పింఛన్ పండుగ
ABN , Publish Date - Jun 27 , 2024 | 01:00 AM
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం వచ్చే నెల ఒకటో తేదీన పెంచిన పింఛన్ మొత్తం పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది.

ఒకటో తేదీన రూ.4,000 పంపిణీకి ఏర్పాట్లు
జిల్లాలో 1,64,139 మంది కోసం రూ.112.21 కోట్లు మంజూరు
ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి 1,000 చొప్పున కలిపి ఒక్కొక్కరికి 7,000 అందజేత
ఇంటి వద్దే పంపిణీకి ఏర్పాట్లు
సచివాలయ సిబ్బందికి బాధ్యతలు అప్పగింత
విశాఖపట్నం, జూన్ 26 (ఆంధ్రజ్యోతి):
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం వచ్చే నెల ఒకటో తేదీన పెంచిన పింఛన్ మొత్తం పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లు గీత, మత్స్యకార, ఒంటరి మహిళ, ట్రాన్స్‌జండర్, డప్పు కళాకారులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.మూడు వేల పింఛన్‌ను కూటమి ప్రభుత్వం రూ.నాలుగు వేలకు పెంచింది. అలాగే దివ్యాంగులకు ఇచ్చే పింఛన్‌ను రూ.మూడు వేల నుంచి రూ.ఆరు వేలకు, పూర్తి వైకల్యంతో కదల్లేని స్థితిలో ఉన్నవారికి, కిడ్నీ, లివర్ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే పింఛన్‌ను రూ.5 వేల నుంచి రూ.15 వేలకు పెంచింది. ఈ మేరకు జిల్లాలో 1,64,139 మందికి రూ.112.21 కోట్లు మంజూరుచేసింది. సాధారణంగా జిల్లాలో సామాజిక పింఛన్లకు రమారమి రూ.49 కోట్లు అవసరం పడేది. కానీ, ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి వెయ్యి చొప్పున మూడు వేలు కలిపి మొత్తం రూ.7 వేలు జూలై ఒకటో తేదీన పింఛన్‌దారులకు పంపిణీ చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు ప్రకటించారు. ఆ మేరకు జిల్లాలకు నిధులు కేటాయించారు. ఆగస్టు నుంచి జిల్లాకు రూ.64 కోట్లు వరకూ అవసరం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కాగా, లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేసే బాధ్యతను గ్రామ/వార్డు సచివాలయాల కార్యదర్శులకు ప్రభుత్వం అప్పగించింది. ఈ నేపథ్యంలో వలంటీర్ల వద్దనున్న బయోమెట్రిక్ డివైజ్‌లు, ఫోన్లను ఇప్పటికే సచివాలయాల సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఆ డివైజ్‌లతో సచివాలయ సిబ్బంది పింఛన్ల పంపిణీ కోసం ఆన్‌లైన్‌లో లాగిన్ కానున్నారు. ఈనెల 30వ తేదీ ఆదివారం కావడంతో 29వ తేదీనే సచివాలయాల సిబ్బందికి పింఛన్ నగదు అందజేస్తారు. జూలై ఒకటో తేదీన పెంచిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కూటమి పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొననున్నారు. పింఛన్ల కార్యక్రమం పండుగలా చేపట్టాలని ఇప్పటికే ప్రభుత్వం సూచించింది. దీని ప్రకారం ప్రజా ప్రతినిధులతోపాటు కూటమి పార్టీల నుంచి ఎవరెవరు పాల్గొంటారో జాబితాను అధికారులు తీసుకుంటున్నారు.