Share News

పోలీసులు ఓవరాక్షన్‌

ABN , Publish Date - Mar 27 , 2024 | 01:15 AM

ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం అక్రమ రవాణా జరగకుండా రాత్రివేళ పోలీసులు నగరంలో ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

పోలీసులు ఓవరాక్షన్‌

రాత్రివేళ తనిఖీల సమయంలో వాహన చోదకుల పట్ల కొంతమంది దురుసు ప్రవర్తన

వాహనం ఆగకముందే తాళాలు లాగేస్తున్న కానిస్టేబుళ్లు

ప్రమాదాలకు ఆస్కారం

అదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే పోలీస్‌ వాహనంలో స్టేషన్‌కు తరలింపు

తెల్లవారుజాము వరకూ ఉంచి విడిచిపెడుతున్న వైనం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం అక్రమ రవాణా జరగకుండా రాత్రివేళ పోలీసులు నగరంలో ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో వాహనానికి సంబంధించిన పత్రాలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ అడగడం, ఎక్కడి నుంచి వస్తున్నారు?, ఎక్కడకు వెళుతున్నారని ఆరా తీయడం సహజం. వాహనం వివరాలతోపాటు వాహన చోదకుడి సెల్‌ఫోన్‌ నంబర్‌ నమోదు చేసుకుంటారు. అంతవరకూ అభ్యంతరం లేదు. అయితే కొంతమంది పోలీసులు ఇదే సమయంలో వాహనచోదకుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు.

నగరంలో రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజాము వరకూ అన్ని ముఖ్య కూడళ్లలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనాన్ని పక్కకు తీసి ఆపాలంటూ పోలీసులు సైగ చేస్తున్నారు. వాహన చోదకులు వాహనాన్ని రోడ్డుపక్కన ఆపుతున్న సమయంలో అక్కడే ఉన్న సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించి ఎక్కడ ఆపకుండా వెళ్లిపోతారోనని తాళం తీసేస్తున్నారు. ఈ క్రమంలో వాహన చోదకులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే వారి వద్ద నుంచి సెల్‌ఫోన్‌ లాక్కొని పోలీస్‌ జీపులో సమీపంలోని స్టేషన్‌కు తరలిస్తున్నారు. తెల్లవారుజాము వరకూ ఉంచి తర్వాత విడిచిపెడుతున్నారు. ఈనెల 24న అర్ధరాత్రి వేళ ఒక మీడియా సంస్థలో ఆపరేటర్‌గా పనిచేస్తున్న వ్యక్తి అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల సమయంలో విధులు ముగించుకుని శివాజీపాలెంలోని తన ఇంటికి బైక్‌పై వెళుతుండగా, పెదకృష్ణుడి గుడి వద్ద వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులు ఆపారు. వాహనం రికార్డులు అడిగిన సిబ్బంది వాటిని పరిశీలించి, ఎక్కడి నుంచి వస్తున్నావంటూ ప్రశ్నించారు. తాను ఒక మీడియా సంస్థలో పనిచేస్తున్నానని డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళుతున్నానని చెప్పారు. గుర్తింపు కార్డు చూపాలని సిబ్బంది కోరగా సంస్థ ఇచ్చిన గుర్తింపు కార్డుని చూపించాడు. అదికాకుండా జిల్లా కలెక్టర్‌ జారీచేసిన గుర్తింపు కార్డు చూపించాలని కోరడంతో తనకు అక్రిడిటేషన్‌ కార్డు లేదని చెప్పడంతో పోలీసులు అతని వాహనం, సెల్‌ఫోన్‌ తీసుకుని పోలీస్‌ వాహనంలో ఎంవీపీ స్టేషన్‌కు తరలించారు. తెల్లవారుజామున ఐదు గంటలకు విడిచిపెట్టారు. అలాగే సోమవారం మద్దిలపాలెం కూడలిలో ఎంవీపీ సీఐ, క్రైమ్‌ ఎస్‌ఐ ఆధ్వర్యంలో కొంతమంది కానిస్టేబుళ్లు వాహనాల తనిఖీలు చేశారు. రాత్రి 12 గంటల సమయంలో స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియం సమీపంలోని అపోలో ఫార్మశీకి మందుల కోసం ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తిని పోలీసులు ఆపారు. బైక్‌ను ఆపిన తర్వాత కానిస్టేబుల్‌ ఒకరు వచ్చి బైక్‌ను పక్కనపెట్టి పత్రాలు చూపించాలని ఆదేశించారు. బైక్‌ను రోడ్డు పక్కకు తీస్తుండగా మరో కానిస్టేబుల్‌ పరుగున వచ్చి తాళాలు తీసేశారు. ఆ సమయంలో బైక్‌ అదుపు తప్పి కిందపడిపోయే స్థితిలో పక్కనే ఉన్న ఎస్‌ఐ వాహనాన్ని పడిపోకుండా పట్టుకున్నారు. ఇదేం పద్ధతి...ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటని’ వాహనచోదకుడు ప్రశ్నించగా సదరు కానిస్టేబుల్‌ ఏకవచనంతో మాట్లాడుతూ ఎక్కువ మాట్లాడితే తెల్లవార్లు స్టేషన్‌లో కూర్చోవలసి ఉంటుందని బెదిరించారు. దీనిపై వాహనచోదకుడు ‘ఎదుటి వారికి కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడండి. మీకు ఎలాంటి పత్రాలు కావాలో అడగండి. వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసుకోండి. అనుమానం ఉంటే వాహనాన్ని ఉంచుకోండి. అంతేగానీ ఎదుటివారిని దూషించడం, ప్రమాదానికి గురయ్యేలా ప్రవర్తించడం మంచిది కాదు. దీనివల్ల పోలీస్‌ శాఖకే చెడ్డపేరు వస్తుందని’ చెబుతుండగా ఎస్‌ఐ అక్కడకు వెళ్లి ‘కుర్రాళ్లు కదా...వారి స్పీడ్‌ అలాగే ఉంటుంది. పట్టించుకోకండి’ అని వాహన చోదకుడిని సముదాయించి పంపించేశారు. ఇంత జరుగుతున్నా పక్కనే వున్న సీఐ కనీసం పట్టించుకోనట్టు వ్యవహరించడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. నగరంలో చాలాచోట్ల పోలీస్‌ తనిఖీల సమయంలో కొంతమంది సిబ్బంది తీరు ఇదేమాదిరిగా ఉంటోందని నగరవాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పోలీస్‌ ఉన్నతాధికారులు ఇప్పటికైనా దీనిపై దృష్టిసారించి సిబ్బందికి కౌన్సెలింగ్‌ చేయాలని కోరుతున్నారు.

Updated Date - Mar 27 , 2024 | 01:15 AM