తహసీల్దార్లకు పోస్టింగ్‌లు
ABN , Publish Date - Jul 28 , 2024 | 01:09 AM
ప్రభుత్వం మండల తహసీల్దార్లకు పోస్టింగులు ఇచ్చింది.

గత ప్రభుత్వ హయాంలో ఆరోపణలు ఉన్నవారికి ప్రధాన మండలాల్లో అవకాశం
ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా పైరవీలు
విస్మయం కలిగిస్తున్న కూటమి నేతల మౌనం
(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం)
ప్రభుత్వం మండల తహసీల్దార్లకు పోస్టింగులు ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే చక్రం తిప్పారో, ఆ పార్టీ నేతలకు అనుకూలంగా పనిచేశారో వారికే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోను ప్రాధాన్యం లభించింది. జిల్లాలో ప్రధాన మండలాలకు వారినే తహసీల్దార్లుగా నియమించారు. కూటమి ఎమ్మెల్యేలూ వారినే కోరుకోవడమేమిటో అర్థం కావడం లేదు. గతంలో భూ అక్రమాలకు సహకరించిన వారిని ఏరికోరి తెచ్చుకోవడం విస్మయపరుస్తోంది.
సాధారణ ఎన్నికల ముందు తహసీల్దార్లను పక్క జిల్లాల్లో విధులకు పంపించారు. ఆ ప్రక్రియ అంతా పూర్తి కావడంతో సొంత జిల్లాలకు వారిని వెనక్కి పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే గతంలో ఎక్కడ పనిచేసిన వారికి అక్కడ కాకుండా వేరేచోట నియమించాలని సీసీఎల్‌ఏ ఆదేశించింది. పోస్టింగ్‌లు ఇచ్చే బాధ్యత జిల్లా కలెక్టర్‌కు ఇచ్చినా..అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు చెప్పినట్టుగా చేయాలని పైనుంచి ఆదేశాలు వచ్చాయి. చాలామంది ఎమ్మెల్యేలు తమకు ఎవరు కావాలో కోరుకున్నారు. అయితే వారిని కూటమి ఎమ్మెల్యేలు నిజంగా కోరుకున్నారా?...లేదంటే ఆ తహసీల్దార్లే కీలక మండలాలు ఎంచుకొని ఆ ఎమ్మెల్యేలను సంతృప్తి పరిచి వచ్చారా?...అనేది తెలియడం లేదు. జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు తహసీల్దార్ల పోస్టింగ్‌ల విషయంలో ఎటువంటి సిఫారసులు చేయలేదు. అటువంటిచోట పైరవీలు చేసి కొందరు ఆర్డర్లు తెచ్చుకున్నారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల విషయంలో ఆ పార్టీ పెద్దలు చెప్పినట్టు చేసి, వారితో పాటు తహసీల్దార్లు కూడా ఆర్థికంగా బలపడ్డారు. ఆ దాహం తీరక మళ్లీ కీలక మండలాల్లోకి రావడంతో భూములకు మూడినట్టేనని ప్రచారం జరుగుతోంది.
21 మందికి పోస్టింగ్‌లు
విశాఖ జిల్లాలో 21 మంది తహసీల్దార్లకు పోస్టింగ్‌లు ఇచ్చారు. ఆరోగ్య శాఖలో పనిచేస్తూ పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న ఎం.రమేశ్‌ను సీతమ్మధార తహసీల్దార్‌గా వేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఎం.పాల్‌కిరణ్‌ను విశాఖపట్నం రూరల్ తహసీల్దార్‌గా, కేవీ ఈశ్వరరావును కూడా కలెక్టరేట్ సూపరింటెండెంట్ (పరిపాలన)గా, పి.రామారావును భీమిలి తహసీల్దార్‌గా, ఎల్.రామారావును పెదగంట్యాడకు, కె.వేణుగోపాల్‌ను పెందుర్తి తహసీల్దార్‌గా నియమించారు. పార్వతీపురంలో ఉన్న కె.ఆనందరావును వీఎంఆర్‌డీఏ భూసేకరణ విభాగంలో స్పెషల్ తహసీల్దార్‌గా, అడబాల శ్రీనివాసరావును విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో సూపరింటెండెంట్‌గా, వి.సుజాతను కలెక్టరేట్‌లో ల్యాండ్స్ సూపరింటెండెంట్‌గా, ఎం.ఆనంద్‌కుమార్‌ను పద్మనాభం, కె.జయను మహారాణిపేటకు బదిలీ చేశారు. విజయనగరంలోని సీహెచ్‌వీ రమేశ్‌కు గోపాలపట్నం, పి.శ్యామ్‌ప్రసాద్‌ను ఆనందపురం తహసీల్దార్‌గా, కె.రమాదేవిని విశాఖ ఆర్‌డీఓ కార్యాలయంలో డివిజనల్ పరిపాలనా అధికారిగా వేశారు. శ్రీకాకుళం జిల్లాలోని ఎంఏ మనోరంజనిని భీమిలి ఆర్‌డీఓ కార్యాలయం ఏఓగా నియమించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి జె.తారకేశ్వరిని ములగాడకు వేశారు. శ్రీకాకుళం జిల్లాలోని బీటీవీ రామారావును విశాఖ రెవెన్యూ డివిజన్‌లో భూసేకరణ విభాగం స్పెషల్ తహసీల్దార్‌గా, ఎంవీకేఎస్ రవిని జీవీఎంసీ ఎస్టేట్ అధికారిగా, వి.శ్యామ్‌కుమార్‌ను కలెక్టరేట్‌లో కో-ఆర్డినేషన్ సూపరింటెండెంట్‌గా వేశారు. గాజువాకలో పనిచేస్తున్న టి.శ్రీవల్లిని అదే స్థానంలో కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. విశాఖలోని భూ సంస్కరణల విభాగంలో పనిచేస్తున్న కె.గణపతిరావును అదే స్థానంలో ఉంచారు.
ఆ ముగ్గురూ....
ఇప్పుడు జరిగిన బదిలీల్లో పి.శ్యామ్‌ప్రసాద్, కె.వేణుగోపాలరావు, ఎం.ఆనంద్‌కుమార్‌లకు కీలక మండలాలు కేటాయించడంపై విమర్శలు వస్తున్నాయి. శ్యామ్‌ప్రసాద్ గతంలో ఆనందపురంలో తహసీల్దార్‌గా పనిచేశారు. అక్కడి నుంచి పెందుర్తి వెళ్లారు. ఎన్నికల ముందు భోగాపురం పంపించారు. ఈయన ఎక్కడ పనిచేసినా వివాదాలు, ఆరోపణలే అధికం. భోగాపురం విమానాశ్రయం సమీపాన ఏపీఐఐసీకి చెందిన 70 ఎకరాల భూమిని వైసీపీ నేతలకు కట్టబెట్టడంలో కీలకపాత్ర పోషించారని ఆరోపణలు వచ్చాయి. పెందుర్తిలో పనిచేసినప్పుడు ప్రభుత్వ భూమిని జిరాయితీగా మార్చి, అందులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేఅవుట్ వేసుకోవడానికి సహకరించారనే విమర్శలు ఉన్నాయి. పెందుర్తిలో వైసీపీ ఎమ్మెల్యేకి సహకరించారనే ఆరోపణలు వచ్చాయి. అటువంటి అధికారిని తీసుకువచ్చి ప్రభుత్వ భూములు అధికంగా ఉన్న ఆనందపురం తహసీల్దార్‌గా వేయడం ఆశ్చర్యపరిచింది. ఇక కె.వేణుగోపాలరావు...ఆయన భీమిలి నియోజకవర్గంలోని భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల్లో తహసీల్దారుగా పనిచేశారు. ఇప్పుడు ఆయన్ను పెందుర్తిలో వేశారు. ఎప్పుడూ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనువుగా ఉన్న మండలాల్లోనే ఆయన పోస్టింగ్‌లు వేయించుకోవడం వెనుక ప్రజా ప్రతినిధుల సహకారం ఉందనేది బహిరంగ రహస్యం. ఈయనపైనా అనేక ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. కీలక మండలాల్లో పనిచేసిన అధికారికి నాన్ ఫోకల్‌గా ఏ కలెక్టరేట్‌లోనే వేసుంటే బాగుండేదని, పెందుర్తి వంటి ప్రాంతానికి వేయడం సరైన నిర్ణయం కాదని వాదన వినిపిస్తోంది. మూడో అధికారి ఎం.ఆనందరావు. ఈయన కలెక్టరేట్‌లో పరిపాలన అధికారిగా చేశారు. అక్కడి నుంచి పెందుర్తికి వేశారు. అక్కడ తీవ్రమైన ఆరోపణలు రావడంతో సీతమ్మధారకు తీసుకువచ్చారు. ఎన్నికల సమయంలో పక్క జిల్లాకు పంపించి ఇప్పుడు ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్న పద్మనాభం తహసీల్దార్‌గా నియమించారు.