స్వర్ణాంధ్ర-2047 ప్రణాళికలు సిద్ధ చేయండి
ABN , Publish Date - Sep 24 , 2024 | 01:31 AM
స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ విజయకృష్ణన్
అనకాపల్లి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి):
స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంపై జేసీ జాహ్నవితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అన్ని శాఖల అధికారులు ఈ నెల 30వ తేదీలోగా మండల స్థాయిలో నివేదికలు రూపొందించి జిల్లా అధికారులకు పంపాలని, స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాల ప్రణాళికలను అక్టోబరు 15వ తేదీ నాటికి సిద్ధం చేయాలన్నారు. ప్రతి ఏడాది లక్ష్యంపై డాక్యుమెంటేషన్ తయారు చేయాలని సూచించారు. జిల్లాలో టూరిజం, టెంపుల్ టూరిజం, వ్యవసాయ, ఉద్యాన, మత్స్య రంగాల అభివృద్ధి ప్రణాళికలు సమగ్రంగా ఉండాలన్నారు. కళాశాలల్లో, పాఠశాలల్లో విజన్ ఆంధ్ర-2047పై విద్యార్థులకు పోటీలు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర-2047 పోస్టర్‌ను ఆవిష్కరించారు.
వయోవృద్ధుల సంక్షేమానికి కృషి: జేసీ
వయోవృద్ధుల సంక్షేమానికి కృషి జరుగుతోందని జేసీ జాహ్నవి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వయోవృద్ధులు, తల్లిదండ్రుల సంక్షేమం, నిర్వహణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వయోవృద్ధులు జేసీకి తమ సమస్యలను వివరించారు. సమావేశానికి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.