ఉక్కుకు సానుకూల పరిణామాలు
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:23 AM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్రం నుంచి సానుకూల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని ఎంపీ ఎం.శ్రీభరత్ అన్నారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఈ నాలుగు నెలల్లో కేంద్రం నుంచి రూ.1,700 కోట్లు విడుదల
జడ్పీ సమావేశంలో ఎంపీ ఎం.శ్రీభరత్
వ్యవసాయానికి ఉపాధి హామీ పథకం అనుసంధానం అంశం లోక్‌సభలో ప్రస్తావిస్తానన్న ఎంపీ
మార్కెట్ కమిటీల ఆదాయాన్ని రైతుల అవసరాలకు వెచ్చించాలని కోరిన ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు
విశాఖపట్నం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్రం నుంచి సానుకూల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని ఎంపీ ఎం.శ్రీభరత్ అన్నారు. గురువారం జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో పలువురు సభ్యులు మాట్లాడుతూ ఉక్కు కర్మాగారాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అందుకు ఎంపీ స్పందిస్తూ...స్టీల్ ప్లాంటుకు ఈ నాలుగు నెలల కాలంలో కేంద్రం రెండు విడతలుగా రూ.1,700 కోట్లు విడుదల చేసిందన్నారు. నిధుల విడుదలను బట్టి కూటమి ప్రభుత్వ దృక్పథం ఏమిటో అర్థమవుతుందన్నారు. ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా స్పందిస్తామన్నారు.
వ్యవసాయం భారంగా మారిందని, ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసే విషయం లోక్‌సభలో మాట్లాడాలని విశాఖ ఎంపీ శ్రీభరత్, అరకు ఎంపీ తనూజలకు కొయ్యూరు జడ్పీటీసీ సభ్యుడు నూకరాజు విజ్ఞప్తి చేశారు. చైర్‌పర్సన్ సుభద్ర మాట్లాడుతూ ఏజెన్సీలో కాఫీ, మిరియాలు తోటల పెంపకాన్ని ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయాలన్నారు. వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం గురించి లోక్‌సభలో ప్రస్తావిస్తానని శ్రీభరత్ హామీ ఇచ్చారు. అరకు ఎంపీ తనూజరాణి మాట్లాడుతూ స్థానిక సమస్యలు పార్లమెంటులో ప్రస్తావిస్తానన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో ఆహార నాణ్యత, మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలు పెంచాలన్నారు.
భీమిలి జడ్పీటీసీ సభ్యుడు గాడు వెంకటప్పడు మాట్లాడుతూ ఇటీవల పద్మనాభం మండలం మద్దిలో ప్రైవేటు పాఠశాల బస్సు రెండు పర్యాయాలు ప్రమాదానికి గురైందని చెప్పగా, డీఈవో చంద్రకళ జోక్యం చేసుకుని పాఠశాల యాజమాన్యానికి షోకాజ్ ఇచ్చామన్నారు. ఈ సమయంలో విశాఖ కలెక్టర్ హరేంధిరప్రసాద్ మాట్లాడుతూ ఏటా జూన్, జూలై నెలల్లో విద్యా సంస్థల బస్సులు తనిఖీ ఉంటుందని, అయినా మరోసారి రవాణా శాఖకు ఆదేశాలు ఇస్తామన్నారు.
పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు మాట్లాడుతూ, మార్కెట్ కమిటీల ద్వారా వచ్చే ఆదాయాన్ని రైతుల అవసరాలకు వెచ్చించాలని అన్నారు. సభ్యులు సమావేశాలకు వచ్చే ముందు స్థానిక సమస్యలపై అవగాహన పెంచుకోవాలని, అప్పుడు సమస్యలకు పరిష్కారం దొరుతుందన్నారు. తొలిసారి సమావేశానికి వచ్చిన హోం మంత్రి అనితను చైర్‌పర్సన్ సుభద్ర సత్కరించారు. ఎంపీలు శ్రీభరత్, తనూజరాణిలను సీఈవో నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో రాజ్‌కుమార్ సన్మానించారు. సమావేశానికి ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, అనకాపల్లి, విశాఖ, అల్లూరి జిల్లాల కలెక్టర్లు విజయకృష్ణన్, హరేంధిరప్రసాద్, దినేశ్‌కుమార్, పలు శాఖల అధికారులు హాజరయ్యారు.