Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

ఘాట్‌ రోడ్డులో రక్షణ కరువు

ABN , Publish Date - Mar 03 , 2024 | 01:08 AM

పాడేరు నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్లే స్థానిక ఘాట్‌ మార్గంలో రక్షణ గోడలు శిథిలమయ్యాయి. దీని వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటికి మరమ్మతులు చేసి ప్రమాదాలను నివారించాల్సిన వైసీపీ ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు.

ఘాట్‌ రోడ్డులో రక్షణ కరువు
ఘాట్‌లో ప్రమాదకరమైన మలుపు వద్ద శిథిలమైన రక్షణ గోడలు

- ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోని రక్షణ గోడలు

- గతేడాది బస్సు ప్రమాదం నేపథ్యంలో మొక్కుబడిగా పనులు

- కార్యాచరణకు నోచుకోని రూ.8.5 కోట్ల ప్రతిపాదన

- పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం

(ఆంధ్రజ్యోతి- పాడేరు)

పాడేరు నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్లే స్థానిక ఘాట్‌ మార్గంలో రక్షణ గోడలు శిథిలమయ్యాయి. దీని వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటికి మరమ్మతులు చేసి ప్రమాదాలను నివారించాల్సిన వైసీపీ ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు.

స్థానిక ఘాట్‌ మార్గంలోని రక్షణ గోడలు చాలా కాలంగా కనీసం మరమ్మతులకు సైతం నోచుకోలేదు. గతేడాది ఆగస్టు 20న ఘాట్‌లో ఆర్‌టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా, 31 మంది గాయపడిన నేపథ్యంలో అప్పటి కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ రక్షణ గోడలకు మరమ్మతులు చేపట్టాలని ఆర్‌ అండ్‌ బీ అధికారులను ఆదేశించారు. దీంతో రెండు, మూడు మలుపుల్లో మాత్రమే రక్షణ గోడలకు మరమ్మతులు చేసి అధికారులు మిన్నకున్నారు. చేసిన ఆ పనులు సైతం నాణ్యత లేకపోవడంతో ప్రస్తుతం అవన్నీ శిథిలమైపోయాయి. కాగా పాడేరు జిల్లా కేంద్రం కావడంతో ఘాట్‌ మార్గంలో రాకపోకలు పెరిగాయి. ఈ క్రమంలో స్థానిక ఘాట్‌ రోడ్డులో రక్షణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి అవసరం ఉంది. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పాడేరు నుంచి చోడవరం, అనకాపల్లి, విశాఖపట్నం ప్రాంతాలకు రాకపోకలు సాగించాలన్నా, ఆయా ప్రాంతాల నుంచి పాడేరుతో పాటు ఒడిశా రాష్ట్రానికి వెళ్లాలన్నా ఘాట్‌ ప్రయాణం తప్పనిసరి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ ఘాట్‌ మార్గంలో రక్షణపై పాలకులు దృష్టి సారించకపోవడం ఘోరమని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా ఘాట్‌లోని వ్యూపాయింట్‌కు సమీపంలో, రాజాపురం సమీపంలో, ఏసుప్రభు బొమ్మ మలుపులకు అటూ, ఇటూ, వంట్లమామిడి నుంచి గరికిబంద వరకు ఉన్న మలుపుల్లో రక్షణ గోడలు శిథిలమైపోయాయి. పొరపాటున వాహనాలు అదుపు తప్పితే లోయలోకి దూసుకుపోవాల్సిందే. గతంలో నిర్మించిన రక్షణ గోడలు శిథిలం కాగా, చాలా ఏళ్లుగా కొత్త రక్షణ గోడలు నిర్మించకపోవడంతో ఘాట్‌ ప్రయాణం ప్రమాదకరంగా మారింది.

కార్యాచరణకు నోచుకోని ప్రతిపాదన

స్థానిక ఘాట్‌ మార్గంలో ప్రమాదకరంగా ఉన్న మలుపుల వద్ద ఇనుప గడ్డర్లను ఏర్పాటు చేయాలని చాలా కాలంగా రోడ్లు, భవనాల శాఖాధికారులు ప్రతిపాదిస్తున్నప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు. 2022లో అప్పటి ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఘాట్‌ మార్గంలో అవసరమైన చోట్ల మరమ్మతులు చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులను కోరారు. అందుకు గాను సుమారుగా రూ.8 కోట్ల 50 లక్షలతో ప్రతిపాదనలు చేశారు. ఆయా నిధులు మంజూరైతే ఘాట్‌లోని ప్రమాదకరంగా ఉన్న మలుపులను సరి చేయడంతోపాటు, వాహనాలు అదుపు తప్పి లోయల్లోకి బోల్తా కొట్టకుండా పటిష్ఠమైన ఇనుప గడ్డర్లను ఏర్పాటు చేయాలని భావించారు. కానీ ఆ ప్రతిపాదనకు రెండేళ్లయినా రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తెలపలేదు. దీంతో అభివృద్ధి అనేది ఘాట్‌ రోడ్డుకు మరింత దూరమైంది.

Updated Date - Mar 03 , 2024 | 01:08 AM