Share News

ప్రశ్నించడమే పాపమా!?

ABN , Publish Date - May 08 , 2024 | 01:56 AM

వైసీపీ పాలనలో ఎస్సీలకు చేదు అనుభవాలు అనేకం. ప్రభుత్వ లోపాలను ప్రశ్నిస్తే వేధించి వెంటాడడం పాలకులకు అలవాటుగా మారింది.

ప్రశ్నించడమే పాపమా!?

కరోనా సమయంలో మాస్క్‌లు లేవన్నందుకు దళిత డాక్టర్‌ సుధాకర్‌కు వేధింపులు

నడిరోడ్డుపై కొట్టి, స్టేషన్‌లో నిర్బంధించారు

మతిస్థిమితం లేనట్టు చిత్రీకరించి మానసిక వైద్యశాలకు తరలించారు

ఏడాది తిరగకుండానే గుండెపోటుతో మృతి

మూడేళ్లవుతున్నా అందని న్యాయం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

వైసీపీ పాలనలో ఎస్సీలకు చేదు అనుభవాలు అనేకం. ప్రభుత్వ లోపాలను ప్రశ్నిస్తే వేధించి వెంటాడడం పాలకులకు అలవాటుగా మారింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో డాక్టర్‌ సుధాకర్‌ కేసు కూడా అలాంటిదే. ఇది దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఘటన అయినా ఆ కుటుంబానికి ఇప్పటివరకూ న్యాయం జరగకపోవడం గమనార్హం. గౌరవప్రదమైన డాక్టర్‌ వృత్తిలో ఉన్న వ్యక్తిని నేషనల్‌ హైవేపై దుస్తులు లేకుండా నిలబెట్టి పోలీసులు లాఠీలతో కొట్టారు. మతి స్థిమితం లేని వ్యక్తిగా ముద్రవేసి మానసిక వైద్యశాలలో పడేశారు. కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనకు ఊరట లభించింది. ఆ తరువాత కూడా ఉద్యోగంలోకి తిరిగి తీసుకోకపోవడంతో మానసిక వేదనకు గురైన ఆయన ఏడాది తిరగకుండానే గుండెపోటుతో మరణించారు. మూడేళ్లు అవుతున్నా ఇంకా ఆ కుటుంబానికి పూర్తిస్థాయిలో న్యాయం అందలేదు. ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కావడం వల్లే ఇలా చేశారని మిత్రులు వాపోతున్నారు.

ఇదీ కేసు నేపథ్యం

డాక్టర్‌ కె.సుధాకర్‌ (52) నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో అనస్థీషియన్‌గా పనిచేసేవారు. కరోనా సమయం (2020 ఏప్రిల్‌ 6వ తేదీ)లో ఆయన గ్లౌజులు, ఎన్‌-95 మాస్క్‌ కావాలని ఆస్పత్రిలో ఫార్మసిస్ట్‌ని అడిగారు. స్టాకు లేదని చెప్పడంతో డాక్టర్‌ అదే విషయాన్ని స్థానిక మీడియాకు తెలిపారు. రోగులకు చికిత్స చేసే వైద్యులకు కరోనా సమయంలో కనీసం మాస్క్‌లు కూడా ఇవ్వకపోవడంపై ప్రశ్నించారు. ఇది సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సాధారణంగా అయితే వెంటనే అన్ని ఆస్పత్రులకు అవసరమైన గ్లౌజులు, మాస్క్‌లు సరఫరా చేయాలి. కానీ ఇక్కడ వైసీపీ పాలకులు రివర్స్‌లో వెళ్లారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేసినందుకు డాక్టర్‌ సుధాకర్‌ను ఏప్రిల్‌ ఎనిమిదో తేదీన సస్పెండ్‌ చేశారు. దాంతో ఆయన ఇది అన్యాయమని గొంతెత్తారు. తాను ఏ తప్పు చేయకున్నా సస్పెండ్‌ చేశారంటూ వాపోయారు. మాస్క్‌లు అడగడం నేరమా?...అని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో డాక్టర్‌ సుధాకర్‌పై వైసీపీ పెద్దలు వ్యక్తిగతంగా కక్ష కట్టారు. విశాఖపట్నంలో నివాసం ఉండే ఆయన కదలికలపై నిఘా పెట్టారు. మరుసటి నెల మే 12వ తేదీన ఆయన కారులో పోర్టు ఆస్పత్రి నుంచి తాటిచెట్లపాలెం వైపు వెళుతుండగా మఫ్టీలో ఉన్న పోలీసులు జాతీయ రహదారిపై అక్కయ్యపాలెం వద్ద అడ్డగించారు. ఆయన కారు తాళాలు తీసుకున్నారు. ఆయన ప్రతిఘటించడంతో చొక్కా విప్పేసి, పెడరెక్కలు వెనక్కి విరిచి పట్టుకొని లాఠీలతో కొట్టారు. తన కారులో రూ.10 లక్షల నగదు, ఏటీఎం కార్డులు ఉన్నాయని, వాటిని పోలీసులు తీసుకొని ఇవ్వడం లేదని డాక్టర్‌ ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. నడిరోడ్డుపై న్యూసెన్స్‌ చేస్తున్నారని ఆరోపించి నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. బంధువులు, మీడియా వెంటపడడంతో అక్కడ నుంచి రాత్రికి రాత్రి కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ సరైన వైద్య పరీక్షలు నిర్వహించకుండానే మద్యం మత్తులో ఉన్నారని, మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నారని, ఆయన ‘ఎక్యూట్‌ ట్రాన్సియంట్‌ సైకోసిస్‌’తో బాధపడుతున్నారని పేర్కొంటూ నగరంలోని మానసిక వైద్యశాలకు తరలించారు.

సంబంధం లేని చికిత్స

మానసిక వైద్యశాలకు తరలించడంతో డాక్టర్‌ సుధాకర్‌ కుంగిపోయారు. సంబంధం లేని మందులు తనకు ఇస్తున్నారని ఆరోపించారు. ఆ మందుల వల్ల తనకు దద్దుర్లు వచ్చాయని, కళ్లు సరిగ్గా కనిపించడం లేదని, తల తిప్పుతున్నట్టుగా ఉందని, వెంటనే తనను వేరే ఆస్పత్రికి మార్చాలంటూ సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు. పైగా ఆస్పత్రిలో తనకు చికిత్స చేస్తున్న డాక్టర్‌ అధికార పార్టీకి చెందిన వ్యక్తి అంటూ ఆయన ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ ఎదుర్కొంటున్న కేసుల్లో ఏ-7గా ఉన్న వ్యక్తికి సదరు డాక్టర్‌ స్వయానా సోదరుడని, తనకు ప్రాణ హాని ఉందని, ప్రభుత్వ మానసిక వైద్యశాల నుంచి తరలించాలని వేడుకున్నారు. ఆయన లేఖ బయటకు రావడం, మీడియాలో వార్తా కథనాలు రావడంతో హైకోర్టు దీనిని సుమోటో కేసుగా స్వీకరించింది. డాక్టర్‌ సుధాకర్‌పై దాడి, తదుపరి పరిణామాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ కేసును సీబీఐ చేపట్టింది. వీటన్నింటి నేపథ్యంలో డాక్టర్‌ సుధాకర్‌ను ఇంటికి పంపించారు. అయితే ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్‌ ఎత్తివేయలేదు. ఆ కాలంలో సగం జీతం ఇవ్వాల్సి ఉండగా అది కూడా విడుదల చేయలేదు. ఆర్థిక కష్టాలు ఎక్కువయ్యాయి. తిరిగి తనను విధుల్లోకి తీసుకోవాలని, ఆరోగ్యంగా ఉన్నానని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఎవరూ కనికరించలేదు. ఉద్యోగం పోయి, చేతిలో డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయన 2021 మే 22న గుండెపోటుతో చనిపోయారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. డాక్టర్‌ సుధాకర్‌ తల్లి వద్దనే సీతమ్మధారలో అంతా కలిసి ఉంటున్నారు. తన కుమారుడికి జరిగిన అన్యాయంపై తల్లి కావేరిభాయి మాత్రమే పలుమార్లు మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తంచేశారు. భార్య, పిల్లలు మాత్రం భయపడి నోరు విప్పలేదు. జీవనాధారమైన ఆయన చనిపోయి మూడేళ్లు కావస్తున్నా ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం రాలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై డాక్టర్‌ కుటుంబాన్ని సంప్రతించగా, మాట్లాడేందుకు నిరాకరించారు. తాము అన్ని విధాలుగా నష్టపోయామని, ఏమి చెబుతామంటూ నిరాకరించారు.

Updated Date - May 08 , 2024 | 01:56 AM