Share News

ఏవోబీలో పోలీసులు అప్రమత్తం

ABN , Publish Date - Jul 28 , 2024 | 11:23 PM

మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదివారం నుంచి వారోత్సవాలు ప్రారంభం కావడంతో జిల్లాలో వాహనాల తనిఖీలను ముమ్మరంగా నిర్వహించారు.

ఏవోబీలో పోలీసులు అప్రమత్తం
వాహనాలను తనిఖీ చేస్తున్న సీఐ రమేశ్‌, ప్రత్యేక పోలీసులు

అమరవీరుల వారోత్సవాలతో 24 గంటలు వాహన తనిఖీలు

అనుమానితులపై ఆరా

ప్రధాన రోడ్లపై బాంబు స్వ్కాడ్‌ పరిశీలన

సీలేరు మీదుగా వెళ్లే భద్రాచలం బస్సులు రద్దు

ఎప్పటికప్పుడు ఎస్‌పీ అమిత్‌బర్దార్‌ సమీక్ష

పాడేరు/ చింతపల్లి/సీలేరు, జూలై 28: మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదివారం నుంచి వారోత్సవాలు ప్రారంభం కావడంతో జిల్లాలో వాహనాల తనిఖీలను ముమ్మరంగా నిర్వహించారు. ప్రధానంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి జిల్లాలోకి ప్రవేశించే మార్గాల్లో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. మావోయిస్టులు ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా సరిహద్దుల్లో పోలీస్‌ స్టేషన్లల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్దార్‌ జిల్లా పోలీసు యంత్రాంగానికి సూచించారు. ఏవోబీ ముఖద్వారమైన చింతపల్లి, జీకేవీధి మండలాల్లో పోలీసులు 24 గంటలు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం స్థానిక సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.రమేశ్‌ పర్యవేక్షణలో లంబసింగి, అన్నవరం, లోతుగెడ్డ, డిగ్రీ కళాశాల, హనుమాన్‌ జంక్షన్‌ల వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ, అనుమానితులపై ఆరా తీస్తూ.. గుర్తింపు కార్డులను పరిశీలించి విడిచిపెడుతున్నారు. రహదారులు ఇరువైపులా కల్వర్టులు, బ్రిడ్జీల వద్ద బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలు తనిఖీ చేస్తున్నాయి. ఏవోబీ సరిహద్దుల్లో సీలేరు పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆదివారం సీలేరు ఎస్‌ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో సీఆర్‌పీఎఫ్‌ బలగాలు అనుమానిత ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చే, పోయే వాహనాలను తనిఖీ చేశారు. కొత్త వ్యక్తులపై ఆరా తీస్తూ గుర్తింపు కార్డులను పరిశీలించారు. అలాగే వారోత్సవాల నేపథ్యంలో సీలేరు మీదుగా భద్రాచలం తిరిగే నైట్‌ సర్వీస్‌ బస్సులను పీటీడీ అధికారులు రద్దు చేశారు. ఆదివారం నుంచి ఆగస్టు 3 వరకు సీలేరు మీదుగా భద్రాచలం వెళ్లే నాలుగు బస్సులను రద్దు చేస్తున్నట్టు పీటీడీ అధికారులు తెలిపారు. దీంతో ఈ ప్రాంత ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Updated Date - Jul 28 , 2024 | 11:23 PM