కుమ్మేసిన వాన
ABN , Publish Date - Jun 27 , 2024 | 12:47 AM
జిల్లాలో పలు చోట్ల బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ ఠారెత్తించింది. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతా వరణం మారిపోయి భారీ వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

- ఉదయం నుంచి ఎండ, ఆ తరువాత భారీ వర్షం
అనకాపల్లి, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు చోట్ల బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ ఠారెత్తించింది. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతా వరణం మారిపోయి భారీ వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
అనకాపల్లిలో బుధవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి పరమేశ్వరిపార్కు జంక్షన్, దిబ్బవీధి, దేముడుగుమ్మం నుంచి కూరగాయల మార్కెట్‌కు వెళ్లే రహదారులు నీట మునిగాయి. విజయరామరాజుపేట అండర్‌బ్రిడ్జి కింద వర్షపు నీరు నిలిచిపోవడంతో ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రావికమతం మండలంలో ఉదయం నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉండగా, మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. మాడుగులలోనూ ఇదే పరిస్థితి ఉంది. మాకవరపాలెంలో మధ్యాహ్నం సుమారు గంట సేపు వర్షం పడింది. పాయకరావుపేటలో ఓ మోస్తరు వర్షం పడింది. రాంబిల్లి మండలంలో సాయంత్రం గంటసేపు వర్షం కురిసింది. ఎలమంచిలిలో సాయంత్రం సుమారు 40 నిమిషాల పాటు కురిసిన భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. మిలట్రీ కాలనీ, కొత్తపేట ప్రధాన రోడ్డు, ఎల్‌ఐసి కార్యాలయం రోడ్డు, ఎంపీడీవో కార్యాలయం రోడ్డు నీట మునిగాయి. దీంతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు.