Share News

చట్టసభల్లో సత్తా చాటిన మహిళలు

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:54 AM

విశాఖ జిల్లా నుంచి ఎందరో మహిళలు చట్టసభలకు ఎన్నికయ్యారు.

చట్టసభల్లో సత్తా చాటిన మహిళలు

  • ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పలువురు ఎన్నిక

  • విద్యావంతులే అధికం

భీమునిపట్నం (రూరల్‌):

విశాఖ జిల్లా నుంచి ఎందరో మహిళలు చట్టసభలకు ఎన్నికయ్యారు. వీరిలో అత్యధికులకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా ప్రజా ప్రతినిధులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే చాలామందికి రెండోసారి పోటీ చేయడానికి అవకాశం లభించలేదు. వచ్చిన కొద్దిమందిలో అత్యధికులు ఓటమి పాలయ్యారు.

పార్లమెంటు సభ్యులు

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో విశాఖ పార్లమెంటు స్థానం నుంచి మొట్టమొదటిసారిగా 1989లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థినిగా విజయనగర సంస్థానాధీశుడు ఆనందగజపతిరాజు మొదటి భార్య ఉమాగజపతిరాజు పోటీ చేసి గెలుపొందారు. ఆమెకు మరోసారి పోటీ చేయడానికి అవకాశం లభించలేదు. ఆ తర్వాత మరో పది సంవత్సరాల తర్వాత దగ్గుబాటి పురందేశ్వరి 2009లో విశాఖ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆమె కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఉమాగజపతి, పురందేశ్వరిలు మంచి పార్లమెంటేరియన్లుగా పేరు సంపాదించుకున్నారు. 2014 ఎన్నికల్లో అరకులోయ పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థినిగా పోటీ చేసిన కొత్తపల్లి గీత విజయం సాధించారు. ఇక 2019లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి డాక్టర్‌ భీశెట్టి సత్యవతి ( వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ), అరకులోయ నుంచి జి.మాధవి ( వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ) ఎంపీలుగా ఎన్నికయ్యారు.

అసెంబ్లీ స్థానాల నుంచి...

అసెంబ్లీ ఎన్నికలకు వస్తే 1972లో మాడుగుల నియోజకవర్గం నుంచి బొడ్డు కళావతి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆమెకు విజయనగరం జిల్లాలో పోటీ చేసేందుకు అవకాశం వచ్చిన ఓటమి పాలయ్యారు. మాడుగుల నియోజకవర్గం నుంచి 1983లో అల్లు భానుమతికి తెలుగుదేశం పార్టీ టికెట్‌ ఇచ్చింది. అయితే ఆమె నామినేషను తిరస్కరణకు గురికావడంతో డమ్మీగా వేసిన రెడ్డి సత్యనారాయణ అభ్యర్థి అయ్యా రు. 1983లోనే విశాఖ-1 నుంచి గ్రంధి మాధవి తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికయ్యారు. తదనంతర పరిణామాల్లో ఆమె నాదెండ్లకు మద్దతుగా నిలిచారు. 1985లో అసెంబ్లీ రద్దయిపోయింది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో అల్లు భానుమతికి అవకాశం లభించి శాసన సభకు ఎన్నికయ్యారు. 1985లోనే విశాఖ-2 నియోజకవర్గం నుంచి రాజాన రమణి ప్రాతినిధ్యం వహించారు. 1989లో విశాఖపట్నం నుంచి ఈటి విజయలక్ష్మికి శాసనసభ్యురాలిగా అవకాశం లభించింది. ఆ తర్వాత 1994లో ఆమెను పరవాడ నియోజక వర్గానికి మార్చడంతో ఓటమి పాలయ్యారు. ప్రొఫెసర్‌గా ఉన్న పిన్నింటి వరలక్ష్మి 1989 ఎన్నికల్లో విశాఖ-2 నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిగా పోటీ చేసి, గెలుపొంది శాసనసభలో అడుగు పెట్టారు. మహిళల ప్రాతినిధ్యం సిటీలో ఎక్కువగా ఉండగా రూరల్‌ జిల్లాలో అంతగా కనిపించలేదు. 2009లో బోళెం ముత్యాలపాప నర్పీపట్నంలో అయ్యన్నపాత్రుడిని ఓడించి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత చాలా ఏళ్లు ఎవరికీ అవకాశం లభించలేదు. 2014 ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి వంగలపూడి అనిత, పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి శాసనసభకు ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో పాడేరు నుంచి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఎన్నికయ్యారు. వచ్చే నెలలో జరుగుతున్న ఎన్నికల్లో విశాఖ లోక్‌సభ స్థానానికి బొత్స ఝాన్సీ (వైసీపీ), అరకులోయ స్థానానికి కొత్తపల్లి గీత (బీజేపీ), చెట్టి తనూజరాణి (వైసీపీ), పాయకరావుపేట నుంచి వంగలపూడి అనిత (టీడీపీ), పాడేరు అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి గిడ్డి ఈశ్వరి (టీడీపీ), మాడుగుల నుంచి ఈర్లె అనురాధ (వైసీపీ) పోటీలో దిగుతున్నారు. వీరిలో విజేతలుగా ఎవరు నిలుస్తారో చూడాలి.

Updated Date - Apr 25 , 2024 | 01:54 AM