Share News

న్యూ ఇయర్‌ వేడుకల నిర్వహణకు అనుమతి తప్పనిసరి

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:51 AM

నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించదలచుకున్న హోటళ్లు, పబ్బులు, క్లబ్‌లు తప్పనిసరిగా పోలీస్‌ అనుమతి తీసుకోవాలని సీపీ శంఖబ్రతబాగ్చి స్పష్టంచేశారు.

న్యూ ఇయర్‌ వేడుకల నిర్వహణకు అనుమతి తప్పనిసరి

  • నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చీ

  • హోటళ్లు, క్లబ్‌ల, పబ్బుల నిర్వాహకులు ఒంటి గంటకల్లా కార్యక్రమాలు నిలిపివేయాలి

  • డిసెంబరు 31వ తేదీ రాత్రి తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ మూసివేత

  • బీచ్‌రోడ్డులో డ్రోన్లతో నిఘా

  • ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

విశాఖపట్నం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి):

నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించదలచుకున్న హోటళ్లు, పబ్బులు, క్లబ్‌లు తప్పనిసరిగా పోలీస్‌ అనుమతి తీసుకోవాలని సీపీ శంఖబ్రతబాగ్చి స్పష్టంచేశారు. అనుమతి తీసుకున్నప్పటికీ ఏపీ పబ్లిక్‌ సేఫ్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ యాక్ట్‌-2013 ప్రకారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటకు కార్యక్రమాలను నిలిపివేయాల్సి ఉంటుందన్నారు. వేడుకలు నిర్వహించేవారు ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడం, సామర్థ్యం మేరకు మాత్రమే టిక్కెట్లు విక్రయించడం, ట్రాఫిక్‌కు ఇబ్బందిలేకుండా పార్కింగ్‌ సదుపాయం కల్పించడం చేయాల్సి ఉంటుందన్నారు. వేడుకల్లో మద్యంసేవించిన వారిని ఇళ్లకు సురక్షితంగా చేర్చేందుకు వీలుగా డ్రైవర్లు, వాహనాలను నిర్వాహకులే ఏర్పాటుచేసుకోవాల్సి ఉంటుందన్నారు. వేడుకలకు హాజరయ్యేవారు ప్రవేశించడానికి, బయటకు వెళ్లడానికి వేర్వేరుగా మార్గాలను ఏర్పాటుచేయడంతోపాటు, సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలన్నారు. దంపతుల కోసం ఈవెంట్‌ నిర్వహించేవారు మైనర్లను అనుమతించడం నేరమన్నారు. అలాగే ఎక్సైజ్‌ శాఖ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే మద్యం అందుబాటులో ఉంచాలని, మైనర్లకు అందకుండా చూసుకోవాలనన్నారు. గంజాయి, డ్రగ్స్‌ వంటి వినియోగానికి ఆస్కారం లేకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మద్యం మత్తులో ఉన్నవారు స్విమ్మింగ్‌పూల్స్‌లో దిగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వేడుకల పేరుతో అశ్లీల నృత్యాలు ప్రదర్శించడం, బాణసంచా కాల్చడం, మితిమీరిన శబ్దం వచ్చేలా సౌండ్‌ సిస్టమ్‌ ఏర్పాటుచేయడం చేస్తే కేసులు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు.

న్యూఇయర్‌ పేరుతో హద్దుమీరితే కేసులే

కొత్త సంవత్సరం వేడుకల పేరుతో ఎవరైనా హద్దుమీరి ప్రవర్తిస్తే కేసులు నమోదుచేస్తామని సీపీ హెచ్చరించారు. డిసెంబరు 31వ తేదీ రాత్రి ఎనిమిది నుంచి జనవరి ఒకటో తేదీ ఉదయం ఐదు గంటల వరకూ తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ తోపాటు జీవీఎంసీ అండర్‌పా్‌స రోడ్డును మూసివేస్తామన్నారు. అలాగే మద్దిలపాలెం నుంచి రామాటాకీస్‌, హనుమంతవాక నుంచి ఎన్‌ఏడీ జంక్షన్‌, గోశాల జంక్షన్‌ నుంచి వేపగుంట జంక్షన్‌ వరకూ బీఆర్‌టీఎ్‌స రోడ్లు మూసివేస్తామన్నారు. అత్యవసరమైనవారు రెండు వైపులా ఉన్న సర్వీస్‌ రోడ్డులో వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఆకతాయిలకు చెక్‌ చెప్పేందుకు నోవాటెల్‌ జంక్షన్‌, ఆర్కే బీచ్‌, భీమిలి, గాజువాక, పెందుర్తి పరిసరాల్లో షీటీమ్స్‌ను ఏర్పాటుచేస్తున్నామన్నారు. బీచ్‌రోడ్డులో జనాలను 12 గంటల తరువాత బయటకు పంపించేస్తామని, అక్కడ బాణసంచా కాల్చేవారిని, శుభాకాంక్షలు చెప్పే పేరుతో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించేవారిని గుర్తించడం కోసం డ్రోన్లతో నిఘా పెడుతున్నామన్నారు. అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లతో వాహనాలను నడపడం, అపరిమిత వేగంగా వాహనాలను నడపడం వంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఎక్కడికక్కడ పోలీస్‌ బీట్లు ఏర్పాటుచేస్తామన్నారు. మద్యం సేవించి వాహనం నడిపితే వాహనం సీజ్‌ చేయడంతోపాటు కోర్టులో హాజరుపరచడం, లైసెన్స్‌ను మూడు నెలలు రద్దు చేయడం జరుగుతుందని సీపీ హెచ్చరించారు. ప్రజలంతా సురక్షితంగా ఉండే మార్గంలో వేడుకలు జరుపుకోవాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

Updated Date - Dec 27 , 2024 | 12:51 AM