ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - May 12 , 2024 | 01:05 AM
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి తెలిపారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కేవీ మురళీకృష్ణతో కలిసి ఆయన మాట్లాడారు.

- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి
అనకాపల్లి, మే 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి తెలిపారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కేవీ మురళీకృష్ణతో కలిసి ఆయన మాట్లాడారు. జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,529 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, 12,89,371 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వారిలో 6,27,321 పురుషులు, 6,62,022 మంది మహిళా ఓటర్లు, 28 మంది ఇతర ఓటర్లు ఉన్నారని చెప్పారు.
340 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
1,529 పోలింగ్ కేంద్రాల్లో 340 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్ చేస్తున్నట్టు తెలిపారు. పీవోలు 1,759 మంది ఏపీవోలు 1,743 మంది, 7,036 సూక్ష్మ పరిశీలకులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారన్నారు. 3,666 బ్యాలెట్ యూనిట్లు, 3,666 కమిషనింగ్ యూనిట్లు, 3,968 వీవీ ప్యాట్లు, 25 బృందాలు సిద్ధం చేశామని తెలిపారు.
పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు
ఎస్పీ కేవీ మురళీకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల బందోబస్తులో భాగంగా కేంద్ర బలగాలు కూడా పాల్గొంటున్నాయని తెలిపారు. రౌడీషీటర్లు, ఎన్నికల్లో గతంలో ఇబ్బందులు కలిగించిన వారిని గుర్తించి అవసరం మేరకు తగిన చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో రానున్న 48 గంటల పాటు 144 సెక్షన్, 30 పోలీస్ యాక్టు అమలులో ఉందని తెలిపారు. చెక్‌పోస్టులను మరింత పటిష్ఠంగా నిర్వహిస్తామని తెలిపారు.