Share News

రేషన్‌ సరకులు పక్కదారి

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:33 AM

జిల్లాలో రేషన్‌ సరకుల పంపిణీ సక్రమంగా జరగడం లేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. జిల్లా పౌర సరఫరాల శాఖాధికారుల పర్యవేక్షణ లోపం వల్ల సరకులు పక్కదారి పడుతున్నాయని తెలిసింది. జిల్లాలోని చింతూరులో గల పౌరసరఫరాల శాఖ గోదాము పరిధిలో గత మూడేళ్లుగా 1,600 టన్నుల రేషన్‌ బియ్యం మాయం కావడమే దీనికి నిదర్శనం.

రేషన్‌ సరకులు పక్కదారి
రెండు నెలలుగా రేషన్‌ సరకులు ఇవ్వలేదని జీకేవీధిలో ఆందోళన చేస్తున్న గిరిజనులు (ఫైల్‌ ఫొటో)

- పౌర సరఫరాల శాఖాధికారుల పర్యవేక్షణ లోపమే కారణం

- మారుమూల ప్రాంతాల గిరిజనులకు సక్రమంగా అందని బియ్యం

- చింతూరు గోదాములో 1,600 టన్నుల బియ్యం మాయం

- ఒడిశాకు తరలిపోతున్న సరకు

- చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం

(ఆంధ్రజ్యోతి- పాడేరు/చింతూరు)

జిల్లాలో రేషన్‌ సరకుల పంపిణీ సక్రమంగా జరగడం లేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. జిల్లా పౌర సరఫరాల శాఖాధికారుల పర్యవేక్షణ లోపం వల్ల సరకులు పక్కదారి పడుతున్నాయని తెలిసింది. జిల్లాలోని చింతూరులో గల పౌరసరఫరాల శాఖ గోదాము పరిధిలో గత మూడేళ్లుగా 1,600 టన్నుల రేషన్‌ బియ్యం మాయం కావడమే దీనికి నిదర్శనం.

జిల్లాలోని 22 మండలాల పరిధిలో 671 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. 2 లక్షల 93 వేల 720 రేషన్‌కార్డులు ఉన్నాయి. ఆయా లబ్ధిదారులకు పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రతి నెలా రేషన్‌ సరకులను పంపిణీ చేస్తున్నారు. అయితే అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల లబ్ధిదారులకు సక్రమంగా రేషన్‌ సరకులు అందడం లేదు. ఏజెన్సీలో 20 శాతం ఆన్‌లైన్‌లో, 80 శాతం ఆఫ్‌లైన్‌లో రేషన్‌ సరకుల పంపిణీ జరుగుతుండడంతో ఇదే అదనుగా పంపిణీదారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మారుమూల ప్రాంత గిరిజనులకు నెలనెలా సక్రమంగా సరకులు అందించకపోగా, సరకులు రాలేదని ప్రచారం చేస్తున్నారు. తమకు రెండు నెలలుగా రేషన్‌ సరకులు పంపిణీ చేయలేదని జీకేవీధి పంచాయతీ మురగడాపల్లి గ్రామానికి చెందిన గిరిజనులు ఆందోళన చేయడమే దీనికి నిదర్శనం.

అధికారుల నిర్లక్ష్యంతో ఆహార భద్రతా చట్టానికి తూట్లు

రేషన్‌ సరకుల పంపిణీ ప్రక్రియపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని తెలిసిందే. రేషన్‌ సరకులు నిల్వ చేసే గోదాములు, పంపిణీ చేసే రేషన్‌ దుకాణాలను పక్కాగా పర్యవేక్షిస్తే అక్రమాలకు ఆస్కారం ఉండదు. కానీ అధికారులు ఆ దిశగా దృష్టి సారించకపోవడంతో రేషన్‌ పంపిణీదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో జాయింట్‌ కలెక్టర్‌, సబ్‌కలెక్టర్‌, ముగ్గురు జీసీసీ డివిజనల్‌ మేనేజర్లు, పదిహేను మంది జీసీసీ బ్రాంచి మేనేజర్లు, పౌరసరఫరాల శాఖకు చెందిన డిప్యూటీ తహసీల్దార్లు ఉన్నప్పటికీ సరైన పర్యవేణ లేకపోవడం వల్లే రేషన్‌ సరకులు పక్కదారి పడుతున్నాయని తెలిసింది.

చింతూరులో 1,600 టన్నుల బియ్యం మాయం

జిల్లాలో చింతూరులోని పౌరసరఫరాల శాఖ గోదాము పరిధిలో గత మూడేళ్లుగా 1,600 టన్నుల రేషన్‌ బియ్యం మాయమైనట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అందుకు బాధ్యులను చేస్తూ పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ గణేశ్‌కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. కొవిడ్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో 2021 ఏప్రిల్‌ నుంచి రెండేళ్ల పాటు రేషన్‌కార్డులోని ప్రతి లబ్ధిదారుడికి నెలకు 5 కిలోల ఉచిత బియ్యం అదనంగా పంపిణీ చేశారు. అయితే చింతూరు పరిధిలోని చింతూరు, కూనవరం, వీఆర్‌.పురం, ఎటపాక మండలాల్లో కేంద్రం మంజూరు చేసిన అదనపు బియ్యాన్ని పక్కదారి పట్టించి, కేవలం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రేషన్‌ బియ్యం మాత్రమే పంపిణీ చేశారు. ఈ అక్రమాన్ని గుర్తించిన ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను మూడేళ్ల క్రితమే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. చింతూరు గోదాములో ముగ్గురు అవుట్‌సోరింగ్‌ ఉద్యోగులు రేషన్‌ బియ్యం అక్రమాలకు పాల్పడుతున్నారని అన్ని వివరాలతో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. అయినప్పటికీ ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ నేత కుంజ శ్రీను దానిపై పోరాటాలు చేయడంతో ఎట్టకేలకు దానిపై దృష్టి సారించిన అధికారులు పౌరసరఫరాల జిల్లా మేనేజర్‌ను సస్పెండ్‌ చేస్తూ, అక్రమ వ్యవహారంపై విచారణాధికారిగా జాయింట్‌ కలెక్టర్‌ భావన వశిష్ట్‌ను నియమించారు.

ఒడిశాకు తరలిపోతున్న రేషన్‌ సరకులు

ఏజెన్సీలోని అనేక మండలాల్లోని రేషన్‌ సరకులు సరిహద్దు ఒడిశా రాష్ట్రానికి తరలిపోతున్నాయి. ఆఫ్‌లైన్‌లో వున్న మారుమూల ప్రాంతాల్లో గిరిజనులకు సరకులు పంపిణీ చేయకుండా, పంపిణీ చేసినట్టు రికార్డులు సృష్టిస్తూ ఆయా సరకులను ఒడిశాలోని పలువురు వర్తకులకు విక్రయిస్తున్నారు. ఇటువంటి ఘటనలు ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో చోటు చేసుకుంటున్నాయి. ముంచంగిపుట్టు నుంచి సరిహద్దు ఒడిశాకు రేషన్‌ బియ్యం అక్రమ రవాణా ఘటనలను గిరిజనులు అడ్డుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇదే పరిస్థితి పెదబయలు మండలంలోనూ కొనసాగుతున్నది. అయితే అధికారులు అక్రమార్కులకు కొమ్ముకాస్తుండడంతో ఇటువంటి ఘటనలకు అడ్డుకట్టపడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వెలుగులోకి వచ్చిన అక్రమాలు ఇవి..

- జీకేవీధి జీసీసీ గోదాము పరిధిలోని సీలేరు, జీకేవీధి, ధారకొండ పంచాయతీల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు మూడు నెలలుగా మధ్యాహ్న భోజన పథకం బియ్యం పంపిణీ చేయలేదు. సబ్‌ కలెక్టర్‌ ధాత్రిరెడ్డి విచారణలో రూ.90 లక్షల విలువైన బియ్యం పక్కదారి పట్టాయని గుర్తించి జీసీసీ గోదాము సూపరింటెండెంట్‌ చల్లంగి కృష్ణారావును సస్పెండ్‌ చేశారు. ఉప తహసీల్దార్‌, జీసీసీ మేనేజర్లకు షోకాజు నోటీసులు జారీ చేశారు.

- జీకేవీధి పంచాయతీ మురగడాపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీలకు రెండు నెలలుగా రేషన్‌ బియ్యం పంపిణీ కాలేదు. దీంతో పత్రికల్లో వార్తా కథనాలు రావడంతో ఎండీయూ ఆపరేటర్‌ బియ్యం తిరిగి పంపిణీ చేశారు.

- జీకేవీధి మండలం దేవరాపల్లి పంచాయతీ ఎర్రగెడ్డ గ్రామానికి చెందిన ఆదివాసీలకు రెండు నెలలుగా రేషన్‌ బియ్యం పంపిణీ చేయలేదు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ వార్తా కథనం ప్రచురించడంతో ఎంపీపీ బోయిన కుమారి జోక్యం చేసుకుని జీసీసీ అధికారులు, ఉప తహసీల్దార్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెండు నెలలు తరువాత రేషన్‌ బియ్యం పంపిణీ చేశారు.

- నాలుగు నెలల కిత్రం ముంచంగిపుట్టు మండలం వనభసింగిలో అక్రమంగా తరలుతున్న 900 కిలోల రేషన్‌ పట్టుబడింది. దానిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.

- ఇటీవల ముంచంగిపుట్టు మండల కేంద్రంలోనే 300 కిలోల రేషన్‌ బియ్యం అక్రమంగా తరలుతుంటే గిరిజన సంఘం ప్రతినిఽధులు పట్టుకుని అధికారులకు అప్పగించారు. కానీ అధికారులు దీనిపై కనీసం స్పందించలేదు.

Updated Date - Mar 06 , 2024 | 12:33 AM