Share News

రియల్‌ ఢమాల్‌

ABN , Publish Date - Jan 14 , 2024 | 01:17 AM

విశాఖపట్నం జిల్లాలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం అంచనాలను అందుకోలేకపోతోంది.

రియల్‌ ఢమాల్‌

అంచనాలను అందుకోని రిజిస్ట్రేషన్లు

ఏప్రిల్‌-డిసెంబరు...9 నెలల ఆదాయ లక్ష్యం రూ.942.48 కోట్లు

వచ్చింది రూ.640.44 కోట్లు

...67.95 శాతం మాత్రమే రాక

పరిపాలనా రాజధాని ప్రచారాన్ని నమ్మని జనం

ఆచితూచి స్థిరాస్తుల కొనుగోళ్లు

ఎన్నికలు తరువాత చూసుకోవచ్చుననే ఆలోచనలో అత్యధికులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం జిల్లాలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం అంచనాలను అందుకోలేకపోతోంది. పరిపాలనా రాజధాని అని చెప్పి అమరావతి అధికారులు భారీ లక్ష్యాలను ఇస్తున్నారు. కానీ స్థానికంగా ఎవరూ స్థిరాస్తుల కొనుగోళ్లకు ముందుకు రాకపోవడంతో లక్ష్యంలో 70 శాతం కూడా సాధించలేకపోతున్నారు.

విశాఖపట్నం పరిపాలనా రాజధాని అవుతోందని, త్వరలో లో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుకాబోతోందని ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసింది. రుషికొండ, ఎండాడ ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయని ఊదరగొట్టింది. దాంతో ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఎప్పటి నుంచో వివిధ ప్రభుత్వ సంస్థలతో వివాదాల్లో ఉన్న వందలాది ఎకరాలను అధికార పార్టీ నాయకులు చేజిక్కించుకున్నారు. వాటిని వెంచర్లుగా మార్చి విక్రయాలకు తెర తీశారు. విల్లాలు, హై రైజ్డ్‌ అపార్టుమెంట్లు అంటూ వాటి ధరలను కోట్ల రూపాయల్లోకి తీసుకువెళ్లారు. మూడు రాజధానుల ప్రక్రియ న్యాయస్థానం వరకూ వెళ్లడంతో ముందుకు సాగలేదు. ఈలోగా సాధారణ ఎన్నికలు కూడా దగ్గరపడడంతో కొనుగోలుదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం మారితే అమరావతే రాజధానిగా ఉంటుందని, అప్పుడు విశాఖలో భూముల ధరలు తగ్గిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పుడు అధిక ధరలు పెట్టి కొనుగోలు చేస్తే నష్టపోతామని, 2024 మే నెల తరువాత పరిస్థితి చూసుకుని అప్పుడే విశాఖలో స్థిరాస్తులు కొనడం మంచిదనే నిర్ణయానికి వస్తున్నారు. దాంతో భవిష్యత్తు అవసరాల కోసం భూములు, భవనాలపై పెట్టుబడులు పెట్టేవారు తగ్గిపోయారు. సొంత ఇంటి కల సాకారం చేసుకోవడానికి ఫ్లాట్‌ అవసరం అనుకునేవారు, బ్యాంకు రుణాల లభ్యత ఉన్నవారు మాత్రమే ప్రస్తుతం కొనుగోళ్లకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం తగ్గిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలల కాలంలో ప్రభుత్వం ఇచ్చిన రూ.942.48 కోట్ల లక్ష్యంలో కేవలం 67.95 శాతంతో రూ.640.44 కోట్లు మాత్రమే ఆదాయం సాధించారు.

తొమ్మిది కార్యాలయాల ద్వారా రిజిస్ట్రేషన్లు

విశాఖ జిల్లాలో ఆనందపురం, భీమిలి, ద్వారకానగర్‌, గాజువాక, గోపాలపట్నం, మధురవాడ, పెందుర్తి, సూపర్‌బజార్‌, పెదగంట్యాడల్లో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో మధురవాడ, సూపర్‌బజార్‌ కార్యాలయాల్లో అత్యధికంగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. వీటిలో ఒక్కొక్కచోట నెలకు రూ.15 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. తొమ్మిది కార్యాలయాలు ఉండగా ఈ రెండింటి ద్వారానే 40 శాతం ఆదాయం సమకూరుతుంది. గోపాలపట్నం, పెందుర్తి, ఆనందపురం, భీమిలి, పెదగంట్యాడ కార్యాలయాలు లక్ష్యంలో 50 శాతం కూడా దాటడం కష్టమే. ఈ తొమ్మిది నెలల్లో ఒక్క మే నెలలో మాత్రమే లక్ష్యం సమీపంలోకి రాగలిగారు.

నెల వారీగా ఆదాయం వివరాలు

-------------------------------------------------------------

నెల లక్ష్యం సాధించిన ఆదాయం

--------------------------------------------------------------

ఏప్రిల్‌ రూ.104.63 కోట్లు రూ.63.9 కోట్లు

మే రూ.94.79 కోట్లు రూ.92.93 కోట్లు

జూన్‌ రూ.104.63 కోట్లు రూ.66.46 కోట్లు

జూలై రూ.126.84 కోట్లు రూ.64.88 కోట్లు

ఆగస్టు రూ.121.37 కోట్లు రూ.94.24 కోట్లు

సెప్టెంబరు రూ.82.87 కోట్లు రూ.63.14 కోట్లు

అక్టోబరు రూ.98.09 కోట్లు రూ.62.98 కోట్లు

నవంబరు రూ.98.09 కోట్లు రూ.61.55 కోట్లు

డిసెంబరు రూ.111.17 కోట్లు రూ.70.36 కోట్లు

-----------------------------------------------------------------

మొత్తం రూ.942.48 కోట్లు రూ.640.44 కోట్లు

-----------------------------------------------------------------

Updated Date - Jan 14 , 2024 | 01:17 AM