Share News

హద్దు దాటిన అటవీ సిబ్బందిపై చర్యలకు రంగం సిద్ధం

ABN , Publish Date - Mar 12 , 2024 | 12:44 AM

రాజమహేంద్రవరం- విజయనగరం జాతీయ రహదారి 516-ఇ నిర్మాణానికి సంబంధించి హద్దు దాటి చింతాలమ్మఘాట్‌ రోడ్డులో చెట్లు నరికివేసిన అటవీ సిబ్బందిపై చర్యలకు రంగం సిద్ధమైంది. దీనిలో భాగంగా సోమవారం మూడు జిల్లాల స్క్వాడ్‌ డీఎఫ్‌వో సోమసుందరంతో పాటు చింతపల్లి డీఎఫ్‌వో, మరో ఇద్దరు సబ్‌ డీఎఫ్‌వోలతో కూడిన బృందం మరోసారి అవసరానికి మించి తొలగించిన చెట్ల విషయమై పరిశీలన చేశారు.

హద్దు దాటిన అటవీ సిబ్బందిపై చర్యలకు రంగం సిద్ధం
ఘాట్‌లో హద్దులను రికార్డుల ఆధారంగా పరిశీలిస్తున్న స్క్వాడ్‌ డీఎఫ్‌వో, తదితరులు

- నరికివేసిన చెట్లపై మరోసారి విచారణ

కొయ్యూరు, మార్చి 11: చింతాలమ్మఘాట్‌(ఏడొంపులఘాట్‌)లో రహదారి నిర్మాణాలకు నిర్దేశించిన అలైౖన్‌మెంట్‌ను దాటి పెదవలస ఫారెస్టు రేంజ్‌ పరిధిలో 30 చెట్లు, కృష్ణాదేవిపేట రేంజ్‌ పరిధిలో 59 చెట్లను కొయ్యూరు అటవీ సిబ్బంది నరికి వేసిన విషయం తెలిసిందే. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ లో వరుస కథనాలు ప్రచురితం కావడంతో చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు(సీసీఎఫ్‌) స్పందించి విచారణకు ఆదేశించారు. ఇప్పటికే పరిశీలన జరిపిన స్క్వాడ్‌ డీఎఫ్‌వో సోమసుందరం 29 చెట్లకు సంబంధించిన మొదళ్లను గుర్తించి నివేదిక ఇచ్చారు. దీనిపై సంతృప్తి చెందని సీసీఎఫ్‌ సమగ్ర విచారణకు ఆదేశించారు. దీంతో సోమవారం స్క్వాడ్‌ డీఎఫ్‌వోతో పాటు చింతపల్లి డీఎఫ్‌వో సూర్యనారాయణ, ఎలమంచిలి, ఆర్‌వీ నగర్‌ సబ్‌ డీఎఫ్‌వోలు కుమార్‌ పెర్నాడరాజులతో కూడిన బృందం ఘాట్‌రోడ్డులో సోమవారం విచారణ జరిపింది. గతంలో నరికిన చెట్లకు అదనంగా మరో ఆరు చెట్లు తొలగించినట్టు ఈ విచారణలో గుర్తించారు. నరికిన చెట్లు అన్నీ జాతీయ రహదారికి నిర్దేశించిన అలైౖన్‌మెంట్‌ దాటి ఉన్నట్టు నిర్ధారించారు. అనంతరం ఈ బృందం కాకరపాడు అటవీ డిపోను సందర్శించి అదనంగా తొలగించిన చెట్లకు సంబంధించిన కలప ఉందో?, లేదో? పరిశీలించారు. ఇందులో భాగంగా అదనంగా చెట్లు నరికించిన సిబ్బందిని విచారించారు. ఈ సందర్భంగా స్క్వాడ్‌ డీఎఫ్‌వో మాట్లాడుతూ సీసీఎఫ్‌ ఆదేశాలను అనుసరించి విచారణ జరిపామన్నారు. విచారణకు సంబంధించిన వివరాలను సీసీఎఫ్‌కు నివేదిస్తామన్నారు. హద్దు దాటి చెట్లు నరికిన విషయమై బాధ్యులపై చర్యలకు సంబంధించి ఉన్నతాధికారులదే తుది నిర్ణయమని ఆయన చెప్పారు.

Updated Date - Mar 12 , 2024 | 12:44 AM