Share News

రహదారి పనుల్లో నాణ్యతాలోపం

ABN , Publish Date - Mar 26 , 2024 | 01:18 AM

నగరంలో రహదారి విస్తరణ పనులను కాంట్రాక్టర్లు ఇష్టానుసారం చేస్తున్నారు.

రహదారి పనుల్లో నాణ్యతాలోపం

వన్‌టౌన్‌లో ఇష్టారాజ్యంగా కాలువల నిర్మాణం

జీవీఎంసీ ఇంజనీరింగ్‌ అధికారుల పర్యవేక్షణ నిల్‌

విశాఖపట్నం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి):

నగరంలో రహదారి విస్తరణ పనులను కాంట్రాక్టర్లు ఇష్టానుసారం చేస్తున్నారు. ఏమాత్రం నాణ్యత ఉండడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వన్‌టౌన్‌లో ఈ తరహా నిర్మాణాలు కనిపిస్తున్నాయి. చాలాకాలం తరువాత జగదాంబ జంక్షన్‌ నుంచి పాత పోస్టాఫీసు వరకు రహదారి విస్తరణ పనులు చేపట్టారు. రహదారిని 60 అడుగులకు విస్తరించడంతో పాటు మధ్యలో మీడియన్‌, అటు ఇటు కాలువల నిర్మాణానికి అంచనాలు తయారుచేశారు. అడ్డం వచ్చిన నిర్మాణాలను అవసరం మేరకు తొలగించారు. కొందరికే టీడీఆర్‌లు ఇచ్చి మిగిలిన వారికి హక్కు పత్రాలు చూపించాలంటూ వేఽధిస్తున్నారు. ఇక్కడ 38, 39 వార్డుల్లో రహదారి విస్తరణ, కాలువల నిర్మాణం పనులు రూ.83 లక్షలతో చేపట్టారు. ముందు కాలువలు నిర్మించి, ఆ తరువాత రహదారిని విస్తరించి, ఆపై ఫుట్‌పాత్‌ పనులు చేపట్టాల్సి ఉంది. దశల వారీగా ఈ పనులు జరుగుతున్నాయి. అయితే కాలువల నిర్మాణంలో ఇనుప చువ్వల (ఐరన్‌ రాడ్స్‌)ను ఉపయోగించడం లేదు. అటు, ఇటు చెక్కలు వేసి, మధ్యలో కాంక్రీట్‌ పోస్తున్నారు. లోతైన కాలువల నిర్మాణం, వాటిపై ఫుట్‌పాత్‌లు కూడా నిర్మించాల్సి ఉన్నందున తప్పనిసరిగా ఐరన్‌ రాడ్స్‌ వాడాలని, కానీ ఇక్కడ అలా చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్లు చేస్తున్న పనులను ఇంజనీరింగ్‌ అధికారులు పర్యవేక్షించడం లేదని విమర్శిస్తున్నారు. ఇలాంటి నాసిరకం పనుల వల్ల కాలువలు గోడలు కూలిపోయి, అందులో మురుగు ఎక్కడికక్కడ నిలిచిపోతుందని, పైన ఫుట్‌పాత్‌ల నిర్మాణం వల్ల ఆ పూడిక తీయడం కూడా కష్టం అవుతుందని చెబుతున్నారు. పేరుకు రహదారిని విస్తరించినా మురుగునీటి పారుదల సమస్య అధికం అవుతుందని, తక్షణమే ఈ లోపాల్ని సవరించాలని, నాణ్యమైన నిర్మాణాలు చేపట్టాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Mar 26 , 2024 | 01:18 AM