Share News

ప్రొటోకాల్‌ భారం

ABN , Publish Date - Mar 12 , 2024 | 01:30 AM

జిల్లా యంత్రాంగానికి ప్రొటోకాల్‌ ఖర్చులు తలనొప్పిగా మారాయి.

ప్రొటోకాల్‌ భారం

బకాయిలు సుమారు రూ.25 కోట్లు

ప్రముఖులు వస్తున్నారంటే హడలెత్తిపోతున్న అధికారులు

బిల్లుల కోసం కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్న హోటల్‌, పెట్రోల్‌ బంక్‌ల నిర్వాహకులు

రోడ్లు, భవనాల శాఖకు మరో రూ.5 కోట్లు

విశాఖపట్నం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి):

జిల్లా యంత్రాంగానికి ప్రొటోకాల్‌ ఖర్చులు తలనొప్పిగా మారాయి. గడచిన ఎనిమిదేళ్లుగా ప్రొటోకాల్‌ విభాగం పెట్టిన ఖర్చులో ఇంకా రూ.25 కోట్లు ప్రభుత్వం నుంచి రావలసి ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ప్రొటోకాల్‌ ఖర్చులకు నిధులు విడుదల చేయడం లేదు. అదే సమయంలో ప్రముఖుల పర్యటనలు, ఇతరత్రా అతిథి మర్యాదల పేరిట ఖర్చులు మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో నగరానికి ప్రముఖులు వస్తున్నారన్నా...ప్రభుత్వం తరపున అధికారిక కార్యక్రమాలు చేయాలన్నా అధికారులు బెంబేలెత్తిపోతున్నారు.

జిల్లాలో ప్రముఖుల పర్యటనలు, అధికారిక కార్యక్రమాల నిర్వహణ బాధ్యత కలెక్టరేట్‌లో ప్రోటోకాల్‌ విభాగం పర్యవేక్షిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకించి బడ్జెట్‌ ఇవ్వాలి. గత ప్రభుత్వాల హయాంలో ఖర్చుల కోసం విడతల వారీగా నిధులు ఇస్తుండేవారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖలో అనేక కార్యక్రమాలు, జాతీయ, అంతర్జాతీయ సదస్సులు నిర్వహించారు. ఇంకా మూడు పర్యాయాలు పేదలకు పట్టాల పంపిణీ వంటి కార్యక్రమాల కోసం భారీసభలు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా షామియానాలు, కుర్చీలు, బారికేడ్లు, వేదిక ఏర్పాటు, భోజనాలు, ప్రముఖులకు వాహనాలు, హోటళ్లు గదుల ఏర్పాటువంటివి ఉంటాయి. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఖర్చులకు సంబంధించి పలు విడతలుగా కొంత మేర నిధులు ఇచ్చినా 2016 నుంచి 2019 వరకు సుమారు రూ.10 కోట్లు బకాయి ఉండిపోయాయి. వైసీపీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తరువాత పాత బకాయిల విడుదల కోరుతూ జిల్లా యంత్రాంగం పంపిన వినతిపత్రాన్ని పక్కనపడేసింది. కాగా జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రొటోకాల్‌ కోసం సుమారు రూ.15 కోట్లు ఖర్చుచేశారు. దీంట్లో రూ.ఆరున్నర కోట్లు విడుదల చేశారు. అయితే ఇంకా రూ.3.5 కోట్ల బిల్లులు ట్రెజరీలో పెండింగ్‌లో ఉన్నాయి. ఈలోగా మరికొన్ని కార్యక్రమాల కోసం మరో రూ.మూడు కోట్ల వరకు ఖర్చుచేశారు. పాత బకాయిలు, గడచిన ఐదేళ్లలో ఖర్చు చేసినవి కలిపి రూ.25 కోట్ల వరకు విడుదల చేయాల్సి ఉంది. దీంతో నగరానికి ప్రముఖులు వస్తున్నారంటే కలెక్టరేట్‌ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. సీఎం కోసం నిర్మించిన హెలిప్యాడ్‌ల వద్ద సీసీ కెమెరాలు, హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ ఏర్పాటు వంటి ఖర్చులు అదనం. ఇదిలావుండగా నగరంలో సీఎంతోపాటు ఇతర ప్రముఖుల పర్యటన సందర్భంగా ఎయిర్‌పోర్టు, ఇతర ప్రాంతాల వద్ద బారికేడ్ల నిర్మాణం వంటి ఖర్చుల బాధ్యత రోడ్లు, భవనాల శాఖ చూస్తోంది. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రోడ్లు భవనాలకు సుమారు రూ.ఐదు కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కాగా పెండింగ్‌ బిల్లుల కోసం ఆయిల్‌ బంకుల యజమానులు, హోటళ్ల యజమానులు, తదితరులు చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. అయినా సొమ్ములు విడుదల కావడం లేదు. ఒకవేళ సీఎం విశాఖలో క్యాంపు కార్యాలయం ఏర్పాటుచేసి ఉంటే అధికారులపై మరింత భారం పడి ఉండేదని ఇటీవల నగరం నుంచి బదిలీపై వెళ్లిన ఒక అధికారి వ్యాఖ్యానించడం కొసమెరుపు.

Updated Date - Mar 12 , 2024 | 01:30 AM