Share News

రావణాపల్లి పంట కాలువలు అస్తవ్యస్తం

ABN , Publish Date - Jul 28 , 2024 | 11:04 PM

రావణాపల్లి పంట కాలువల్లో పూడిక పేరుకుపోయి ఆయకట్టుకి పూర్తిస్థాయిలో సాగునీరు అందడం గగనమవుతోంది. కాలువల్లో ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలు పెరిగిపోయి అధ్వానంగా తయారయ్యాయి.

రావణాపల్లి పంట కాలువలు అస్తవ్యస్తం
పంట కాలువలో పిచ్చి మొక్కలు, పూడిక దృశ్యం

పూడిక పేరుకుపోయి పొలాలకు అందని సాగునీరు

రెండేళ్ల క్రితం రూ.2.5 కోట్లతో ప్రతిపాదనలు

నిధులు విడుదల చేయని గత వైసీపీ ప్రభుత్వం

ఇబ్బంది పడుతున్న ఆయకట్టు రైతులు

నర్సీపట్నం, జూలై 28: రావణాపల్లి పంట కాలువల్లో పూడిక పేరుకుపోయి ఆయకట్టుకి పూర్తిస్థాయిలో సాగునీరు అందడం గగనమవుతోంది. కాలువల్లో ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలు పెరిగిపోయి అధ్వానంగా తయారయ్యాయి.

నర్సీపట్నం, గొలుగొండ మండలాల్లోని 2,668 ఎకరాల ఆయకట్టుకి రావణాపల్లి రిజర్వాయర్‌ ద్వారా సాగునీరు అందుతోంది. కాలువల్లో పూడిక పేరుకుపోయి, పిచ్చి మొక్కలు అడ్డుపడి పొలాలకు సాగునీరు అందడం లేదు. కాలువల లైనింగ్‌, మదుములు, షట్టర్లు, గేట్లు మరమ్మతులకు గురయ్యాయి. పంట కాలువల్లో పూడిక తొలగించమని గత ఏడాది పలువురు ఆయకట్టు రైతులు ధర్నా కూడా చేశారు. గత ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్‌ శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. సాగునీరు అందించే పంట కాలువల నిర్వహణ అధ్వానంగా తయారు చేసింది. మరమ్మతులకు గురైన మదుముల గేట్లు, షట్టర్లు బాగు చేయకుండా వదిలేసింది. రెండేళ్ల క్రితం పంట కాలువల లైనింగ్‌, పూడిక తీత, మదుములు, గేట్లు, షట్టర్లు మర్మతులకు రూ.2.5 కోట్లతో ఇరిగేషన్‌ అధికారులు ప్రతిపాదనలు పంపితే బుట్టదాఖలు చేసింది. రిజర్వాయర్‌ నిండా నీరు ఉన్నా ప్రయోజనం ఉండడం లేదని, పంటకు అవసరం వచ్చినప్పుడు సాగునీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు. రిజర్వాయర్‌ గేట్లు ఎత్తి నీరు విడుదల చేసినా ఆయకట్టుకు సాగునీరు అందే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో కాలువలో పూడికతీత పనులు చేపట్టాలని కోరుతున్నారు.

Updated Date - Jul 28 , 2024 | 11:04 PM