జైలు ఎదుట ఆందోళన
ABN , Publish Date - Dec 29 , 2024 | 01:19 AM
కేంద్ర కారాగారం ఎదుట జైలు వార్డర్ల కుటుంబసభ్యులు శనివారం ఆందోళనకు దిగారు.

ఇద్దరు వార్డర్లను తనిఖీ చేసిన ఇన్‌చార్జి సూపరింటెండెంట్
విధి నిర్వహణ పేరుతో తమను ఆయన వేధిస్తున్నారంటూ నిరసనకు దిగిన వార్డర్లు, కుటుంబ సభ్యులు
క్షమాపణ చెప్పాలని డిమాండ్
ఆరిలోవ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి):
కేంద్ర కారాగారం ఎదుట జైలు వార్డర్ల కుటుంబసభ్యులు శనివారం ఆందోళనకు దిగారు. తమను విధి నిర్వహణ పేరుతో ఇన్‌చార్జి సూపరింటెండెంట్ మహేష్‌బాబు వేధిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి వార్డర్లు, వారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వార్డర్లుగా పనిచేస్తున్న జయకృష్ణ, శంభు శనివారం ఉదయం విధి నిర్వహణ నిమిత్తం జైలు ప్రధానద్వారం దాటి లోపలకు ప్రవేశించారు. గంజాయి లోపలకు తీసుకువస్తున్నారనే అనుమానంతో వారిద్దరినీ అక్కడే ఉన్న ప్రైవసీ గదిలోకి తీసుకువెళ్లి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ మహేష్‌బాబు తనిఖీ చేశారు. ఖైదీల ఎదురుగా దుస్తులు విప్పించి తనిఖీ చేయడంపై వార్డర్లు అభ్యంతరం వ్యక్తంచేశారు. దాంతో ఇన్‌చార్జి సూపరింటెండెంట్ మహేష్‌బాబు దురుసుగా ప్రవర్తించడంతోపాటు అసభ్యపదజాలంతో దూషించారు. ఆ విషయాన్ని ఇద్దరూ తోటి వార్డర్లకు చెప్పడంతో అందరూ సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో బయటకు వచ్చి ప్రధాన ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. ఇన్‌చార్జి సూపరింటెండెంట్ విధి నిర్వహణ పేరుతో తమను వేధిస్తున్నారని, అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మిగిలిన అధికారులు వచ్చి వారికి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించి జైలు ఆవరణలోని క్వార్టర్లకు వెళ్లిపోయారు. కొంతసేపటి తర్వాత సూపరింటెండెంట్ తనను ఎవరూ ఏమీ చేయలేరని వ్యాఖ్యానించినట్టు తెలుసుకుని వార్డర్లు తమ కుటుంబసభ్యులతో కలిసి వచ్చి మళ్లీ జైలు ప్రధాన ద్వారం వద్ద ఆందోళనకు దిగారు. వార్డర్లు పక్కన నిలబడితే వారి కుటుంబ సభ్యులు ఆందోళన కొనసాగించారు. రాత్రి పది గంటలకు కూడా ఆందోళన విరమించలేదు. జైళ్ల శాఖ ఉన్నతాధికారులు వచ్చే వరకు కదిలేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. దీనిపై ఇన్‌చార్జి సూపరింటెండెంట్ మహేష్‌బాబు వివరణ ఇస్తూ ఒకరు విధుల్లోకి వచ్చినప్పుడు తరచూ గంజాయితో వస్తున్నారని, దీనిపై సమాచారం ఉండడంతోనే వారిద్దరినీ తనిఖీ చేశామన్నారు. జైలు నిబంధనలకు లోబడి, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే నడుచుకుంటున్నామన్నారు.