Share News

పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు!

ABN , Publish Date - Feb 17 , 2024 | 01:08 AM

ఇటు సాధారణ ఎన్నికలు, అటు పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఈసారి ఇంచుమించుగా ఒకే సమయంలో జరగనుండడంతో విద్యార్థులు ఇబ్బంది పడకుండా సంబంధిత శాఖల అధికారులు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి.. జిల్లా విద్యా శాఖాధికారులు, పోలీసు, విద్యుత్‌, ఆర్టీసీ, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి, ఏ శాఖ.. ఏయే పనులు/ ఏర్పాట్లు చేయాలన్నదానిపై స్పష్టత ఇచ్చారు.

పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు!
ఎలమంచిలి జూనియర్‌ కళాశాల పరీక్షా కేంద్రంలో మరుగుదొడ్లను పరిశీలిస్తున్న డీవీఈఓ సుజాత తదితరులు

ఎన్నికల నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు

పలు శాఖల అధికారులతో కలెక్టర్‌ ఇప్పటికే సమీక్ష

పరీక్షా కేంద్రాల్లో సదుపాయాల పరిశీలన

విద్యుత్‌, ఫర్నిచర్‌, తాగునీరు, మరుగుదొడ్లకు ప్రాధాన్యం

38 కేంద్రాల్లో ఇంటర్‌, 108 కేంద్రాల్లో టెన్త్‌ పరీక్షలు

అనకాపల్లి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి):

ఇటు సాధారణ ఎన్నికలు, అటు పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఈసారి ఇంచుమించుగా ఒకే సమయంలో జరగనుండడంతో విద్యార్థులు ఇబ్బంది పడకుండా సంబంధిత శాఖల అధికారులు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి.. జిల్లా విద్యా శాఖాధికారులు, పోలీసు, విద్యుత్‌, ఆర్టీసీ, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి, ఏ శాఖ.. ఏయే పనులు/ ఏర్పాట్లు చేయాలన్నదానిపై స్పష్టత ఇచ్చారు. జిల్లా ఇంటర్మీయట్‌ అధికారి(డీవీఈఓ) సుజాత, జిల్లా విద్యా శాఖాఽధికారి (డీఈవో) ఎంవీ లక్ష్మమ్మ ఆయా పరీక్షా కేంద్రాలను తనిఖీ చేస్తూ, విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది పడకుండా పరీక్షలు రాసేందుకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ప్రధానంగా విద్యుత్‌ సరఫరా, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు, మరుగుదొడ్లు వంటివాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఈ పనుల బాధ్యతలను ఆయా కేంద్రాల ప్రిన్స్‌పాళ్లు/ ప్రధానోపాధ్యాయులకు అప్పగించారు. అన్ని కేంద్రాల్లో విద్యార్థులకు సరిపడ బెంచీలు వున్నాయా? లేదా? పరిశీలిస్తున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సరిపడ ఫర్నిచర్‌ లేకపోతే, సమీపంలోని ఇతర పాఠశాలలు/ కళాశాలల నుంచి సమకూర్చుకోవాలని స్పష్టం చేశారు. ఏ ఒక్క విద్యార్థి కూడా గచ్చుపై కూర్చుని పరీక్ష రాయాల్సిన పరిస్థితి వుండకూడదని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఈ నెల 21వ తేదీ నుంచి హాల్‌టికెట్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోచ్చని డీఐఓ సుజాత చెప్పారు.

38 కేంద్రాల్లో ఇంటర్‌ పరీక్షలు

జిల్లాలో ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు 38 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మార్చి ఒకటో తేదీ నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. నిర్ణీత తేదీల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వస్తారు. ప్రశ్నా పత్రాలను పరీక్ష కేంద్రాలకు సమీపంలో వున్న 14 పోలీసు స్టేషన్‌లలోని స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరుస్తారు. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 13,323 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 15,298 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.

పది పరీక్షలకు 108 కేంద్రాలు....

మార్చి 18వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరిగే పదో తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాలో 108 కేంద్రాలను అధికారులు ఎంపిక చేశారు. 21,259 మంది రెగ్యులర్‌, 2,324 మంది ప్రైవేటు విద్యార్థులు కలిపి మొత్తం 23,583 మంది పరీక్షలకు హాజరుకానున్నారు.

Updated Date - Feb 17 , 2024 | 01:08 AM