు ఉపక్రమించగా రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. అప్పటి నుంచి రహదారి ఏర్పాటుకు ఆ రియల్టర్‌ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. వరుసగా సంక్రాంతి సెలవులు రావడంతో శనివారం రాత్రి గుట్టు చప్పుడు కాకుండా గెడ్డ వాగు పైనుంచి 40 అడుగుల వెడల్పు మేర రహదారిని ఏర్పాటు చేశారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు నోరు మెదపకపోవడంపై స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇరిగేషన్‌, రె వెన్యూ అధికారులకు పెద్ద మొత్తంలో నగదు అందినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో పనులను అడ్డుకున్న రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు ఇప్పుడు రహదారి ఏర్పాటు చేసినా ఎందుకు అడ్డుకోలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. లక్షలాది రూపాయలు చేతులు మారడంతోనే సంబంధిత శాఖ అధికారులు తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సుమారు 50 సెంట్ల మేర గెడ్డను ఆక్రమించి దానిపై దర్జాగా రహదారి నిర్మించినా అడిగే నాథుడే లేకపోయాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సహజ వనరులను ధ్వంసం చేసిన ఆ రియల్టర్‌పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

రహదారి తొలగించినట్టు నాటకం

గెడ్డ వాగుపై నిర్మించిన రహదారిని తొలంచేశామంటూ రె వెన్యూ అధికారులు కొత్త నాటకానికి తెరతీశారు. ఎక్స్‌కవేటర్‌ సహాయంతో కొంచెం తొలగించి పూర్తిగా తొలగించినట్టు నమ్మబలికారు. కాగా రహదారి నిర్మాణంపై తహసీల్దార్‌ పి.కనకారావును ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించగా ఎక్స్‌కవేటర్‌కు చెందిన బ్లేడ్‌ రిపేరు కావడంతో పనులను నిలిపివేశామన్నారు. బుధవారం సాయంత్రానికి కల్లా రహదారిని పూర్తిస్థాయిలో తొలగిస్తామని చెప్పారు. అయితే గత ఏడాది ఆగస్టులో గెడ్డ వాగులో రహదారి ఏర్పాటు చేయడం కోసం సిమెంట్‌ గొట్టాలను రియల్టర్‌ అక్కడ సిద్ధం చేశారు. ఇప్పటికీ వాటిని తీయకుండా రహదారి ఏర్పాటు చేశారు. అప్పటి సిమెంట్‌ గొట్టాలు తొలగించలేని అధికారులు బుధవారం సాయంత్రానికి పూర్తిస్థాయిలో రహదారిని తొలగిస్తామని చెప్పడం కొసమెరుపు. వైసీపీకి చెందిన ఓ నాయకుడి డైరెక్షన్‌లోనే రెవెన్యూ అధికారులు నడుచుకుంటున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.

Updated Date - Jan 17 , 2024 | 12:36 AM