పంత్ వర్సెస్ శ్రేయాస్
ABN , Publish Date - Apr 03 , 2024 | 01:20 AM
నగరంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో బుధవారం జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి.

నేడు ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్
వరుస విజయాల ఊపుమీదున్న కోల్‌కతా
సీఎస్‌కేపై సాధించిన విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఆత్మవిశ్వాసం
ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి
విశాఖపట్నం (స్పోర్ట్సు), ఏప్రిల్ 2:
నగరంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో బుధవారం జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లకు ఏసీఏ-వీడీసీఏ స్టేడియాన్ని హోమ్ గ్రౌండ్‌గా చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్...ఆదివారం ఇక్కడ బలమైన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. ఢిల్లీ క్యాపిటల్స్ జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో, ముల్లాన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైనా, హోమ్ గ్రౌండ్‌లో సీఎస్‌కేపై విజయం సాధించడంతో ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. జట్టులో టాప్ ఆర్డర్ డేవిడ్ వార్నర్, పృథ్వీషా, కెప్టెన్ రిషబ్ పంత్, మిచెల్ మార్ష్ ఫామ్‌లో ఉన్నారు. ఇప్పటికే వరుసగా రెండు విజయాలతో జోరు మీద ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్‌పై కూడా విజయం సాధించాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తోంది.
మరోవైపు బలమైన రాయల్ చాలెంజర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లపై వరుస విజయాలు సాధించి మంచి ఊపు మీదున్న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) బుధవారం జరిగే ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరాలనే లక్ష్యంతో ఉంది. కేకేఆర్ జట్టులో ఆల్‌రౌండర్ ఆండ్రి రసూల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అలాగే ఓపెనర్ ఫిల్ సాల్ట్‌తోపాటు సునీల్ నరైన్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రణదీప్‌సింగ్, రింకు సింగ్‌తో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. కాగా ఈ సీజన్‌లో అత్యధిక పారితోషకం (రూ.24.75 కోట్లు) అందుకుంటున్న ఆస్ర్టేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ అదనపు బలం. అయితే ఇప్పటివరకూ రెండు మ్యాచ్‌లలో మిచెల్ స్టార్క్ ఒక వికెట్ కూడా పడగొట్టలేదు. ఏదేమైనా సీఎస్‌కేపై సాధించిన విజయం, హోమ్ గ్రౌండ్‌లో ఆడనుండడం ఢిల్లీ క్యాపిటల్స్‌కు, వరుస విజయాలు, ఆల్‌రౌండర్ రసూల్ ఫామ్‌లో ఉండడం కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కలిసివచ్చే అంశాలని చెప్పవచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్ పంత్, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం వహిస్తున్నారు. మ్యాచ్ బుధవారం రాత్రి 7.30 గంటల నుంచి ప్రారంభం కానున్నది. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు. కాగా ఇరుజట్ల ఆటగాళ్లు మంగళవారం సాయంత్రం ముమ్మర సాధన చేశారు.