Share News

కుమ్మేసిన వాన

ABN , Publish Date - Jun 06 , 2024 | 01:26 AM

జిల్లాలో పలు చోట్ల బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా, ఆ తరువాత నుంచి వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.

కుమ్మేసిన వాన
బుచ్చెయ్యపేట మండలంలోని బీఎన్‌ రోడ్డులో గల గొయ్యిలో నిలిచిన వర్షపు నీరు

- జిల్లాలో పలు చోట్ల మధ్యాహ్నం వరకు ఎండ.. ఆ తరువాత భారీ వర్షం

- చోడవరంలో విరిగిపడిన చెట్లు

- విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

- రావికమతంలో పిడుగుపడి ఓ ఇల్లు పాక్షికంగా ధ్వంసం

చోడవరం, జూన్‌ 5: జిల్లాలో పలు చోట్ల బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా, ఆ తరువాత నుంచి వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.

చోడవరం మండలంలో బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఒంటి గంట నుంచి రెండున్నర గంటల వరకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో సుమారు గంటన్నర పాటు కురిసిన భారీ వర్షానికి మండలంలోని గోవాడ, అంభేరుపురం తదితర ప్రాంతాల్లో ప్రధాన రహదారి జలమయమైంది. భారీ వర్షం కారణంగా పట్టణంలోని అన్నవరం వెంకయ్యగారిపేట, కో-ఆపరేటివ్‌ కాలనీ తదితర ప్రాంతాల్లో చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోగా, పలు చోట్ల చె ట్ల కొమ్మలు విరిగి కరెంటు తీగలపై పడ్డాయి. దీంతో పట్టణంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. బుధవారం సాయంత్రం వరకు విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ కాలేదు.

అనకాపల్లిలో..

అనకాపల్లి టౌన్‌: అనకాపల్లి పట్టణంలో బుధవారం వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు 35 డిగ్రీల ఉష్ణోగ్రతతో జనం అల్లాడిపోయారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో చల్లటి గాలులతో వర్షపు చినుకులు ప్రారంభమయ్యాయి. సాయంత్రం ఐదు గంటలు దాటినా చినుకులు పడుతూనే ఉన్నాయి. భారీ వర్షం కురవకపోయినా చినుకులు పడుతుండడంతో ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. సాయంత్రం వరకు 9.0 ఎంఎం వర్షపాతం నమోదైనట్టు స్థానిక వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు.

పిడుగు పడి పాక్షికంగా ఇల్లు ధ్వంసం

రావికమతం: పిడుగు పడి ఓ ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్న సంఘటన మండలంలోని గుమ్మాళ్లపాడులో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కలగా రామచంద్రరావు ఇంటిపై పిడుగు పడి ముందు భాగం శ్లాబ్‌, సన్‌ షేడ్‌ ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. కాగా రావికమతంలో మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా, ఆ తరువాత ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.

Updated Date - Jun 06 , 2024 | 01:26 AM