Share News

అసంపూర్తి రోడ్డుతో అవస్థలు

ABN , Publish Date - Jan 06 , 2024 | 11:28 PM

అసంపూర్తి రహదారితో మండలంలోని కొర్రవానిపాలెం గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఇచ్చిన గడువు ముగిసి తొమ్మిది నెలలు గడిచినా ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేదు. కాంట్రాక్టరుకు బిల్లులు మంజూరు చేయకపోవడం వల్లే పనులు నిలిచిపోయాయని తెలిసింది.

అసంపూర్తి రోడ్డుతో అవస్థలు
రోడ్డుపై కంకర చిప్స్‌ వేసి వదిలేసిన దృశ్యం

కంకర చిప్స్‌ వేసి వదిలేయడంతో కొర్రవానిపాలెం గ్రామస్థుల పాట్లు

తరచూ ప్రమాదాలకు గురవుతున్న వాహనచోదకులు

నిర్మాణం పూర్తి చేయాల్సిన గడువు ముగిసి తొమ్మిది నెలలైనా పట్టించుకోని అధికారులు

కాంట్రాక్టరుకు బిల్లులు చెల్లించకపోవడం వల్లే పనులు నిలిచినట్టు ప్రచారం

నక్కపల్లి, జనవరి 6: అసంపూర్తి రహదారితో మండలంలోని కొర్రవానిపాలెం గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఇచ్చిన గడువు ముగిసి తొమ్మిది నెలలు గడిచినా ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేదు. కాంట్రాక్టరుకు బిల్లులు మంజూరు చేయకపోవడం వల్లే పనులు నిలిచిపోయాయని తెలిసింది.

నాలుగు దశాబ్దాల నుంచి ఉపమాక, ఎన్‌.నర్సాపురం గ్రామాల జంక్షన్‌ నుంచి కొర్రవానిపాలెం గ్రామానికి వెళ్లే రహదారిని నిర్మించలేదు. దీంతో వర్షం వస్తే ఈ గ్రామానికి చెందిన విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం కష్టంగా ఉండేది. దీంతో ఎమ్మెల్యే బాబూరావు సిఫారసు మేరకు పంచాయతీరాజ్‌శాఖ ద్వారా ఈ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం రూ84.6 లక్షలు నిధులు మంజూరు చేసింది. 2023 ఫిబ్రవరి 4న ఎమ్మెల్యే గొల్ల బాబూరావు రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. టెండరు నిబంధనల ప్రకారం 2023 మార్చి 26 నాటికి ఈ రహదారి పనులను కాంట్రాక్టరు పూర్తి చేయాల్సి వుంది. ఈ రహదారితో పాటు సమీప గ్రామాల్లో మరికొన్ని రహదారుల నిర్మాణ పనులకు సంబంధించి రూ.2.71కోట్లతో రావులపాలేనికి చెందిన కల్యాణి కనస్ట్రక్షన్‌ సంస్థకు అప్పగించారు. ఇందులో రూ.84.60 లక్షల వ్యయంతో కిలో మీటరు పొడవున కొర్రవానిపాలెం గ్రామానికి తారు రోడ్డు నిర్మించాల్సి వుంది. కానీ ఇప్పటి వరకు రహదారి నిర్మాణం పూర్తి చేయకపోవడం, రోడ్డుపై కంకర చిప్స్‌ వేసి వదిలేయడం వల్ల ఏ మాత్రం బైక్‌పై వేగంగా వెళ్లినా బోల్తా పడుతున్నారు. వర్షం వస్తే ఈ రోడ్డుపై ప్రయాణించేవారి బాధ వర్ణణాతీతమని చెప్పాలి. గడువు దాటి తొమ్మిది నెలలు పూర్తయినా ఈ రహదారి నిర్మాణ పనులను అసంపూర్తిగా వదిలేయడంపై గ్రామస్థులు మండిపడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ కూడా లేకపోవడం, కాంట్రాక్టరు పట్టించుకోకపోవడం తమ గ్రామానికి శాపంగా మారిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా కాంట్రాక్టరుకు ఇంకా బిల్లులు చెల్లించాల్సి వుందని, అందు వల్లే పనులు ఆగాయని ప్రాజెక్ట్‌ అధికారి ఒకరు చెప్పారు. వీలైనంత త్వరలో ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసేలా కృషి చేస్తామని తెలిపారు.

Updated Date - Jan 06 , 2024 | 11:28 PM