Share News

పోస్టల్‌ ఓట్లలో కూటమి హవా

ABN , Publish Date - Jun 07 , 2024 | 12:26 AM

అనకాపల్లి పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకే పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఎక్కువగా వచ్చాయి. గత ఎన్నికల్లో వైసీపీకి ఓటేసిన ఉద్యోగులు ఈసారి కూటమికి జైకొట్టారు. కొన్నిచోట్ల వైసీపీ అభ్యర్థులు సామాజిక సమీకరణలు, ఉద్యోగులను ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకున్నా, మెజారిటీ ఓటర్లు కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలిచారు.

పోస్టల్‌ ఓట్లలో కూటమి హవా
పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పరిశీలిస్తున్న కౌంటింగ్‌ సిబ్బంది (ఫైల్‌)

అభ్యర్థులకు మద్దతుగా నిలిచిన ఉద్యోగులు

బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌కు 62.96 శాతం ఓట్లు

వైసీపీ తరువాత మూడో స్థానం నోటాదే

జిల్లాలో పలువురికి దక్కని డిపాజిట్లు

స్వతంత్రుల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

అనకాపల్లి పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకే పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఎక్కువగా వచ్చాయి. గత ఎన్నికల్లో వైసీపీకి ఓటేసిన ఉద్యోగులు ఈసారి కూటమికి జైకొట్టారు. కొన్నిచోట్ల వైసీపీ అభ్యర్థులు సామాజిక సమీకరణలు, ఉద్యోగులను ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకున్నా, మెజారిటీ ఓటర్లు కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలిచారు.

ఎన్నికల విధులకు హాజరైన ఉద్యోగులు, పోలీసు, రవాణా, విద్యుత్‌, వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకొనే అవకాశాన్ని ఈసారి ఎన్నికల కమిషన్‌ ఇచ్చింది. గతంలో ముందుగా ఎన్నికల అధికారికి దరఖాస్తు చేసుకొని బ్యాలెట్‌ పత్రాన్ని పొంది తమకు నచ్చిన వారికి ఓటు వేసి కవర్‌ను ఆర్వో కార్యాలయంలో అందజేసేవారు. ఈ క్రమంలో పోటీలో వున్న అభ్యరులు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను కొనుగోలు చేసి పార్టీ తరఫున వారు తీసుకెళ్లి ఆర్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాక్సులో వేసేవారు. ఈ పద్ధతి అధికార పార్టీకి అనుకూలంగా ఉండేది. దీనికి భిన్నంగా ఈసారి ఎన్నికల సంఘం నిబంధనలు మార్చి అమలు చేసిన సంగతి తెలిసిందే. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ప్రత్యేకంగా మూడు రోజుల పాటు నియోజకవర్గ కేంద్రాల్లో ఆర్‌వోల సమక్షంలో పోలింగ్‌ నిర్వహించారు. ఆ పరిధిలోని వారే కాకుండా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఓటు ఉన్నా, అక్కడ పనిచేస్తూ ఎన్నికల విధుల్లో వున్నవారు అక్కడ పోస్టల్‌ బ్యాలెట్‌లో పాల్గొనేలా వెసులుబాటు కల్పించారు. దీంతో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు భారీగా పోలయ్యాయి.

అనకాపల్లి పార్లమెంట్‌ పరిధిలో ఎవరికి ఎన్ని?..

పార్లమెంట్‌ పరిధిలో అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, ఎలమంచిలి, పాయకరావుపేట, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ పార్లమెంట్‌ స్థానానికి 15 మంది అభ్యర్థులు బరిలో ఉండగా మొత్తం 19,125 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోలయ్యాయి. ఇందులో 292 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో 18,833 అర్హత గల ఓట్లను లెక్కించారు. పోస్టల్‌ బ్యాలెట్‌లలోనూ దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి సీఎం రమేశ్‌కు అత్యధికంగా 12,042 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాలు నాయుడుకు 5,777 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి వేగి వెంకటేశ్‌కు 818 ఓట్లు దక్కాయి. ఇతర అభ్యర్థులు పలకా శ్రీరామూర్తికు 75, నమ్మి అప్పలరాజుకు 30, ఆడారి శరత్‌చంద్రకు 27, వడ్లమూరి కృష్ణస్వరూప్‌కు 8, కర్రి విజయలక్ష్మికి 13, తుమ్మగుంట అప్పలనాయుడుకు 7, గార సూర్యారావుకు 8, జున్నుమూరి శ్రీనివాస్‌ 6, తుమ్మపాల హరిశంకర్‌కు 9, పెట్ల నాగేశ్వరరావుకు 5, సిద్దా లోవరాజుకు 7, వంకాయల రామచంద్రరావుకు ఒకేఒక్క పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వచ్చింది.

అసెంబ్లీల పరిధిలో...

- అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం చెల్లిన పోస్టల్‌ ఓట్లు 2,764 కాగా, ఇందులో జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణకు 1,941, వైసీపీ అభ్యర్థి మలసాల భరత్‌కుమార్‌కు 710, కాంగ్రెస్‌ అభ్యర్థి ఐఆర్‌ గంగాధర్‌కు 54 ఓట్లు వచ్చాయి.

- నర్సీపట్నం నియోజకవర్గంలో మొత్తం 3,015 ఓట్లు పోలవగా, టీడీపీ అభ్యర్థి అయ్యన్నపాత్రుడుకి 1,888 ఓట్లు, వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌కు 1,072, కాంగ్రెస్‌ అభ్యర్థి రుత్తల శ్రీరామ్మూర్తికి 20 ఓట్లు వచ్చాయి.

- పాయకరావుపేటలో మొత్తం పోలైన పోస్టల్‌ ఓట్లు 2,140 కాగా టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనితకు 1,367, వైసీపీ అభ్యర్థి కంబాల జోగులకు 701, కాంగ్రెస్‌ అభ్యర్థి బోని తాతారావుకు 28 ఓట్లు మాత్రమే వచ్చాయి.

- ఎలమంచిలిలో మొత్తం 2,116 ఓట్లు చెల్లగా, వాటిలో జనసేన అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌కు 1,363, వైసీపీ అభ్యర్థి రమణమూర్తిరాజుకు 674, కాంగ్రెస్‌ అభ్యర్థి అనంతరామనరసింహరావుకు 43 ఓట్లు వచ్చాయి.

- చోడవరంలో మొత్తం 2,612 ఓట్లు పోలవగా, టీడీపీ అభ్యర్థి కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజుకు 1,780, వైసీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీకి 756, కాంగ్రెస్‌ జగతా శ్రీనివాసరావుకు 31 ఓట్లు మాత్రమే వచ్చాయి.

- మాడుగులలో మొత్తం ఓట్లు 2,659 బ్యాలెట్‌ ఓట్లు పోలవగా, అందులో టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తికి 1,777, వైసీపీ ఈర్లె అనురాధకు 825, కాంగ్రెస్‌ అభ్యర్థి బొడ్డు శ్రీనివాసకు 24 ఓట్లు వచ్చాయి.

నోటా కంటే తక్కువ ఓట్లు

జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల్లో పోటీ చేసిన కూటమి, వైసీపీ అభ్యర్థులు మినహా మిగిలిన అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి. జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు వుంటే నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, పాయకరావుపేటల్లో కూటమి టీడీపీ అభ్యర్థులు, అనకాపల్లి, ఎలమంచిలి స్థానాల్లో కూటమి జనసేన అభ్యర్థులు విజయం సొంతం చేసుకున్నారు. ఆరు స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు. ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీలో వున్న 54 మంది కూటమి, వైసీపీ అభ్యర్థుల్లో 12 మంది మినహా మిగిలిన 42 మందికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.

పలువురు అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు

జిల్లాలో పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాల పరిఽధిలో పోటీ చేసిన అభ్యర్థుల్లో పలువురు డిపాజిట్‌లు కోల్పోయారు. ఓట్ల వివరాలను పరిశీలిస్తే 42 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు, అనకాపల్లి పార్లమెంట్‌ నుంచి పోటీ చేసిన 15 మందిలో బీజేపీ, వైసీపీ అభ్యర్థులకు తప్ప మిగిలిన 13 మందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి. డిపాజిట్లు కోల్పోయిన ఎంపీ అభ్యర్థుల్లో పాలక శ్రీరామ్మూర్తి, వేగి వెంటేశ్‌, నమ్మి అప్పలరాజు, ఆడారి శరత్‌చంద్ర, వడ్డమూర్తి కృష్ణస్వరూప్‌, కర్రి విజయలక్ష్మి, తుమ్మగుంట అప్పలనాయుడు, గార సూర్యారావు, జన్నూరి శ్రీనివాస్‌, డాక్టర్‌ తుమ్మపాల హరిశంకర్‌, పెట్ల నాగేశ్వరరావు, సిద్ధా లోవరాజు, వంకాయల రామచంద్రరావులు ఉన్నారు.

మూడో స్థానంలో నోటా

అనకాపల్లి లోక్‌సభ, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నోటాకు వచ్చిన ఓట్లు మూడో స్థానంలో ఉండడం చర్చనీయాంశంగా మారింది. అనకాపల్లి లోక్‌సభ బరిలో వున్న బీజేపీ అభ్యర్థి సీఎం రమేశ్‌కు 58.66 శాతం, వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడుకు 35.84 శాతం ఓట్లు వచ్చాయి. మిగిలిన 13 మంది అభ్యర్థులకంటే ఎక్కువ ఓట్లు 1.98 శాతం నోటాకు నమోదయ్యాయి. టీడీపీ మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తికి 55.6 శాతం, ఈర్లె అనురాధకు 38.64 శాతం ఓట్లు వచ్చాయి. నోటాకు 2.46 శాతం ఓట్లు రాగా, దాని కంటే మిగిలిన ఏడుగురు అభ్యర్థులకు తక్కువ ఓట్లు వచ్చాయి. అనకాపల్లిలో పోటీ చేసిన 12 మందిలో జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణకు 66.53 శాతం, వైసీపీ అభ్యర్థి మలసాల భరత్‌కుమార్‌కు 28.57 శాతం ఓట్లు పోలయ్యాయి. నోటాకు 1.07 శాతం ఓట్లు రాగా, దాని కంటే మిగిలిన పది మందికి తక్కువ ఓట్లు పోలయ్యాయి. ఎలమంచిలి నియోజకవర్గంలో పోటీ చేసిన 10 మందిలో జనసేన అభ్యర్థి సుందరపు విజయకుమార్‌కు 61 శాతం, వైసీపీ అభ్యర్థి యూవీ రమణమూర్తి రాజుకు 31.71 శాతం ఓట్లు వచ్చాయి. నోటాకు 1.34 శాతం రాగా, దాని కంటే మిగిలిన 8 మందికి తక్కువ ఓట్లు పోలయ్యాయి. నర్సీపట్నం నియోజకవర్గంలో 8 మంది పోటీ చేస్తే వారిలో టీడీపీ అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడుకు 54.6 శాతం, వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌కు 41.11 శాతం ఓట్లు వచ్చాయి. నోటాకు 2.09 శాతం రాగా, మిగిలిన ఆరుగురికి దాని కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. పాయకరావుపేట నియోజకవర్గంలో 9 మంది అభ్యర్థుల్లో టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనితకు 57.86 శాతం, వైసీపీ అభ్యర్థి కంబాల జోగులుకు 36.78 శాతం ఓట్లు వచ్చాయి. నోటాకు 1.98 శాతం ఓట్లు రాగా, మిగిలిన ఏడుగురు అభ్యర్థులకు దాని కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. చోడవరం అసెంబ్లీ పరిధిలో పోటీ చేసిన ఆరుగురు అభ్యర్థుల్లో టీడీపీ అభ్యర్థి కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజుకు 59.03 శాతం, వైసీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీకి 36.32 శాతం ఓట్లు పోలయ్యాయి. నోటాకు 2.07 శాతం ఓట్లు రాగా, దాని కంటే మిగిలిన నలుగురు అభ్యర్థులకు తక్కువ ఓట్లు వచ్చాయి.

Updated Date - Jun 07 , 2024 | 12:26 AM