రహస్య సర్వేపై రగడ
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:13 AM
హైడ్రో పవర్ ప్లాంట్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం జిల్లాలో అదానీ గ్రూప్ సంస్థ పేరుతో కొందరు మళ్లీ రహస్య సర్వే చేపడుతున్నారు. దీని కోసం ప్రత్యేక సర్వే బృందాలను రంగంలోకి దింపారు. కనీసం స్థానిక రెవెన్యూ, అటవీ శాఖల అనుమతులు కూడా పొందకుండానే ఈ సర్వే బృందాలు అత్యంత రహస్యంగా వివరాలు సేకరిస్తుండడం వివాదాస్పదంగా మారింది.

జిల్లాలో హైడ్రో పవర్ ప్లాంట్ సర్వే కోసం అదానీ సంస్థ బృందాల సంచారం
గుట్టు చప్పుడు కాకుండా వివరాల సేకరణ
రెవెన్యూ, అటవీ శాఖల అనుమతులు లేకుండానే పనులు
అడ్డుకుంటున్న గిరిజనులు
తమ ప్రాంతాల్లో సర్వే చేస్తే సహించబోమని హెచ్చరిక
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
హైడ్రో పవర్ ప్లాంట్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం జిల్లాలో అదానీ గ్రూప్ సంస్థ పేరుతో కొందరు మళ్లీ రహస్య సర్వే చేపడుతున్నారు. దీని కోసం ప్రత్యేక సర్వే బృందాలను రంగంలోకి దింపారు. కనీసం స్థానిక రెవెన్యూ, అటవీ శాఖల అనుమతులు కూడా పొందకుండానే ఈ సర్వే బృందాలు అత్యంత రహస్యంగా వివరాలు సేకరిస్తుండడం వివాదాస్పదంగా మారింది. ఈ బృందాలను గిరిజనులు అడ్డుకుంటున్నారు. తమ ప్రాంతాల్లో సర్వే చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు.
మాడుగుల నియోజకవర్గంలోని దేవరాపల్లి, అల్లూరి జిల్లాలోని అనంతగిరి సరిహద్దు గ్రామాల్లో సర్వే బృందాలు పనిచేస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో దేవరాపల్లి మండలం వాలాబు పంచాయతీ చింతలపూడి, నగరంపాలెం గ్రామాల్లో, అదే విధంగా అల్లూరి జిల్లా అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ సరియా, దాయర్తి గ్రామాల్లో అదానీ గ్రూపు సంస్థ పేరు చెబుతున్న రెండు సర్వే బృందాలు సంచరిస్తున్నాయి. కొండవాలు ప్రాంతాలైన సరియా, దాయర్తి పరిసరాల్లో నీటి వనరులున్న ప్రాంతాల్లో, చింతలపూడి, నగరంపాలెం ప్రాంతాల్లో హైడ్రో వవర్ ప్లాంట్ ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన భౌగోళిక స్థితిగతులను సర్వే బృందాలు సేకరించాయి. దేవరాపల్లి, అనంతగిరి మండలాల్లో రిజర్వు అటవీ ప్రాంతాల్లో ఈ ప్లాంట్ ఏర్పాటు కోసం సర్వే బృందాలు మట్టి నమూనాలను సేకరించి ఇప్పటికే పంపినట్టు సమాచారం. ఈ రెండు మండలాల్లో కోనాం, రైవాడ జలాశయాల పరిధిలో మట్టి నమూనాలు సేకరించడమే కాకుండా మరికొన్ని ప్రాంతాల్లో బృందాలు సర్వే జరిపేందుకు సన్నద్ధమవుతున్నాయి. జల వనరుల ఆధారంగా విద్యుదుత్పత్తి చేసే భారీ హైడ్రో పవర్ ప్లాంట్‌ను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం కోసం అదానీ గ్రూపు సంస్థల ప్రతినిధులు ఒక ప్రైవేటు సర్వే సంస్థ ద్వారా రహస్యంగా వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక ప్రాంతంలో ఏవైనా ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థలు సర్వేలు జరపాల్సి వస్తే కలెక్టర్, జేసీ స్థాయి అధికారుల నుంచి అనుమతులు విధిగా పొందాల్సి ఉంటుంది. ప్రభుత్వ శాఖల సహకారంతో ఆయా సంస్థలు సర్వేలు చేసుకొనే అవకాశం ఉంటుంది. అయితే అదానీ సంస్థ పేరుతో 2023 డిసెంబరు నెలలో ఈ ప్రాంతంలో సర్వే ప్రారంభించిన ప్రైవేటు సర్వే సంస్థ ఎటువంటి అనుమతులు పొందకుండానే సర్వే వ్యవహారాలు చక్కబెడుతోంది. గత ఏడాది స్థానికులు సర్వే చేయరాదని అడ్డుకోవడంతో వెనుదిరిగిన సర్వే బృందాలు తాజాగా మళ్లీ వారం రోజుల కింద నుంచి సర్వే చేస్తోంది. రెండు రోజుల కిందట చింతలపూడి, నగరంపాలెం, సరియా, దాయర్తి గ్రామాల్లో సర్వే జరుగుతున్న ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో స్థానికులు వెళ్లి సర్వే చేయవద్దని అడ్డుకున్నారు. సర్వే బృందాలు తమతో తీసుకొచ్చిన సామగ్రిని ఇక్కడ నుంచి తరలించాలని సర్వే సంస్థ ప్రతినిధులతో వాగ్వాదానికి దిగడంతో వారు అక్కడ నుంచి తాత్కాలికంగా వెళ్లిపోయారు. హైడ్రో పవర్ ప్లాంటుకు ఈ ప్రాంతంలో అనుమతి ఇస్తే తమ పంట పొలాలు, అటవీ సంపదను కోల్పోవాల్సి వస్తుందని ఈ ప్రాంత గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ ఈ ప్రాంతానికి సర్వే సంస్థలు వస్తే అడ్డుకుంటామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. కాగా దేవరాపల్లి తహసీల్దారు లక్ష్మీనారాయణ ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్ కోసం సర్వే చేసుకొనేందుకు, వివరాల సేకరణకు ప్రభుత్వం తరఫున ఎవరికీ ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని, అసలు సర్వే జరుగుతున్నట్టే తమ దృష్టికి రాలేదని చెబుతున్నారు.