కొత్తవీధి బైపాస్ రోడ్డుకి మార్గం సుగమం
ABN , Publish Date - Dec 28 , 2024 | 12:18 AM
మునిసిపాలిటీలో అసంపూర్తిగా నిలిచిపోయిన కొత్తవీధి బైపాస్ రోడ్డు నిర్మాణ పనులకు మార్గం సుగమం అయ్యింది. ఈ పనులను 15వ ఆర్థిక సంఘం నిధులతో పూర్తి చేయడానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు చొరవ తీసుకున్నారు. కొత్తవీధి శ్మశానవాటిక నుంచి ఆర్‌అండ్‌బీ బంగ్లా వరకు రోడ్డుకి ఇరువైపుల డ్రైనేజీల నిర్మాణానికి రూ.44.87 లక్షలు, చర్చి దగ్గర నుంచి డాన్‌బాస్కో కళాశాల వరకు బీటీ రోడ్డుకి రూ.33 లక్షలతో మునిసిపల్ అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు.

ఆగిన పనులను పూర్తిచేయించడానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు చొరవ
15వ ఆర్థిక సంఘం నిధులతో పనులు
ప్రతిపాదనలు తయారు చేసిన మునిసిపల్ అధికారులు
నర్సీపట్నం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీలో అసంపూర్తిగా నిలిచిపోయిన కొత్తవీధి బైపాస్ రోడ్డు నిర్మాణ పనులకు మార్గం సుగమం అయ్యింది. ఈ పనులను 15వ ఆర్థిక సంఘం నిధులతో పూర్తి చేయడానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు చొరవ తీసుకున్నారు. కొత్తవీధి శ్మశానవాటిక నుంచి ఆర్‌అండ్‌బీ బంగ్లా వరకు రోడ్డుకి ఇరువైపుల డ్రైనేజీల నిర్మాణానికి రూ.44.87 లక్షలు, చర్చి దగ్గర నుంచి డాన్‌బాస్కో కళాశాల వరకు బీటీ రోడ్డుకి రూ.33 లక్షలతో మునిసిపల్ అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు.
గత వైసీపీ ప్రభుత్వం వేంకటేశ్వరస్వామి గుడి దగ్గర నుంచి కొత్తవీధి మీదుగా పెదబొడ్డేపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ వరకు 2.5 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి రూ.6 కోట్లు మంజూరు చేసింది. ఈ ఏడాది మే నెలలో సాధారణ ఎన్నికల సమయానికి శ్మశానవాటిక నుంచి పెదబొడ్డేపల్లి డాన్ బాస్కో కళాశాల ప్రహరీ గోడ వరకు కిలోమీటరు మేర బీటీ రోడ్డు నిర్మాణం చేశారు. పెద్దచెరువు గట్టున జాతీయ నేతల విగ్రహాలు ఏర్పాటు చేసి రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటించారు. ఈ పనులకు సుమారు రూ.1.25 కోట్లు ఖర్చు చేశారు. బిల్లులు మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు ఆపేశారు. ఇంకా వేంకటేశ్వరస్వామి గుడి దగ్గర నుంచి కొత్తవీధి శ్మశానవాటిక వరకు, డాన్ బాస్కో కాలేజీ వెనుక భాగంలో చర్చి దగ్గర బీటీ రోడ్డు వేయాల్సి ఉంది. అదే విధంగా వేంకటేశ్వరస్వామి గుడి దగ్గర నుంచి కొత్తవీధి వరకు రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజీ కాలువలు నిర్మించాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు శాసనసభ స్పీకర్ అయ్యారు. ఆయన చొరవతో 15వ ఆర్థిక సంఘం నిధులతో మిగిలిన రోడ్డు పనులు పూర్తి చేయడానికి మునిసిపల్ అధికారులు ప్రతిపాదనలు పెట్టారు. శ్మశానవాటిక నుంచి ఆర్‌అండ్‌బీ బంగ్లా వరకు రోడ్డుకి ఇరువైపుల డ్రైనేజీల నిర్మాణానికి రూ.44.87 లక్షలు, చర్చి దగ్గర నుంచి డాన్‌బాస్కో కళాశాల వరకు బీటీ రోడ్డుకి రూ.33 లక్షలతో ప్రతిపాదనలు రూపొందించారు. కొత్తవీధి నుంచి వేంకటేశ్వరస్వామి గుడి వరకు మిగిలిన పనులు పూర్తి చేస్తే బైపాస్ రోడ్డు పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.
ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం
వేంకటేశ్వరస్వామి గుడి నుంచి పెదబొడ్డేపల్లి వరకు రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తే పట్టణంలో ట్రాఫిక్ సమస్య కొంతమేర తగ్గుతుంది. పెదబొడ్డేపల్లి, చెట్టుపల్లి వెళ్లే ద్విచక్రవాహనాలు, ఆటోలు టౌన్‌లోకి వచ్చే అవసరం లేకుండా సరస్వతి జంక్షన్ దగ్గర నుంచి వేంకటేశ్వరస్వామి గుడి, కొత్తవీధి రోడ్డు మీదుగా పెద్దబొడ్డేపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ పక్క నుంచి చోడవరం వైపు వెళ్లే మెయిన్ రోడ్డులోకి ప్రవేశించవచ్చు. కిలో మీటరుపైగా దూరం తగ్గడంతోపాటు ట్రాఫిక్ సమస్య కూడా తొలగుతుంది.