Share News

నర్సీపట్నంలో వారసత్వ రాజకీయాలు

ABN , Publish Date - Apr 29 , 2024 | 01:36 AM

ఏడు దశాబ్దాలుగా నర్సీపట్నం నియోజకవర్గంలో వారసత్వ రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి.

నర్సీపట్నంలో వారసత్వ రాజకీయాలు

ఏడు దశాబ్దాలుగా ఆ నాలుగు కుటుంబాలదే ఆధిపత్యం

లచ్చాపాత్రుడు వారసుడిగా అయ్యన్నపాత్రుడు

కిల్లాడ రామ్మూర్తినాయుడు వారసుడిగా వేచలపు శ్రీరామ్మూర్తి

బోళెం గోపాత్రుడు వారసురాలిగా ముత్యాలపాప

రాజాసాగి సూర్యనారాయణరాజు తరువాత సాగికృష్ణమూర్తిరాజు...

నర్సీపట్నం, ఏప్రిల్‌ 28:

ఏడు దశాబ్దాలుగా నర్సీపట్నం నియోజకవర్గంలో వారసత్వ రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. రాజాసాగి సూర్యనారాయణరాజు రాజకీయ వారసత్వాన్ని కృష్ణమూర్తిరాజు, రుత్తల లచ్చాపాత్రుడు వారసత్వాన్ని ఆయన మనుమడు అయ్యన్నపాత్రుడు, బోళెం గోపాత్రుడు వారసత్వాన్ని ఆయన మనవరాలు ముత్యాలపాప, కిల్లాడ రామ్మూర్తినాయుడు వారసత్వాన్ని ఆయన మనమడు వేచలపు శ్రీరామమూర్తి అందిపుచ్చుకొని శాసనసభలోకి అడుగుపెట్టారు. అయితే 2019 ఎన్నికల్లో తొలిసారి వారసత్వ రాజకీయాలకు తెరదించుతూ పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌ నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

- నర్సీపట్నం, పాయకరావుపేట ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు 1952 సంవత్సరంలో నర్సీపట్నం నుంచి కిల్లాడ రామ్మూర్తినాయుడు, పాయకరావుపేట నుంచి రాజాసాగి సూర్యనారాయణరాజు పోటీ చేసి ఎమ్మెల్యేలుగా శాసనసభలోకి ఒకేసారి అడుగుపెట్టారు.

- రాజాసాగి సూర్యనారాయణరాజు తర్వాత తంగేడు రాజుల కుటుంబంలో రాజాసాగి కృష్ణమూర్తిరాజు మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 1989లో ఒకసారి విజయం సాధించారు. అదే తంగేడు రాజుల కుటుంబానికి చెందిన రాజాసాగి రామచంద్రరాజు రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు.

- 1952లో ఎమ్మెల్యేగా చేసిన కిల్లాడ రామ్మూర్తినాయుడు మనమడు (కుమార్తె కొడుకు) వేచలపు శ్రీరామ్మూర్తి 1985, 1996లో రెండుసార్లు పోటీ చేసి ఒకసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తాత కిల్లాడ రామ్మూర్తినాయుడు ఎమ్మెల్యేగా చేసినందున తాను కూడా ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలని వేచలపు శ్రీరామ్మూర్తికి బలమైన కోర్కె ఉండేదట. 1996లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు చింతకాయల అయ్యన్నపాత్రుడు అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చింది. ఎమ్మెల్యే స్థానానికి ఆయన రాజీనామా చేసి అనకాపల్లి ఎంపీగా పోటీ చేశారు. అప్పటివరకు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న వేచలపు శ్రీరామ్మూర్తిని టీడీపీలో చేర్చుకొని నర్సీపట్నం ఎమ్మెల్యేగా పోటీ చేయించగా, ఆయన గెలుపొందారు.

ఏకసభ్య నియోజకవర్గంగా నర్సీపట్నం ఆవిర్భవించిన తర్వాత 1962 సంవత్సరంలో తొలిసారి జరిగిన శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా రుత్తల లచ్చాపాత్రుడు...కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన రాజాసాగి సూర్యనారాయణరాజుపై విజయం సాధించారు. ఆయన మనమడు చింతకాయల అయ్యన్నపాత్రుడు 1983లో టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి తంగేడు రాజుల కుటుంబానికి చెందిన రాజా సాగి రామచంద్రరాజుపై విజయం సాధించారు. తర్వాత అయ్యన్నపాత్రుడు ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. పలు మార్లు మంత్రిగా పని చేశారు. తాజాగా జరుగుతున్న ఎన్నికలలో పదోసారి అయ్యన్నపాత్రుడు పోటీ చేస్తున్నారు.

- 1977లో నర్సీపట్నం ఎమ్మెల్యేగా చేసిన బోళెం గోపాత్రుడు మనవరాలు బోళెం ముత్యాలపాప 2009లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. నియోజకవర్గం నుంచి తొలి మహిళా ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టారు.

Updated Date - Apr 29 , 2024 | 01:36 AM