Share News

మందకొడిగా ధాన్యం సేకరణ

ABN , Publish Date - Jan 06 , 2024 | 12:43 AM

జిల్లాలో ధాన్యం సేకరణ నత్తనడకన సాగుతోంది. ఖరీఫ్‌లో రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లకు అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసినా.. కార్యరూపంలోకి వచ్చే సరికి ఫలితం లేకుండా పోయింది.

మందకొడిగా ధాన్యం సేకరణ
గొలుగొండ మండలం పాతమల్లంపేటలో వరి పంటను నూర్చి, ధాన్యాన్ని బస్తాల్లోకి నింపిన దృశ్యం

జిల్లాలో 50 వేల టన్నులు సేకరించాలని లక్ష్యం

144 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

ఇప్పటి వరకు 2,120 టన్నుల ధాన్యం మాత్రమే సేకరణ

తుఫాన్‌ కారణంగా ఆలస్యమైందంటున్న అధికారులు

గత అనుభవాలతో ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్న రైతులు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ధాన్యం సేకరణ నత్తనడకన సాగుతోంది. ఖరీఫ్‌లో రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్లకు అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసినా.. కార్యరూపంలోకి వచ్చే సరికి ఫలితం లేకుండా పోయింది. గత నెలలో సంభవించిన తుఫాన్‌ కారణంగా వరి కోతలు, నూర్పులు కొంత ఆలస్యమైనప్పటికీ, రెండు వారాల నుంచి నూర్పిడి పనులు జోరుగా సాగుతున్నాయి. ధాన్యం అమ్మడానికి రైతులు సిద్ధంగా వున్నప్పటికీ అధికారులు మాత్రం కొనుగోళ్ల ప్రక్రియను మొదలుపెట్టలేదు. రైతుల నుంచి ధాన్యం నమూనాలను సేకరించడంలేదు. దీంతో కల్లాల్లోనే ధాన్యం వుంచుకుని రోజూ కాపాలా కాయాల్సి వస్తున్నదని రైతులు వాపోతున్నారు. కొంతమంది రైతులు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం అమ్ముకుంటున్నారు.

గత ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లా రైతులు... ముఖ్యంగా వరి సాగుదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరినాట్లు నాట్లు సమయంలో వర్షాభావ పరిస్థితులు, పంట చేతికి వచ్చే సమయంలో విరుచుకుపడి తుఫాన్‌ కష్ట, నష్టాలను మిగిల్చాయి. గత నెల మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలతో వేలాది ఎకరాల్లో వరి పైరు నీట మునిగింది. అప్పటికే కోత కోసి, కుప్ప వేయని పొలాల్లో వరి పనలు తడిసిపోయి, నీటిలో కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో వరి పంట కుళ్లిపోయి, కంకులు మొలకెత్తాయి. కాగా నీటి సదుపాయం వున్న భూముల్లో వరి పంట ఆశాజనకంగానే పండడంతో 70 వేల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. దీంతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు జిల్లా పౌర సరఫరాల సంస్థ చర్యలు చేపట్టారు. జిల్లాలో 144 ధాన్యం కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు నవంబరులోనే ప్రకటించారు. కానీ డిసెంబరు మొదటి వారంలో తుఫాన్‌ కారణంగా వేలాది ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లడంతో ధాన్యం దిగుబడి 50 వేల టన్నులకు మించి వచ్చే పరిస్థితి లేదని వ్యవసాయ శాఖ అధికారులు భావించారు. దీంతో ధాన్యం సేకరణను పౌర సరఫరాల సంస్థ అధికారులు కొద్ది రోజులపాటు వాయిదా వేశారు. ఇదిలావుండగా తుఫాన్‌ కారణంగా వరి కోతలు, నూర్పిళ్లు ఒకింత ఆలస్యం అయ్యాయి. రెండు వారాల నుంచి నూర్పిడి పనులు ఊపందుకున్నాయి. ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు చెబుతుండగా, ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా ప్రారంభిస్తున్నారు. కానీ రైతుల నుంచి ధాన్యం సేకరణ అంతంతమాత్రంగానే జరుగుతున్నది. జిల్లాలో శుక్రవారం వరకు 2,120 టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. డబ్బు చెల్లింపుల్లో గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కొంతమంది రైతులు ప్రభుత్వానికి కాకుండా ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం విక్రయిస్తున్నారు. ఇదిలావుండగా ఈ-కేవైసీ నమోదు చేయించుకుంటేనే ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం నిబంధన విధించడంతో ఆర్‌బీకేల్లో ఈ-కేవైసీ చేయించుకోలేని రైతులు కూడా ప్రైవేటుగానే ధాన్యం అమ్ముకుంటున్నారు.

ధాన్యం సేకరణ వేగవంతం

- పి.జయంతి, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌

జిల్లాలో ధాన్యం సేకరణను వేగవంతం చేస్తాం. రైతులు ఎంత ధాన్యం తెచ్చినా కొనుగోలు చేస్తాం. తుఫాన్‌కు ముందు 70 వేల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశాం. కానీ తుఫాన్‌ వల్ల పలుచోట్ల పంట దెబ్బతిన్నది. దీంతో సేకరణ లక్ష్యం కొంత తగ్గవచ్చు. ధాన్యం విక్రయించిన రైతులకు నిర్ణీత సమయంలో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించుకోవాలి.

Updated Date - Jan 06 , 2024 | 12:43 AM