Share News

ట్రాఫిక్‌ సమస్యపై పోలీసులు దృష్టి

ABN , Publish Date - May 29 , 2024 | 01:18 AM

నగరంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారంపై పోలీసులు దృష్టిసారించారు.

ట్రాఫిక్‌ సమస్యపై పోలీసులు దృష్టి

రోడ్డుపక్కన ఇష్టారాజ్యంగా నిలిపిన కార్లు, బైక్‌ల వీల్‌ లాక్‌

రూ.1,035 జరిమానా

రద్దీగా ఉండే ప్రాంతాల్లో స్ర్టైకింగ్‌ ఫోర్స్‌లతో స్పెషల్‌డ్రైవ్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారంపై పోలీసులు దృష్టిసారించారు. రోడ్లపై ఎక్కడికక్కడ వాహనాలను పార్కింగ్‌ చేస్తుండడంతో రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోంది. వాహనదారులను ఎన్నిసార్లు హెచ్చరించినా మార్పు కనిపించడం లేదు. దీంతో రాంగ్‌ పార్కింగ్‌ చేస్తే వీల్‌లాక్‌ చేసి, జరిమానాలు విధించాలని పోలీస్‌ అధికారులు నిర్ణయించారు. దీనికోసం స్ర్టైకింగ్‌ ఫోర్స్‌లతో ప్రత్యేక డ్రైవ్‌లకు శ్రీకారం చుట్టారు.

నగరంలో వాహనాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. వాహనాల పెరుగుదలకు అనుగుణంగా రోడ్ల విస్తరణ జరగడం లేదు. దీంతో ప్రధాన రోడ్లన్నీ వాహనాలతో రద్దీగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా వాణిజ్య ప్రాంతాల్లో వాహనాలను రోడ్లపైనే పార్కింగ్‌ చేసుకోవాల్సి వస్తోంది. కాస్తదూరంగా వాహనాల పార్కింగ్‌కు అవకాశం ఉన్నప్పటికీ వాహన చోదకులు అంతవరకూ వెళ్లడం ఎందుకనే భావనతో రోడ్డుపైనే పార్క్‌ చేసి షాపింగ్‌కు వెళ్లిపోతున్నారు.దీనివల్ల రహదారులు ఇరుకుగా మారి వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడి తరచూ ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. నగరంలో ద్వారకానగర్‌, ఆశీల్‌మెట్ట, జగదాంబ జంక్షన్‌, శంకరమఠం రోడ్డు, అక్కయ్యపాలెం, మద్దిలపాలెం, పూర్ణామార్కెట్‌, డాబా గార్డెన్స్‌ వంటి ప్రాంతాల్లో రోడ్లపైనే వాహనాలను నిలిపివేస్తుండడంతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. దీనివల్ల ఆ మార్గంలో ప్రయాణించే వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది. రాంగ్‌ పార్కింగ్‌లపై పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా వాహన చోదకుల్లో మార్పు రావడం లేదు. రోడ్డుపై వాహనం నిలిపి వెళ్లిపోయిన వ్యక్తి గంటలపాటు తిరిగి రాకపోవడంతో పోలీసులు అంతసేపు వేచి ఉండలేక మరోచోటకు వెళ్లిపోతున్నారు. ఇది వాహన చోదకుల్లో నిర్లక్ష్యాన్ని మరింత పెంచేందుకు దోహదమవుతోందనే భావన పోలీస్‌ అధికారుల్లో ఏర్పడింది. దీనిని అధిగమించేందుకు రాంగ్‌ పార్కింగ్‌ చేసే కార్లు, బైక్‌లకు వీల్‌లాక్‌ చేయాలని నిర్ణయించారు. దీనికోసం ఏకంగా 200 వీల్‌ లాక్‌లను కొత్తగా కొనుగోలు చేశారు. ఈనెల 25న సీపీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ వీటిని సంపత్‌వినాయగర్‌ ఆలయం రోడ్డులో ప్రారంభించారు. రాంగ్‌ పార్కింగ్‌ చేసిన కార్లు, బైక్‌ల చక్రాలకు పోలీసులు లాక్‌ చేసి వెళ్లిపోతారు. వాహనదారుడు వీల్‌లాక్‌పై ఉన్న నంబర్‌కు ఫోన్‌ చేస్తే సమీపంలో ఉండే పోలీసులు వచ్చి రూ.1,035 జరిమానా విధిస్తారు. జరిమానా చెల్లించిన తర్వాత వాహనాన్ని విడుదల చేస్తారు. దీనివల్ల వాహనదారులు రోడ్డుపై నిర్లక్ష్యంగా తమ వాహనాలను పార్కింగ్‌ చేయకుండా కేటాయించిన ప్రాంతంలోనే పార్కింగ్‌ చేస్తారనేది పోలీసుల భావన. దీనిపై సీపీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ వద్ద ప్రస్తావించగా నగరంలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉందని, దీనిని అధిగమించేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. ప్రధానంగా రద్దీ ప్రాంతాల్లో దృష్టిపెట్టామన్నారు. రోడ్డుపై నిర్లక్ష్యంగా పార్కింగ్‌ చేసిన వాహనాలకు వీల్‌ లాక్‌ చేస్తామన్నారు. జరిమానా చెల్లించిన తర్వాతే వాహనాలను తీసుకువెళ్లే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాహనదారుల వైఖరిలో కచ్చితంగా మార్పు వస్తుందన్నారు. వాణిజ్య ప్రాంతాలుగా గుర్తింపు పొందిన ప్రాంతాల్లో స్ర్టైకింగ్‌ ఫోర్స్‌లను ఏర్పాటుచేసి స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగిస్తామన్నారు.

Updated Date - May 29 , 2024 | 01:18 AM