Share News

జిల్లాలో వర్షం.. సేదతీరిన జనం

ABN , Publish Date - May 25 , 2024 | 01:04 AM

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో జిల్లాలో పలు మండలాల్లో శుక్రవారం వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉండగా, మధ్యాహ్నం నుంచి వాన మొదలైంది. పలు మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురవగా, కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. ఇప్పటివరకు తీవ్ర ఎండలు, ఉక్కబోతతో అల్లాడిపోయిన జనం వరుణ దేవుడి కరుణతో చల్లబడడంతో సేదతీరుతున్నారు.

జిల్లాలో వర్షం.. సేదతీరిన జనం
ఎలమంచిలి పట్టణంలో కురుస్తున్న వర్షం

వేసవి దుక్కులకు ఉపకరిస్తుందంటున్న రైతాంగం

ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో జిల్లాలో పలు మండలాల్లో శుక్రవారం వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉండగా, మధ్యాహ్నం నుంచి వాన మొదలైంది. పలు మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురవగా, కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. ఇప్పటివరకు తీవ్ర ఎండలు, ఉక్కబోతతో అల్లాడిపోయిన జనం వరుణ దేవుడి కరుణతో చల్లబడడంతో సేదతీరుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి అనకాపల్లి, కశింకోటల్లో సాయంత్రం కొద్దిసేపు చిరు జల్లులు పడ్డాయి. పాయకరావుపేటలో సాయంత్రం నుంచి చిరు జల్లులు కురిశాయి. మాకవరపాలెం, ఎలమంచిలిలో ఉదయం నుంచి వాతావరణం చల్లబడింది. సాయంత్రం సుమారు అర్ధగంట పాటు వర్షం కురిసింది. గొలుగొండ, కృష్ణాదేవిపేటలో సుమారు గంటపాటు వర్షం కురిసింది. నర్సీపట్నం, బుచ్చెయ్యపేట, కె.కోటపాడు, దేవరాపల్లి, మాడుగుల, అచ్యుతాపురం, పరవాడ మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. రోలుగుంటలో పిడుగు పడి ఓ మహిళ మృతిచెందింది. కాగా శుక్రవారం కురిసిన వర్షం వేసవి దుక్కులకు ఉపకరిస్తుందని జిల్లాలోని రైతులు చెబుతున్నారు. రుతుపవనాలు ప్రవేశించే నాటికి మరో రెండు మూడు వర్షాలు కురిస్తే ఈ ఏడాది ఖరీఫ్‌ సాగుకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.

(24ఆర్‌ల్‌జి 1) గణేశ్వరి మృతదేహం

పిడుగు పడి మహిళ మృతి

రోలుగుంట, మే 24:

పిడుగుపాటుకు గురై ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం మండలంలోని కొమరవోలులో జరిగింది. గ్రామానికి చెందిన వంటాకుల గణేశ్వరి (39) పశువులను మేత కోసం తీసుకువెళ్లింది. కొమరవోలు తల్లి ఆలయం సమీపంలోని పొలంలో పశువులను మేపుతుండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు ఒక్కసారిగా పిడుగు పడడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతిరాలికి భర్త తమ్మునాయుడు, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సంఘటన స్థలాన్ని వీఆర్వో శ్రీనివాసరావు పరిశీలించి వివరాలు సేకరించారు.

Updated Date - May 25 , 2024 | 01:04 AM